తెలంగాణలో మరో ఆనందయ్య.. మందు కోసం జనాల క్యూ
posted on May 27, 2021 @ 11:28AM
కృష్ణపట్నం ఆనందయ్య మందు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న ఆయుర్వేద వైద్యం ద్వారా కరోనాకు మందు తయారుచేశారు ఆనందయ్య. ఇప్పటి వరకు దాదాపు 80వేల మందికి ఆయుర్వేద ముందును పంపిణీ చేశారు. అయితే ఆనందయ్య మందుకు శాస్త్రీయత లేదని.. పూర్తి అధ్యయనం తర్వాత అనుమతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీని ఆపివేసింది. కరోనా ఆయుర్వేద మందుకు డిమాండ్ పెరగడంతో.. ఆనందయ్యలాగే మరికొందరు కూడా కరోనాకు మందు ఇస్తున్నారు. కృష్ణపట్నం తరహాలోనే రాజమండ్రిలోనూ ఓ వ్యక్తి మందును పంపిణీ చేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ముందునే ఇస్తున్నారు ఓ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రానికి చెందిన బచ్చలి భీమయ్య గతంలో సింగరేణిలో పనిచేశారు. ఆయన పూర్వీకులు ఆయుర్వేద మందులు తయారుచేసి స్థానికులు వైద్యం చేసేవారు. వారి నుంచి వైద్యం నేర్చుకున్న భీమయ్య.. ఇప్పుడు కరోనాకు కూడా మందు తయారుచేశారు. దగ్గు, దమ్ము, ఊపిరితిత్తుల సమస్యలకు 13 రకాల వనమూలికలతో తయారుచేసిన మందు కరోనా పేషంట్లకు బాగా పని చేస్తుందని భీమయ్య అంటున్నారు. పైగా ఈ మందు వేసుకున్న రెండు గంటల్లోనే కరోనా మటుమాయం అవుతుందని చెబుతున్నారు. ఆనందయ్య లాగే ఈ మందుకు ఆయనేం డబ్బులు తీసుకోవడం లేదు. ఉచితంగానే ఇస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి నయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మాస్క్ కూడా ధరించకుడా.. కరోనా రోగులను పక్కన కూర్చోబెట్టుకొని, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారను బచ్చలి భీమయ్య.
ఆనందయ్య లాగే బచ్చలి భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోజు రోజుకూ ఆయన వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏ విధంగా మందును పంపిణీ చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. మందును ఇవ్వకూడదని స్పష్టం చేశారు. భీమయ్య ఇచ్చే మందుకు గురించి పోలీసులకు తెలిసింది. ఆయన ఇచ్చే మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని, రిస్క్ తీసుకోవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు మందమర్రి సీఐ ప్రమోద్‌రావు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని అసలు నమ్మకూడదని సలహా ఇచ్చారు. స్థానికులు మాత్రం భీమయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కరోనా పేషెంట్లకు ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తానని భీమయ్య కూడా చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతివ్వాలే కానీ కరోనా బాధితుడిని రెండు గంటల్లో నయం చేస్తానంటున్నారు.
ఆనందయ్య నాటుమందు పాపులర్ కావడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా నాటువైద్యులు పుట్టుకొస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో ఇద్దరు నాటు వైద్యులు దుకాణం తెరిచారు. కరోనా నియంత్రణకు పసరు మందు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. అంతే వారి ఇంటి జనం బారులు తీరడం మొదలుపెట్టారు. కరోనా నియంత్రణకి ఉచితంగానే ఈ పసరు మందు అందిస్తున్నామని మందు తయారీదారులు చెబుతున్నారు. ఫస్ట్ వేవ్‌లో 3 లక్షల మందికి పసరు మందు అందించామని… ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నందిని సుబ్రహ్మణ్యం అనే నాటు వైద్యుడు మందును పంపిణీ చేస్తున్నాడు. గోపాలపురం మండలంలోని చిట్యాల గ్రామంలో సుబ్రహ్మణ్యం ఇస్తున్న మందు కోసం జనం బారులు తీరుతున్నారు. ఈ పసరు మందును కళ్లలో కూడా వేస్తున్నాడాయన.