కేసీఆర్ కొత్త పార్టీ.. మరో వ్యూహానికి తెర లేపారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి అరగేంట్రం చేస్తున్నారని వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రజల స్పందన ఎలా వున్నా, ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం దీన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు ఇద్దరు ఇది కేవలం కేసీఆర్ మరో గేమ్ ప్లాన్ గానే చూస్తున్నారు.
రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉందని, ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు దీనిపై మాట్లాడకుండా ఉండడానికే కేసీఆర్ మరో వ్యూహానికి తెర లేపారని కాంగ్రెస్ నాయకులంటుంటే, ప్రస్తుతం రెవెన్యూ చట్టానికి సవరణలు చేస్తూ, రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దుచేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, ప్రజల మరియు రాజకీయ నాయకుల ద్రుష్టి దీన్ని నుండి మరలించడానికే కొత్త వ్యూహానికి తెరలేపారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
కేసీఆర్ నయా భరత్ పేరుతో కొత్త పార్టీ స్థాపించబోతున్నారని, ఇప్పటికే బెంగాల్ ముఖ్య మంత్రి మమాత బెనర్జీ, హిమాచల్ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ లాంటి నాయకులతో చర్చలు కూడా జరిపారని ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక నేడు ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై కొంతమంది ప్రముఖ నాయకుల స్పందన కోసం ప్రయత్నించినప్పుడు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దీన్ని పూర్తిగా కొట్టివేయగా, మరి కొందరు వేరే పార్టీల నాయకులైతే కేటీఆర్ ను ముఖ్య మంత్రి స్థానంలో కూర్చొబెట్టడానికె ఇంత సీన్ క్రియేట్ చేసారని అంటున్నారు.
కేటీఆర్ ను ముఖ్య మంత్రిని చెయ్యాలంటే తాను ఏదోఒక ప్లాట్ఫారం చూసుకోవాలని, తాను ఇక్కడేవుండి కొడుకును పీఠం మీద కూర్చోబెడితే ప్రజలకు కొన్ని తప్పుడు సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం ఉందని భావించి, ఈ కొత్త ప్రతిపాదనను అలోచించి ఉంటారనేది వారి వాదన. ఇంకొంతమంది నాయకులు, బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలంటే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు భావన కల్పించాలనే ఆలోచన కెసిఆర్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
కనీసం, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా, వెళ్లకున్న, బీజేపీ అయితే రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉంటుందని, ఆవసరమైతే తనను కొంత మేరకు సంతృప్తి పరిచే విధంగా కూడా ఆ పార్టీ ఆలోచించ వచ్చని, అందువల్లనే ఈ ప్రతిపాదనను తెరమీదకు కేసీఆర్ తెచ్చారని ఈ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
తెరాస కు కొంత వరకు దగ్గరగా వుండే నాయకులైతేమాత్రం, కెసిఆర్ కొత్త ప్రతిపాదనను సమర్దిస్తున్నారు. అంతే కాకుండా ఆయనకు మద్దతు కూడా పలుకుతున్నారు. 2018 ఎన్నికల్లోనే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఫై ఆలోచించారని, అయితే అప్పుడు కొందరు ఇతర రాష్ట్ర నాయకులు ఈ విషయంపై చంద్రబాబు ను సంప్రదిచారని, ఆయన దీనిని అంతగా సమర్ధించలేదని, దాంతో వారుకూడా వెనక్కు తగ్గారని, అంటున్నారు. అంతే కాకుండా, 2019 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడంతో, ఫెడరల్ ఫ్రంట్ విషయం మరుగున పడి పోయిందని కూడా వీరంటున్నారు,
ఇప్పుడు ఇది సరైన సమయమని, కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వీరు నమ్ముతున్నారు. ఒకవేళ, కేసీఆర్ కు ఎప్పటికి తమ మద్దతు ఉంటుందని, కేటీఆర్ కు కూడా ముఖ్యమంత్రి అవడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని, కూడా వారు నమ్ముతున్నారు. ఏది ఏమైనప్పటికి, కేసీఆర్ జాతీయ రాజకీయ అరగేంట్రం ఫై అతి త్వరలో ఒక స్పష్టత వస్తుందో, రాదో వేచి చూడ వలసిందే.