విజయసాయి వెన్నులో వణుకు మొదలయ్యింది.. అందుకే న్యాయవ్యవస్థ పై దాడి

రాజ్యసభలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరోనా పోరులో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల ఎండగట్టారు. అయితే ఆ తర్వాత మాట్లాడిన విజయసాయి.. కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడకుండా ఇతర విషయాలు ప్రస్తావిస్తూ.. కోర్టులని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాయని, తమ ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   ఈ క్రమంలో సబ్జెక్ట్ దాటి మాట్లాడుతున్నారంటూ.. విజయసాయిని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా విజయసాయి ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతూ పోయారు. ఈ సందర్భంగా కనకమేడల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా గురించి మాట్లాడకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి పార్లమెంటులో మాట్లాడటం దారుణమని, కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని కనకమేడల విమర్శించారు.   రాజ్యసభలో కోర్టులపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలోపే ఆర్థిక అవినీతి కేసుల విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీం కోర్టు నిర్ణయించడంతో విజయసాయి వెన్నులో వణుకు మొదలయ్యింది. అందుకే న్యాయవ్యవస్థ పై దాడి చేస్తున్నారు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు.    కాగా, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే విజయసాయి వెన్నులో వణుకు మొదలయ్యిందని బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.   "11 ఛార్జ్ షీట్లు,లక్ష కోట్ల దోపిడీ, సూట్ కేసు కంపెనీల సూత్రదారి, క్విడ్ ప్రో కో పిత, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన విజయసాయి రెడ్డి, వైఎస్ జగన్ లు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడటం వింతగా ఉంది." అంటూ ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న విమర్శించారు.

రష్యా వ్యాక్సిన్ తో కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ ఊహించినవే

ప్రపంచం మొత్తం కరొనాతో సతమతమవుతోంది. ఒక్క మనదేశంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా అర కోటి.. అంటే 50 లక్షలకు చేరాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్-v" ను రిజిస్టర్ చేసిన రష్యా తాజాగా దీని పై జరిగిన ట్రయల్స్ ఫలితాలను రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ మురష్కో ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చాయని అయన చెప్పారు. అయితే ఈ సైడ్ ఎఫెక్స్ అన్నీ తాము ముందుగా ఊహించినవేనని అంతేకాకుండా అవి సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో తగ్గి పోతాయని అయన తెలిపారు.   ఇది ఇలా ఉండగా తమ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రపంచ వ్యాప్తంగా త్వరలో ప్రారంభవుతాయని రష్యా ఈమధ్య ప్రకటించింది . దాదాపు 40 వేల మందికి ఈ టీకా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో రష్యా ఇప్పటికే 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ మొదటి డోసు ఇవ్వగా మరో డోసు 21 రోజుల తరువాత ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీర్ల కోసం ఒక యాప్‌ను రూపొందించారు. ఒక వేళ ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆ యాప్‌ ద్వారా తెలియజేయాలని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కోసం 55 వేల మంది వాలంటీర్లు ముందుకు రాగా వీరిలో 40 వేల మందిని ఎంపిక చేసి వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు అక్టోబర్ నవంబర్ మధ్య వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకపక్క మూడో దశ ట్రయల్స్ జరుగుతుండగానే రష్యాలో ప్రజలందరికి నవంబర్ చివరి నుండి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

జీవిత కాలం సంపాదించిన ఆస్తిని దానంగా ఇచ్చేసిన అమెరికా కుబేరుడు

తరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా ఇంకా వేల కోట్ల సంపాదన కోసం కక్కుర్తి పడే మహానుభావులు ఉన్న ఈ కాలంలో అమెరికా కు చెందిన ఒక పారిశ్రామికవేత్త ఏకంగా తన జీవితకాలం కష్టపడి సంపాదించిన 58 వేల కోట్ల ఆస్తిని గుప్త దానంగా ఇచ్చేసారు. అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, విమానాశ్రయాల్లో ఉండే "డ్యూటీ ఫ్రీ షాపర్స్" సహ వ్యవస్థాపకుడు చార్లెస్ చక్ ఫీనీ తనకున్న యావదాస్తిని గుప్త దానం చేసేశారు. ప్రస్తుతం అయన ఆస్తి మొత్తం విలువ 58 వేల కోట్ల రూపాయలు. 2012లోనే ఈ మొత్తాన్ని ఆయన తన స్వచ్ఛంద సంస్థ "అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌" ద్వారా దానం చేయనున్నట్టు ప్రకటించారు. అయన ఇలా దానంగా ఇచ్చిన దానిలో సగ భాగాన్ని విద్య కోసమే అందించారు. మిగిలిన దానిని మానవ హక్కులు, సామాజిక మార్పులు, ఆరోగ్య సమస్యలు వంటి అంశాల్లో తోడ్పడేందుకు దానంగా ఇచ్చారు. ఈ నెలతో ఆయన దానాలు పూర్తైపోవడంతో.. ఈ నెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం కూడా ముగిసింది. పదవీ విరమణ తర్వాత అయన తన భార్యతో కలిసి జీవించేందుకు కేవలం రూ.14కోట్లనే ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు.   ఈ సందర్భంగా ఫీని మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా నేర్చుకున్నానని, అయితే తాను బతికి ఉండగానే ఈ మంచి కార్యక్రమం పూర్తయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అయన ఫోర్బ్స్‌ పత్రికతో వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 58వేల కోట్ల ఆస్తిని కలిగిన ఈ అపర కుబేరుడు ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక మామూలు అపార్ట్‌మెంట్ లో తన భార్యతో కలిసి ఓ మధ్యతరగతి వ్యక్తి లాగా విశ్రాంత జీవితాన్ని గడుపుతుండటం మరో విశేషం. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించి అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్న బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ఇద్దరూ కూడా తమ దాతృత్వం వెనుక స్ఫూర్తి ఫీనీయే అని చెప్పడం విశేషం. "మేము సంపాదించిన అపార సంపదను దానం చేసేందుకు చక్‌ మాకు ఓ దారిని ఏర్పరిచాడు. మన ఆస్తిలో సగం కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాడు’’ అని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు.

13నెలల రెండు రోజుల తర్వాతే జాతీయపతాకం ఎగిరింది

అదే పోరాట స్ఫూర్తి మరోసారి   లక్షలాది మంది భారతీయులు ఐక్యగళంతో స్వేచా గీతాన్ని ఆలపించగా బ్రిటిష్ రాజరికవ్యవస్థ తలవంచి వెనుతిరిగింది. స్వాతంత్య్రం కోసం సాగిన శతాబ్దాల పోరాటం ఫలితంగా ఎర్రకోటపై 15ఆగస్టు 1947న త్రివర్ణ పతాకం ఎగిరింది. దేశమంతా సంబురాలు అంబరాన్ని అంటిన వేళ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న హైదరబాద్ సంస్థాన ప్రజలు మాత్రం బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరో పోరాటానికి సన్నద్దంగా ఉన్నారు. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ్రిటిష్ వారు వెళ్ళిపోవడంతో  భారత్ లోనూ, పాకిస్తాన్ లోను కలవకుండా స్వతంత్రంగా ఉంటానంటూ ప్రకటించాడు. అయితే  సంస్థానంలోని ప్రజలు మాత్రం భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. వారి ఆకాంక్ష నెరవేరడానికి హైదరాబాద్ లో జాతీయ పతాకం ఎగరడానికి 13నెలల రెండు రోజులు పట్టింది. మరో స్వాతంత్య్ర పోరాటం అవసరమైంది.   ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక రాష్ట్రాల్లోని  కొన్ని జిల్లాలు కలిసి హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. ఇక్కడ కొనసాగే ప్యూడల్ పాలన లో  ఒకవైపు  జాగీర్దార్లు, భూస్వాముల వెట్టి చాకిరి చెరలో గ్రామీణ ప్రజానీకం బానిసలుగా బతికేవారు. మరోవైపు నిజాం అండతో చెలరేగిపోయిన రజాకార్లు  గ్రామాలపై పడి ప్రజలను దోచుకుంటూ వారి ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడేవారు. నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తానని తన అహంకారాన్ని చాటుకున్నాడు. దాంతో హైదరాబాద్ సంస్థానంలోని పార్టీలు, ప్రజాసంఘాలు నిజాం వ్యతిరేక పోరాటానికి సిద్ధమయ్యాయి. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెసు నాయకులు ఉద్యమంలో పాలుపంచుకునారు. ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టగా ఈ సంస్థలన్నింటి పై ఉక్కుపాదం మోపాడు నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్. పోరాడి సాధించుకున్న స్వేచ్ఛాభారతంలో మతఘర్షణలు, ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకపోవడంతో హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. ఆనాటి హోంశాఖ మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నేతృత్వంలో సైనిక చర్య తప్పదని  నిర్ణయించుకున్నారు. దానికి ఆపరేషన్ పోలో, పోలీస్ యాక్షన్ పేరు పెట్టారు. అయితే కేంద్రం తనపై చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోరడంతో పాటు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.. దాంతో పరిస్థితి చేయిదాటి పోతుందన్న విషయం గుర్తించిన కేంద్ర హోం మంత్రి ఆదేశాల మేరకు మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో 13సెప్టెంబర్ 1948న భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. ఎదుర్కొనలేక నిజం నవాబు 17 సెప్టెంబర్ 1948లో భారతదేశంలో విలీనం అవుతున్నానని ప్రకటించి కేంద్ర సైన్యం ముందు నిజాం లొంగిపోయాడు.  దాంతో పోలీస్ యాక్షన్ ఐదు రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. భారత త్రివర్ణ పతాకం హైదరాబాద్ లో రెపరెపలాడింది.     ఆపరేషన్ పోలోలో 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. నిజాం ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. నిజాం 23 సెప్టెంబర్ న ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో ఇచ్చిన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. హైదరాబాద్ సైనిక గవర్నర్ గా మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి బాధ్యతలు తీసుకున్నారు. 1949 చివరి వరకు చౌదరి సైనిక గవర్నర్ పదవిలో కొనసాగారు.  1950 జనవరిలో సీనియరు ప్రభుత్వ అధికారి ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. ఆ తర్వాత  1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు జరిగియి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.   ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగాయి. 17 సెప్టెంబర్ ను ప్రతి ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా ప్రజాసంఘాలు, పార్టీలు నిర్వహించేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభంలో టిఆర్ఎస్ పార్టీ నేత చంద్రశేఖర్ రావు తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారికంగా విమోచనా దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఎన్నో వేదికలపై చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు వందలాది మంది ఆత్మార్పణ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఎప్పటిమారిదిగానే అధికారం అడినమాట తప్పేలా చేసింది. తెలంగాణ ప్రజలు గత ఏడేండ్లుగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. బిజేపీ నాయకులు తెలంగాణలో ప్రజా యాత్రలు, కాగడాల ప్రదర్శనలు నిర్వహించి మరీ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. అయినా ప్రభుత్వం విమోచనా దినోత్సవం పై ఒక మాటకూడా మాట్లాడలేదు. విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే మజ్లీస్ పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో పాటు వారి ఓటుబ్యాంక్ గల్లంతు అవుతుందన్న ఆలోచనతో టిఆర్ఎస్ మౌనం వహిస్తోంది అన్నది విపక్షాల వాదన.   బ్రిటిష్ వారిని వెనక్కి పంపిన ఐక్యమత్యం, నిజాం నవాబును లొంగదీసిన చైతన్యం ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజలను దోచుకుంటున్న నాయకులకు బుద్ధి చెప్పేందుకు మరోసారి ప్రజల్లో రావాలని కోరుకుందాం.

