కేపిటల్ పై అదే కన్ఫ్యూజన్.. సోము మరో బాంబ్! 9వేల ఎకరాలెక్కడో..
posted on Sep 8, 2020 @ 7:43PM
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై భారతీయ జనతా పార్టీలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం చెబుతుండగా.. రాష్ట్ర నేతలు మాత్రం ఎవరి కోణంలో వారు రోజుకోలా మాట్లాడుతూ అయోమయం స్పష్టిస్తున్నారు. పార్టీ చీఫ్ సోము వీర్రాజు తన ప్రకటనలతో రాజధానిపై మరింత గందరగోళపరుస్తున్నారు.
కన్నా లక్ష్మినారాయణ చీఫ్ గా ఉన్నప్పుడు కమలంపార్టీలో కేపిటల్ పై ఫుల్ క్లారిటీ ఉండేది. అమరావతి రైతుల ఉద్యమానికి కన్నా మద్దతు కూడా ఇచ్చారు. పాలనా వికేంద్రకరణకు వ్యతిరేకంగా, జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వరుసగా ప్రకటనలు చేసారు. సోమ్ము వీర్రాజుకు పార్టీ పగ్గాలు వచ్చాకే కన్ఫ్యూజన్ పెరుగుతోంది. అమరావతిలో ఒకలా. విశాఖలో మరోలా.. రాయలసీమలో ఇంకోలా మాట్లాడుతుండటంతో రాజధానిపై సోము వీర్రాజు స్టాండ్ ఏంటన్నది ఎవరికి అర్ధం కావడం లేదు.
తాజాగా విశాఖ పర్యటనలో రాజధానిపై మరో సంచలన వ్యాఖ్య చేశారు సోము వీర్రాజు. తాము 2024లో అధికారంలోకి వస్తే 9 వేల ఎకరాల్లో రాజధాని కట్టి చూపిస్తామన్నారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తప్పులే చేస్తున్నాయన్నారు. అమరావతిలో రైతులకు 64 వేల ప్లాట్లు ఇచ్చేస్తామని తెలిపారు. అయితే రాజధాని ఎక్కడన్నది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సోము వీర్రాజు చెప్పిన 9 వేల ఎకరాల రాజధాని ఎక్కడన్న దానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. విశాఖలో మాట్లాడారు కాబట్టి విశాఖలోనే అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుండగా.. రాజధాని కోసం ఇప్పటికే భూములు సేకరించిన అమరావతి గురించే సోము చెప్పారని మరికొందరు చెబుతున్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించిన కొన్ని రోజులకే ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. 13 జిల్లాలున్న రాష్ట్రానికి 13 రాజధానులు ఉంటే తప్పేంటన్నారు. అయితే సోము పార్టీ పగ్గాలు తీసుకుంటున్న కార్యక్రమంలోనే ఆయనకు షాకిచ్చారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. రాష్ట్రానికి ఒక్క రాజధానే ఉండటమే మంచిదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవన్నారు మాధవ్. దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో.. ఒక్క రాజధాని ఉన్న సరైన పాలన జరగడం లేదా అని రాంమాధవ్ ప్రశ్నించారు. కన్నా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రాజధానిపై సోము వీర్రాజు అయోమయంగానే మాట్లాడేవారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటూనే చంద్రబాబు పాలనపై విమర్శలు చేసేవారు. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదంటూనే..పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు మంచి జరుగుతుందనేవారు సోము వీర్రాజు.
కేంద్ర సర్కార్ వైఖరి, బీజేపీ జాతీయ నేతల అభిప్రాయాలు, రాష్ట్ర నేతల తీరు భిన్నంగా ఉండటంతో రాజధానిపై కమలనాధులకు స్పష్టత లేనట్లు కనిపిస్తోంది. అమరావతికి మద్దతుగా కన్నా మాట్లాడుతున్నా హైకమాండ్ వారించ లేదు. రాంమాధవ్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించారు. దీంతో అమరావతి వైపే బీజేపీ హైకమాండ్ అని భావించారు. ఇప్పుడు సోము వీర్రాజు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు. అధిష్టానం ఆదేశాలు లేకుండా ఆయన ముందుకు వెళ్లరని చెబుతున్నారు. దీంతో ఏపీ రాజధాని విషయంలో బీజేపీ డబుల్ రోల్ పోషిస్తుందనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. టీడీపీ కూడా ఇదే ఆరోపిస్తోంది. ఇప్పటికైనా బీజేపీ స్పష్టమైన వైఖరి చెబితే బాగుంటుందనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి.