చైనా పెద్ద కుట్ర... పీఎం మోడీతో సహా వేల మంది ప్రముఖుల పై గూఢచర్యం
ఇండియా చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనగా ఒక పక్క చైనా మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోందనే విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుండగా మరో పక్క కంటికి కనిపించకుండా డ్రాగన్ దేశం మరో కుట్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కుట్రలో భాగంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సుప్రీం కోర్టు సిజెఐ బాబ్డే, సహా కేంద్ర మంత్రులపై గూఢ చర్యం చేయడానికి చైనా కుట్ర పన్నింది. దీనికి సంబంధించి కొన్ని కంపెనీలతో చైనా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లుగా ఒక జాతీయ దినపత్రిక సంచలన విషయాలను వెల్లడించింది.
దీనికి సంబంధించి చైనాకు చెందిన "షెన్‌జేన్" అనే సంస్థతో కలిసి చైనా గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆ పత్రిక తెలిపింది. ఈ షెన్‌జేన్ సంస్థకు చైనా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా ఆ పత్రిక పేర్కొంది. కొద్ది రోజుల క్రితం సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా వస్తువులు, యాప్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో చైనా ఈ దుశ్చర్యకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది.
ఈ నిఘాలో సాక్షాత్తు రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ మాత్రమే కాకుండా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు.. ఇలా దాదాపు 10,000 మందిపై చైనా గూఢ చర్యానికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఆ పది వేల మందిలో ముఖ్యంగా రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ బాబ్డే, రాజ్‌నాథ్, పీయూశ్ గోయల్, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు సోనియా గాంధీ తోపాటు ఆమె కుటుంబం, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్ ఉన్నారు. అంతేకాకుండా పారిశ్రామిక దిగ్గజాలు రతన్ టాటా, గౌతమ్ అదానీ వంటి ప్రముఖుల పై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రముఖులే కాక ఇండియాలోని అధికారులు, జడ్జిలు, సైంటిస్టులు, విద్యా వేత్తలు, జర్నలిస్టులు, నటులు, మీడియా ప్రతినిధులు, మత పెద్దలు, ఉద్యమ కారులపైనా నిఘా పెట్టినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆర్థిక నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, డ్రగ్స్, బంగారం, ఆయుధాల స్మగ్లింగ్‌కి పాల్పడే వారిపైనా నిఘా కొనసాగుతున్నట్లుగా తెల్సుస్తోంది. ఈ సంస్థ చైనా నిఘా వర్గాలు, సైనిక, భద్రతా ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోందని తెలిసింది.
ఈ ప్రముఖుల డిజిటల్ లైఫ్ ను చైనా కంపెనీలు ఫాలో అవుతున్నాయని, అలాగే వారి కుటుంబీకులు, మద్దతు దారులు పని తీరుపై కూడా చైనా కంపెనీ నిఘా పెట్టిందని ఆ పత్రిక పేర్కొంది. అంతేకాకుండా ఈ పదివేల మంది ప్రముఖుల "రియల్ టైమ్ డేటా" ను కూడా చైనా కంపెనీలు పూర్తిగా సిద్ధం చేసుకున్నాయి. ఈ గూఢచర్యం కోసం చైనా ప్రభుత్వం, షెన్‌జాన్ సంస్థ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ కలిసి "ఇన్ఫర్మేషన్ డాటా" అనే స్థావరాన్ని సృష్టించి, ఈ మిషన్ నడుపుతున్నాయని ఆ జాతీయ పత్రిక తెలిపింది.
గత రెండు నెలలుగా తాము పెద్ద పెద్ద డేటా టూల్స్ వాడి ఈ పరిశోధన చేసినట్లుగా ఆ పత్రిక తెలిపింది. ఈ షెన్‌జేన్ కంపెనీ ఇండియాతోపాటూ... అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా కెనడా, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా డేటా సేకరిస్తున్నట్లుగా తెలిపింది. అయితే ఈ డేటాను చైనా పాలకులు ఈ కంపెనీ నుండి ఎందుకు కలెక్ట్ చేస్తున్నారనే సంగతి తేలాల్సి ఉంది.