డిసెంబర్ ఆఖరికి రష్యా వ్యాక్సిన్.. భారత్ కు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు..! 

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ "స్పుత్నిక్‌-v"ని రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం రష్యా వ్యాక్సిన్ 10 కోట్ల డోసులు భారత్ కు అందనున్నాయి. ఈ వ్యాక్సిన్ పై సకాలంలో ప్రయోగ పరీక్షలు పూర్తయి, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి వేగంగా అనుమతులు లభిస్తే డిసెంబరు నుండి ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.   భారత్ లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్, ఉత్పత్తి, పంపిణి కోసం హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్ ‌ల్యాబ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) సీఈవో కిరిల్‌ దిమిత్రీవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ కూడా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు. "స్పుత్నిక్‌-v" మూడోదశ ప్రయోగ ట్రయల్స్, పంపిణీ విషయంలో ఆర్‌డీఐఎఫ్ తో కలిసి రెడ్డీస్ ల్యాబ్స్ పనిచేయనున్నట్లు ప్రసాద్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతుల అంశం ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. ఇండియా‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల సహాయ సహకారాలతో మొత్తం 30 కోట్ల డోసుల ఉత్పత్తికి రష్యా ఒప్పందాలు కుదుర్చుకోగా, వాటిలో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను డాక్టర్‌ రెడ్డీస్ ‌ల్యాబ్స్ ద్వారా మనదేశంలో పంపిణీ చేయనుంది.

గన్నవరంలో వంశీకి షాక్ ఇచ్చేందుకు ఓటర్లు రెడీ.. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ 

రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎప్పటినుండో టీడీపీకి కంచుకోట. అటువంటి నియాజకవర్గం నుండి టీడీపీ తరుఫున పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో సీఎం జగన్ కు జై కొట్టి వైసిపిలో చేరిపోయారు. వైసిపిలో చేరిన తరువాత ఇక్కడి ఎమ్మెల్యే, అలాగే వైసిపి నియోజకవర్గ ఇంచార్జి కూడా తానేనని వంశీ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసిపి తరుఫున పోటీ చేసి గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని వంశీ ఒక పక్కన గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. అయితే వైసిపిలో ఇప్పటికే ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు మాత్రం ఆసక్తిగా పరిస్థితులను గమనిస్తున్నాయి.   ఇది ఇలా ఉండగా తాజాగా నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నిక జరిపితే ఎవరికి ఓటేస్తారనే విషయం పై ఒక సర్వే జరిగింది. అయితే ఈ సర్వేలో కొన్ని షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఉప ఎన్నిక కనుక వస్తే.. వైసిపి తరుఫున వంశీ నిలబడితే ఆయనకు వ్యతిరేకంగా ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా టీడీపీ తరుఫున ఎవరు పోటీ చేసినా ఆ పార్టీనే గెలిపించుకుంటామని 54 శాతం మంది తెలిపారు. దీనికి గల ప్రధాన కారణాలు.. ఒకటి వంశీ పార్టీ మారినా టీడీపీ కేడర్ ఏమాత్రం చెక్కు చెదరకపోవడంతో పాటు తాము కష్టపడి గెలిపిస్తే తమను పట్టించుకోకుండా కేవలం తన స్వార్ధం కోసం వైసిపిలోకి జంప్ అయ్యాడని గుర్రుగా ఉన్నారట. రెండు.. వైసిపి కేడర్ కూడా పార్టీ పై ఎంత అభిమానం ఉన్నా వంశీ పోకడలు నచ్చకపోవడంతో పాటు ఎప్పటినుండో పార్టీలో ఉన్న కేడర్ పై దాడులు చేయడంతో వారు కూడా వంశీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారట.   తాజాగా జరిపిన సర్వేలో నియోజకవర్గంలోని మొత్తం 3200 మంది నుండి అభిప్రాయాలూ సేకరించారట.. ఈ సర్వేలో టీడీపీకే ఓటు వేస్తాం అని ఏకంగా 54శాతం మంది చెప్పడంతో ప్రస్తుతం వంశీ మీద నియోజకవర్గంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చెప్పకనే చెపుతోంది. వంశీ పార్టీ మారడానికి కారణాలు ఏవైనా అటు టీడీపీ కేడర్ ఇటు వైసిపి కేడర్ కూడా వంశీని ఓడించడానికి సిద్దమవడం ఒక రకంగా గన్నవరం లో వంశీ పొలిటికల్ లైఫ్ పతనావస్థకు చేరుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వంశీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి చందంగా తయారైందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

కీలక బిల్లులు పాస్.. సభ వాయిదా.. కేసీఆర్ మార్క్ ! 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమకు కావాల్సిన కీలక బిల్లులను ఆమోదించుకుని అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసుకుంది. ఈనెల 7న ప్రారంభమైన అసెంబ్లీ వర్షకాల సమావేశాలు.. కేవలం ఎనిమిది రోజులకే ముగిశాయి.  అసెంబ్లీని ఈనెల 28 వరకు నిర్వహించాలని మొదట నిర్ణయించారు. ప్రతిపక్షాలు కోరితే ఎన్ని రోజులైనా సభ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమని బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పారు. కాని ఎనిమిది రోజులు మాత్రమే సభ జరిపి నిరవధికంగా వాయిదా వేశారు. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో బీఏసీ క‌మిటీ సూచ‌న‌, అన్ని ప‌క్షాల స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేయాల్సి వ‌స్తుంద‌ని స్పీక‌ర్ పోచారం ప్ర‌క‌టించారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు, పోలీసు, శాస‌న‌స‌భ సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా సోకింద‌న్నారు. మొత్తం 12 బిల్లుల‌పై చ‌ర్చించి స‌భ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింద‌ని స్పీక‌ర్ పోచారం తెలిపారు.   అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. సభలో తమకు కావాల్సిన బిల్లులు పాస్ చేసుకున్న ప్రభుత్వం.. కరోనా సాకుతో సభను వాయిదా వేసిందని ఆరోపిస్తున్నాయి. ఈ సెషన్ లోనే అత్యంత కీలకమైన, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించుకుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కీలకమైన టీఎస్- బి పాస్, జీఎస్టీ  సవరణ బిల్లులు ఆమోదం లభించింది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ  ఉభయ సభల్లో తీర్మానం చేశారు. తమకు కావాల్సిన బిల్లుకు ఆమోదం లభించగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా సభలను వాయిదా వేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.    కరోనా భయంతోనే సభను వాయిదా వేయాల్సి వస్తే.. అసలు అసెంబ్లీ సమావేశాలే జరపాల్సి ఉండవద్దని చెబుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందే మంత్రి హరీష్ రావుకు కరోనా సోకింది. ఆయనతో కాంటాక్టు ఉన్న కొందరు ఎమ్మెల్యేలు క్వారంటైన్ కు వెళ్లారు. ఇక సమావేశాల రెండో రోజే అసెంబ్లీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీలో పాసులు జారీ చేసిన ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విధుల్లో ఉండటంతో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడింది. అతని ద్వారా ఎంతమందికి వైరస్ సోకిందోమోనన్న ఆందోళన వ్యక్తమైంది. అసెంబ్లీ భద్రతా సిబ్బందికి కరోనా టెస్టులు చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. అయినా అసెంబ్లీని కొనసాగించింది ప్రభుత్వం.    కరోనా సోకిన మంత్రి హరీష్ రావు కోలుకుని అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వం మాత్రం కరోనా కారణంతో సభను వాయిదా వేసింది. అసెంబ్లీ సిబ్బందికి కరోనా సోకినా సభ నిర్వహించిన ప్రభుత్వం.. అంతా సర్దుకున్నాకా అసెంబ్లీకి వాయిదా వేయడమేంటనే చర్చ ప్రజల్లోనూ జరుగుతోంది. గతంలోనూ చాలా సార్లు అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ మాట తప్పారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలు కోరితే ఎన్ని రోజులైనా సభ జరుపుతామని చెప్పడం.. మధ్యలోనే వాయిదా వేసుకుని వెళ్లడం ఆయనకు  అలవాటేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సభ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలపై విపక్ష సభ్యులు ప్రశ్నిస్తారన్న భయంతోనే ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసిందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.    అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి విపక్షాలు ప్రజాసమస్యలపై గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసిందనే చర్చ జనాల్లో జరుగుతోంది. భట్టీ విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మంత్రులతో వాగ్వాదాలకు దిగారు. ఇక ఎమ్మెల్యే సీతక్క ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభలో విపక్షాల వాయిస్ పెరిగితే తమకు ఇబ్బంది వస్తుందనే భయంతోనే ప్రభుత్వం అసెంబ్లీని కరోనా కారణంతో తొందరగా ముగించి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

దోషులుగా తేలితే పోటీ చేయకుండా జీవితకాల నిషేదం?.. త్వరలో తేలుస్తామన్న సుప్రీం!

ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం వారిని నిషేధించాలనే అంశంపై త్వరలో పరిశీలిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి  అమికస్ క్యూరీగా ఉన్న విజయ్ హన్సారియా సుప్రీంకు నివేదిక అందించారు. దేశంలో ఇప్పటికే ప్రజాప్రతినిధులు, మాజీలకు సంబంధించి 4,400 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నివేదికను తయారు చేసినట్టు తెలిపారు.   తెలంగాణలో 118 కేసులు పెండింగ్ లో ఉన్నాయని... ఒక్క హైదరాబాదులోనే ప్రజాప్రతినిధులపై 13 సీబీఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ వెల్లడించారు. వీరిలో ఒక ఎమ్మెల్యేకు జీవితఖైదు విధించే స్థాయి కేసు కూడా విచారణలో ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారని... హైదరాబాదులో సీబీఐ, ఈడీ కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సూచించారు. కర్ణాటక వంటి హైకోర్టుల్లో అవినీతి నిరోధక చట్టం కింద కేసులు ఉన్నాయని... తెలంగాణలో ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయని... వీటిలో కొన్ని కేసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించిందని హన్సారియా తెలిపారు. కొన్ని కేసుల్లో ట్రయల్స్ ప్రారంభం కాలేదని, మరికొన్న కేసుల్లో ఛార్జిషీట్లు ఇంకా వేయలేదని చెప్పారు.   జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, కొన్ని రాష్ట్రాల్లో రెండు, మూడు కేసులు మాత్రమే ఉంటాయని... అలాంటి వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల హైకోర్టులకు కొన్ని ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కొన్ని కేసుల్లో విచారణ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పింది. కేసు విచారణలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని... పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అపాయింట్ చేయకపోవడం, ఛార్జ్ షీట్లు ఫైల్ చేయకపోవడం, సాక్షులను పిలవకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒకే స్పెషల్ కోర్టు ఉంటే నిర్ణీత గడువులోగా దర్యాప్తును ముగించడం కష్టమని వ్యాఖ్యానించింది.   ఒక్కో ప్రత్యేక కోర్టు ఎన్ని కేసులు విచారించాలనే విషయాన్ని సుప్రీం నిర్ణయిస్తే బాగుంటుందని ఈ సొలిసిటర్ జనరల్ మెహతా చెప్పారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక్కో స్పెషల్ కోర్టుకు ఎన్ని కేసులు ఇవ్వాలనే విషయాన్ని ఆయా హైకోర్టుల చీఫ్ జస్టిస్ లు నిర్ణయించినా బాగుంటుందన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం రాష్ట్రాలకు కేంద్రం నిధులను విడుదల చేసిందని... అయితే అనేక రాష్ట్రాలు ఇంత వరకు యూసీలను పంపలేదని చెప్పారు. జీవితఖైదు శిక్ష పడే కేసులు, అవినీతి నిరోధక చట్టం కిందకు వచ్చే కేసులకు తొలి ప్రధాన్యత ఇవ్వాలని అన్నారు. కోర్టు ఏం చెప్పినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు మెహతా. ప్రత్యేక కోర్టులు, మౌలికవసతుల కల్పనకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై  స్పందించిన ధర్మాసనం.. హైకోర్టులు, ట్రయల్ కోర్టులకు రేపటిలోగా కొన్ని ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.

కరోనా మహమ్మారికి బలైన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్.. 

తిరుపతి ఎంపీ, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ బుధవారం చెన్నయ్ అపోలో హాస్పిటల్ లో కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దీ రోజుల క్రితం కరోనా బారిన పడిన అయన చెన్నయ్ అపోలో హాస్పిటల్ లో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. దుర్గాప్రసాద్ 1985లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఒకపక్క న్యాయవాద వృత్తిలో ఉంటూనే అయన రాజకీయాల్లో ప్రవేశించారు. 28 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్నికైన బల్లి దుర్గా ప్రసాద రావు నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1996లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా కూడా అయన పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వై‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు.

కోడెల సేవలు చరిత్రలో నిలిచిపోతాయి: బాలకృష్ణ

డా.కోడెల శివప్రసాద రావు మొదటి వర్థంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు.   నేడు కోడెల శివ ప్రసాద రావు మొదటి వర్థంతి సందర్భంగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో దివంగత నేత సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తో పాటు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోడెల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిచారు.   ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. స్వర్గీయ డా. కోడెల శివ ప్రసాద రావు తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి సమాజానికి సేవ చేయాలన్న పడ్డ తపన, చేపట్టిన కార్యక్రమాలు ఆయనను చిరస్మరణీయునిగా మిగిల్చాయని గుర్తు చేసుకొన్నారు. నిబద్దత కలిగిన కార్యకర్తగా, నాయకునిగా తన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రాభివృద్దిలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ స్థాపన లోనూ కోడెల సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, అటువంటి మహనీయుల ఆశయాలను కొనసాగించాల్సిన భాద్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మొదటి వర్థంతి సందర్భంగా కోడెల కుటుంభ సభ్యులకు బాలకృష్ణ ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన రోగులు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర సిబ్బందికి బాలకృష్ణ అన్నదానం చేశారు.

ఎంతో సాధించి.. చివరికి పరువు కోసం ప్రాణాలు తీసుకున్న పల్నాటి పులి

నేడు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మొదటి వర్థంతి. రూపాయి డాక్టరుగా పేదల మనసు గెలిచిన ఆయన.. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలనాటి అరాచకాలకు ఎదురు నిలిచి, పల్నాటి గడ్డలో అభివృద్ధికి బాటలు పరిచి.. నరసరావుపేట కి నగిషీలు అద్ది, కోటప్పకొండకు కొత్త రూపు తెచ్చి పల్నాటి పులిగా పేరుతెచ్చుకున్నారు.   గుంటూరు జిల్లా కండ్లగుంట గ్రామంలో 1947 మే 2 వ తేదీన సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు కోడెల జన్మించారు. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నా.. ఆయన తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు.   పల్నాడు ప్రాంత పేదప్రజలకు వైద్యసేవలు అందించాలని నరసరావుపేటలోని రాజాగారికోటలో ఆసుపత్రి నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు కోడెల. ఆయన దగ్గరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారు అధికంగా వచ్చేవారు. వైద్యవృత్తిని ఎప్పుడూ కోడెల సంపాదన మార్గంగా చూడలేదు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించకుండా డాక్టరు కోడెల ఉన్నారన్న ధైర్యంతో ఆసుపత్రి గడప తొక్కేవారు. ఆయన పేదల డాక్టరుగా, రూపాయి డాక్టరుగా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దృష్టి కోడెల సేవపై పడి, 1983లో పార్టీలోకి ఆహ్యానించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలన్న తలంపుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు కోడెల తెలుగుదేశంలో చేరారు. మొదటిసారిగా ఆయన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే, మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన స్పీకర్ గా పనిచేశారు.    ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై ఆయన రాజీ లేని పోరాటం చేశారు. వైఎస్‌ హయాంలో రైతుల కోసం గొంతెత్తి లాఠీ దెబ్బలు తిని.. జైలుకు వెళ్లారు. కోటప్పకొండ పవిత్రతను కాపాడాలంటూ నరసరావుపేట నుంచి కొండపైదాకా నడిచారు. కోటప్పకొండ ఆలయ అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారు.   స్వచ్ఛఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛఆంధ్రప్రదేశ్ లో భాగంగా కోడెల సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.   ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఏదో ఒక సామాజిక సేవ చేయడం కోడెల ఆనవాయితీ. పుట్టినరోజు సందర్భంగా ఒకసారి 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి రికార్డు సృష్టించారు. 2017 మే 2న కోడెల పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేటలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించారు. 11,987 మంది గుంటూరు జిల్లా ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.   టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినా ఆయన ఎన్నడూ కండువా మార్చలేదు. 36 ఏళ్లు టీడీపీలోనే ఉన్నారు. పార్టీ మారమని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా కించపరచినా ఎప్పుడూ పార్టీ మారలేదు. డాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎంతో సేవ చేసి.. పేదల మనిషిగా, పల్నాటిపులిగా పేరు తెచ్చుకున్న ఆయన.. కొందరు ఆయనపై వేసిన నిందలను, తప్పుడు ప్రచారాలను తట్టులోలేక.. మానసికంగా కృంగిపోయి.. గతేడాది ఇదే రోజున అవమానలను భరించలేక పరువుకోసం ప్రాణం తీసుకున్నారు.

అమరావతి భూముల విషయంలో ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ.. సిట్ విచారణ పై హైకోర్టు స్టే 

అమ‌రావ‌తి రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారంలో ఏపీలోని జగన్ ప్ర‌భుత్వానికి ఈరోజు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. అమ‌రావ‌తి భూముల అంశంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు, అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ సిట్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించిన సంగతి తెలిసిందే. దీనికోసం సిట్ తో విచారణ చేయించేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్దమౌతుండగా సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అంతేకాకుండా సిట్ ఏర్పాటు, మంత్రివర్గ ఉపసంఘం తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.    రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూముల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం సుమారుగా 4 వేల ఎకరాల్లో టీడీపీకి చెందిన నేతలు అక్రమంగా భూములు కొన్నట్టుగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది.    ఇది ఇలా ఉండగా అమరావతి రాజధాని భూముల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని నిన్న ఏసీబీ ఒక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కూడా ఎసిబి కేసులు నమోదు చేసింది.    అయితే సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రభుత్వం దురుద్దేశంతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా చేస్తోందని తమ పిటిషన్ లో వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సిట్ ఏర్పాటు పై స్టే విధిస్తూ తీర్పు వెలువ‌రించింది.

ఏపీలో ఆలయాలపై కొనసాగుతున్న దాడులు.. విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

ఏపీలో హిందూ ఆలయాలు, ఆలయాల ఆస్తుల పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న అంతర్వేది రధం దగ్ధం ఘటన మరిచిపోక ముందే విజయవాడ దుర్గగుడి రథంలో వెండి సింహాలు మాయమైన ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటన వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే కృష్ణా జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక్కడ శ్రీ షిర్డీసాయిబాబా ఆలయం బయట నెలకొల్పిన బాబా విగ్రహాన్ని ధ్వంసం చేసారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. గ్రామంలోని స్థానికులు, ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అమెరికాలో తెలుగు వైభవం.. 9,500 మంది విద్యార్థులతో సిలికానాంధ్ర మనబడి తరగతులు ప్రారంభం!

భాషాసేవయే భావి తరాలసేవ అనే నినాదంతో, గత 13 సంవత్సరాలుగా మహాయజ్ఞంలా నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి తరగతులు, 2020-21 నూతన విద్యాసంవత్సరానికి ఈ సెప్టెంబర్ 12 వ తేదీ నుండి దిగ్విజయంగా ప్రారంభమైనాయి! అమెరికాలో 35 రాష్ట్రాలలో 250 కి పైగా కేంద్రాలలో, పదికి పైగా ప్రపంచంలోని ఇతర ఖండాలలోని దేశాలలో ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగుభాష నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడిలో, COVID-19 మహమ్మారి వల్ల మనమంతా అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ 9,500 కు పైగా విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు!   "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం" వారి అనుబంధంతో , ప్రతిష్ఠాత్మక ACS-WASC (USA) వారి అధికారిక గుర్తింపు పొంది, 35 స్కూల్ డిస్ట్రిక్టులలో ఫారిన్ లాంగ్వేజ్ (FLC) గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని, మనబడి అధ్యక్షులు మరియు కులపతి శ్రీ రాజు చమర్తి పేర్కొన్నారు. గత 13 ఏళ్లలో మనబడి ద్వారా 60,000 కు పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని, కరోనా పరిస్థితులలో సైతం ఇన్నవేల మందిని నమోదు చేసినందుకు తల్లిదండ్రులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు! మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలకు కూడా వారు కృతఙ్ఞతలు తెలియజేశారు. మనబడిలో తెలుగు భాష నేర్పించడం మాత్రమే కాకుండా తెలుగుమాట్లాట పోటీలు, బాలానందం రేడియో కార్యక్రమాలు, తెలుగుకు పరుగు, పద్యనాటకాలు, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో మన పిల్లలకు మన సంసృతీసాంప్రదాయాలతో పాటు, మన కళల పట్ల అవగాహన కల్గించడం మనబడి ప్రత్యేకత!   మీ పిల్లలను ఈ విద్యాసంవత్సరానికి manabadi.siliconandhra.org ద్వారా సెప్టెంబర్ 25 వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని, మనబడి అభివృద్ధి, ప్రాచుర్యం మరియు టెక్నాలజీ విభాగాల ఉపాధ్యక్షులు శ్రీ శరత్ వేట గారు విన్నవించారు. మొదటి త్రైమాసికం తరగతులన్నీ కరోనా పరిస్థితులవల్ల సాంకేతికతను ఉపయోగించి అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహిస్తారని కూడా వారు తెలిపారు.

విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ.. మండిపడ్డ టీడీపీ

ఏపీలోని వివిధ హిందూ ప్రార్థన స్థలాలలో వరుసగా జరుగుతన్న ఘటనలు రాష్ర ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అంతర్వేది రథం దగ్ధం ఘటన మరవక ముందే తాజాగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని రథంపై దుమారం రేగుతోంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉత్సవ వెండి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలు మాయమవడం సంచలనం ‌గా మారింది. ఈ రథంపై మొత్తం నాలుగు వెండి సింహాలు ఉండేవి. అయితే ప్రస్తుతం మూడు సింహాలు మాయమయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రథంపై మూండు సింహాలు మాయం కావడంతో దుర్గమ్మ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అంతేకాకుండా ఈ విషయం పై ఆలయ ఈవో నీళ్లు నమలడం దొంగలకు వత్తాసు పలకడమేననని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ చోరీ వెనుక ఎవరి హస్తం ఉంది.. ఎవరిని రక్షించడానికి మీరు దీనిని కప్పిపెట్టాలని చూస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వెండి సింహాల మాయం ఘటనపై వెంటనే నిజానిజాలు బయటపెట్టాలని అయన డిమాండ్ చేశారు.   రాష్ట్రంలో "వైసిపి అధికారంలోకి వచ్చాక ఏ గుడికి భద్రత లేకుండా పోయింది. వైసిపి నాయకులు ఏకంగా గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలా ఉన్నారు. దేవాదాయ భూముల ఆక్రమణల దగ్గర నుండి, రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం, వెండి తాపడాల మాయం, ఇలా రోజుకో నేరం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగలు, దగాకోర్లు ఆలయాల్లో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నా సీఎం చోద్యం చూస్తున్నారు. ఆలయాల్లో చోరీలు, విధ్వంసాలు, అరాచకాలు చేస్తున్న నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలి. భక్తుల మనోభావాలను గౌరవించాలి. అంతేకాకుండా 15నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో జరిగిన అరాచకాలపై సిబిఐ విచారణ జరిపించాలి.'' అని బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు, విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్‌తో సమావేశమై దుర్గగుడిలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చలు జరిపారు. తరువాత ఆలయ ఈవో, ఇతర సిబ్బంది కలిసి ఉత్సవ రథాలను పరిశీలించారు. అప్పుడు వెండి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలు మాయమైన విషయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా నాలుగో సింహాన్ని కూడా పెకలించి ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. వీటిలో ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారని.. ఈ లెక్కన మొత్తం రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైనట్లు సమాచారం. ఐతే ఆలయ అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. దీని పై దుర్గ గుడి ఈవో సురేశ్ స్పందిస్తూ రథంపై ఉన్న సింహాలు మాయమయ్యాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ఆలయ రికార్డులను పరిశీలించి సింహాలు గతంలో ఉన్నాయో లేవో తేల్చడానికి 3 రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.

శశికళ విడుదల అయ్యేది 2021 లోనే.. అది కూడా ఫైన్ కడితేనే.. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే నాయకురాలు అయిన శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నసంగతి తెలిసిందే. శశికళ వచ్చే ఏడాది జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని.. అయితే, దీనికోసం ఆమె రూ. 10 కోట్లు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని కర్ణాటక జైళ్ల శాఖ తెలిపింది.   శశికళ శిక్షాకాలం, విడుదల తేదికి సంబంధించి ఆర్టీఐ కార్యకర్త, లాయర్ నరసింహమూర్తి చేసిన దరఖాస్తుకు సమాధానముగా పరప్పన జైలు సూపరింటెండెంట్ ఆర్.లత ఈ వివరాలు తెలిపారు. ఒక వేళ ఆమె ఫైన్ కట్టకపోతే మాత్రం 27 ఫిబ్రవరి 2022 వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2017 లో అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శశికళ అనుచరురాలు ఇళవరసి అలాగే శశికళ మేనల్లుడు సుధాకరన్ కూడా ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

కేసుల భయమా! స్నేహ హస్తమా! ఒకే బాటలో వైసీపీ, టీడీపీ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఒకే దారిలో పయనిస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు ఓటేశారు వైసీపీ, టీడీపీ ఎంపీలు. రాష్ట్రంలో బద్ద శత్రువులుగా ఉన్న పార్టీలు ఢిల్లీలో ఒకేబాటలో పయనించడం చర్చనీయాశంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ కూటమికి మద్దతిచ్చామని వైసీపీ చెబుతోంది. టీడీపీ కూడా అదే వాదన వినిపిస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల పరిణామాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహానికి వైసీపీ, టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని రెండు పార్టీలు చెబుతున్నా.. కేసుల భయంతోనే  బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం లేదనే చర్చ కూడా జరుగుతోంది.    ఏపీ సీఎం జగన్ పై సీబీఐ, ఈడీ కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. గతంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరైన ఆయన ప్రస్తుతం మినహాయింపులో ఉన్నారు. సీఎం హోదాలో కూడా ఓసారి కోర్టుకు హాజరయ్యారు జగన్. కేసులు ఇంకా పూర్తి కానందున కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండటమే బెటరన్న అభిప్రాయంలో వైసీపీ ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా వెళితే పరిణామాలు మారవచ్చని.. కేసుల విచారణలో స్పీడ్ పెరగవచ్చనే భయం జగన్ పార్టీ నేతల్లో ఉంది. అందుకే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లులతో పాటు అన్ని అంశాల్లోనూ బీజేపీకే మద్దతిస్తున్నారు వైసీపీ ఎంపీలు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లోనూ అలాగే చేశారు. బీజేపీకి మద్దతుగా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం కూడా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.    ఇక టీడీపీ అధినేత చంద్రబాబుది సేమ్ అలాంటి ఇబ్బందే. అమరావతి ఇన్ సైడ్ ట్రేడింగ్ తో పాటు ఫైబర్ నెట్ పనులపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరే యోచనలో ఉంది వైసీపీ. వీటిపై ఇప్పటికే రాష్ట్రంలో ఏసీబీ విచారణ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు. ప్రధాని మోడీతో పాటు బీజేపీ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కూటమిలో చేరి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల తర్వాత ఫలితాలు తారుమారు కావడం, ఏపీలోనూ టీడీపీకి పరాజయం దక్కడంతో చంద్రబాబు మౌనంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు బీజేపీ పెద్దలు. ఈ నేపథ్యంలో అమరావతి, ఫైబర్ నెట్ పనులపై జగన్ సర్కార్ సీబీఐ దర్యాప్తు కోరితే తనకు ఇబ్బంది కలగొచ్చనే ఆందోళనలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే కొంత కాలంగా ఆయన బీజేపీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఇటీవల ఎలాంటి ప్రకటనలు చేయలేదు చంద్రబాబు. కరోనా కట్టడిలో మోడీ సర్కార్ బాగా పని చేస్తుందని చెప్పారు. బీజేపీతో మంచి సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలను ఉపయోగించుకున్నట్లు చెబుతున్నారు, ఎన్డీఏకు సపోర్ట్ చేయడం వల్ల బీజేపీకి దగ్గర కావచ్చన్నది బాబు అంచనాగా భావిస్తున్నారు .   మరోవైపు వైసీపీ, టీడీపీ తీరుపై ఏపీలోని మిగితా పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయకుండా.. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల భయంతోనే బీజేపీకి జై కొడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ, టీడీపీ మద్దతు ఇవ్వడంపై ఢిల్లీలోనూ చర్చలు జరుగుతున్నాయి.

కోడెల వర్ధంతి కార్యక్రమాలపై పోలీసుల నోటీసులు.. ఆపేది లేదంటున్న కుమారుడు

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మొట్టమొదటి వర్ధంతి రేపు బుధవారం నాడు జరగనుంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో దివంగత నేత కోడెల అనుచరులు పలు కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క కోడెల కుమారుడు శివరాం కూడా కొన్ని కుటుంబ పరమైన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కోడెల శివరాం తో సహా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కరోనా ఉన్న నేపథ్యంలో బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.   అయితే పోలీసుల తాజా వైఖరిపై కోడెల శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు యథావిధిగా తాము కార్యక్రమాలు చేపట్టి తీరుతామని కోడెల శివరామ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కుటుంబ పరంగా జరిగే వర్ధంతి కార్యక్రమాలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం సరికాదని అయన అభిప్రాయపడ్డారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏడాది క్రితం హైదరాబాదులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇద్దరు సీఎంలు జాన్ జిగ్రీలే.. అయినా బస్సులు మాత్రం రోడ్డెక్కవు 

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు జాన్ జిగ్రీలు అన్న సంగతి అందరికి తెల్సిందే. గత సంవత్సరం జరిగిన ఏపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ పార్టీకి అండగా ఉండి అయన గెలుపుకు సాయపడ్డారని అటు టీడీపీ, ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపధ్యంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. కానీ ఇప్పటివరకు అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇటు టీఎస్ఆర్టీసీ కానీ రెండు రాష్ట్రాల మధ్య బస్సులను మాత్రం నడపడం లేదు. దీనికి కారణం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పంతం వీడక పోవడమే అని తెల్సుస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మ‌ధ్య చ‌ర్చ‌లు జరిగినా అవి రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా సాగాయి. దీని కోసం దాదాపు మూడు నెల‌లుగా రెండు రాష్ట్రాల అధికారులు చర్చించడం.. ఆ తరువాత బ‌స్సులు న‌డ‌ప‌డంపై ఏదీ తేల్చ‌కుండా ముగిస్తున్నారు. ఈక్ర‌మంలోనే ఈరోజు మరోసారి రెండు రాష్ట్రాల అధికారులు ఈ అంశం పై చర్చించేందుకు స‌మావేశ‌మ‌వుతున్నారు.   ఇంతకు ముందు జరిగిన స‌మావేశాలలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బ‌స్సులు సమాన దూరం నడుపుకుందామన్న తెలంగాణ‌ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించలేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బ‌స్సుల ప్రారంభంపై ప్రతిష్టంభన ఏర్పడింది. కరోనా ప్రబలక ముందు వరకు తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీకి బ‌స్సులు 2.65 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతుండగా.. టీఎస్ఆర్టీసీ బ‌స్సులు ఏపీ పరిధిలో 1.45 లక్షల కిలోమీటర్లు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంతకుముందు జరిగిన చర్చలలో తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటే…తెలంగాణ 50వేల కిలోమీటర్ల ప‌రిధి పెంచుకుంటే సరిపోతుంద‌ని ఏపీ ప్రతిపాదించింది. అయితే ఆ స్థాయిలో టీఎస్ఆర్టీసీ వద్ద బస్సులు సిద్ధంగా లేని కారణంగా తెలంగాణ మాత్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. తాము గ‌తంలో న‌డిపిన‌ట్టుగానే స‌ర్వీసులు న‌డిపిస్తామ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఇంతకుముందు జరిగిన స‌మావేశంలో రెండు రాష్ట్రాల మధ్య బ‌స్సులు నడపడం పై స్ప‌ష్ట‌త రాలేదు. మరో పక్క ఏపీ రవాణా శాఖ.. మంత్రుల స్థాయి భేటీకి ప్రయత్నించగా దానికి తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ నో చెపుతూ.. ముందుగా అధికారుల మధ్య చర్చలు సఫలం అయితేనే రెండు రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశం ఉంటుందని స్పష్టం చేసారు. దీంతో క‌నీసం ఈసారి అధికారుల స్థాయి చర్చలలోనైనా ఒక ఒప్పందానికి వచ్చి బ‌స్సులు నడిపిస్తారో లేదో వేచి చూడాలి.