కర్ణాటక సీఎం యడ్డీకి ఉద్వాసన?
posted on May 27, 2021 @ 12:40PM
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఉద్వాసనకు రంగం సిద్దమవుతోందా... అంటే అధికార బీజేపీ వర్గాలు అవుననే అంటున్నాయి. నిజానికి యడియూరప్ప పదవీ గండాన్ని వెంటపెట్టుకునే ప్రమాణ స్వీకారం చేశారు. అదెలా ఉన్నా, ఇంచుమించుగా సంవత్సర కాలంగా, ఈ ఉద్వాసన వార్త, రిపీటెడ్’గా వినవస్తూనే వుంది. అయితే, ఎప్పటికప్పుడు యడ్డీ ఎదో ఒక విధంగా గండం నుంచి గట్టెక్కుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ...ఇక గండం గట్టెక్కే మార్గం లేదని,అందుకే యడ్డీ కూడా షరతులతో తప్పుకునేందుకు సంసిద్దత వ్యక్త చేశారని అటు ఢిల్లీలో ఇటు బెంగళూరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు సూచిస్తున్నాయి.
చాలా కాలంగా యడ్డీ ఉద్వాసన వార్తలు వినవస్తున్నా ఇంతవరకు ఎవరూ మీడియా ముందుకు వచ్చి నోరు విప్పలేదు. కానీ , ఇప్పుడు కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్, బుధవారం , “అవును యడియూరప్పను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరో వంక యడియూరప్ప తమ పదవిని కాపాడుకునేందుకు పావులు కదుపు తున్నారు, తమ విధేయులను ఢిల్లీకి పంపి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు’’ అని మీడియా ముందు కొచ్చి నిజాన్ని చెప్పేశారు. అలాగే, ‘అవును అసమ్మతి నాయకుల సమావేశాలు జరుగుతున్నాయి. కొందరు మంత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరావుతున్నారు.కొందరు పరోక్షంగా మద్దతు నిస్తున్నారు .ఇవ్వన్నీ నిజం. యడియూరప్పను పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం” అని, అశోక కుండ బద్దలు కొట్టారు. అశోక్ ఓపెన్ స్టేట్మెంట్, అనుమానాలను బద్దలు చేస్తే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన యడ్డీ ఉద్వాసన ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎన్ అస్వంత్ నారాయణ్ సహా మరో ముగ్గురు నలుగురు మంత్రులు మాత్రం, యడియూరప్ప ఉద్వాసన ఉండదని, అసలు అలాంటి అవకాశమే లేదని ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఏమి జరుగుతుందో ఏమో కానీ, చాలా చాలా కష్టపడి, 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలను గోడ దూకించి, రాష్టంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు యడ్డీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది, అంతవరకు అయితే ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర లేదు. మంత్రి పదవులు వచ్చినవారు విధేయతను చాటుకుంటుంటే, పదవులు దక్కని ఎమ్మెల్ల్యేలు అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు.
ఇరు వర్గాలు తమ తమ వాదనని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. “కొంతమంది పదవులు దక్కని ఎమ్మెల్ల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుకోవచ్చును, కానీ, అది జరగదు” అని చన్నగిరి ఎమ్మెల్యే మడల్ విరుపాక్ష ధీమా వ్యక్త పరిచారు. అంతే కాదు, యడియూరప్పను తప్పించాలనుకునే ఎమ్మెల్యేలకు మళ్ళీ ఎన్నికల్లో గెలిచే సీన్ కూడా లేదు,అంటూ చులకన చేసి మాట్లాడుతున్నారు. అంతే కాదు, యడియూరప్పను ఎందుకు తప్పించాలి.. ఆయన చేసిన తప్పేంటి అని విరుపాక్ష ప్రశ్నిస్తున్నారు. అలాగే, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా, పార్టీలో కొన్ని విబేధాలు ఉన్నాయి, అయినా యడియూరప్ప పదవిలో కొనసాగుతారు అని అంటున్నారు.
ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, యడ్డీ ఉద్వాసన ముహూర్తం దగ్గర పడిందని, అనిపిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలున్నాయి, మరోవంక, కొవిడ్ 19 నియత్రణలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు, కాబట్టి ఆయనకు ఎంత త్వరగా ఉద్వాసన పలికితే రాష్ట్రానికి, ప్రజలకు అంత మంచిందని సిద్దరామయ్య అన్నారు. ఈ అన్నింటినీ మించి, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా యడ్డీని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే, పార్టీ కేంద్ర నాయకత్వం, అసమ్మతి నాయకులు కోరుతున్న విధంగా అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించేందుకు వచ్చే నెల మొదటివారంలో, శాసన సభ పక్ష సమావేశం ఏర్పాటు చేయమని యడియూరప్పను కోరినట్లు అసమ్మతి నాయకులు చెపుతున్నారు.
అయితే, శాసన సభాపక్ష సమావేశం, అందుకోసమేనా .. యడ్డీకి ఉద్వాసన పలికేందుకేనా ? అనేది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న. కానీ, హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేందర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకొని కేంద్ర హోం మంత్రి అమిత్ షా’, బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ అరుయన్ సింగ్ ‘తో సమావేశం కావడం, ఈ సమావేశంలో ఒకవేళ యడియూరప్ప నిజంగానే తప్పుకోవలసి వస్తే, ఆయనకు ఇష్తమైన, తమ వర్గానికి చెందిన వారికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని షరతులు విధించినట్లు తెలు స్తోంది. అయితే తామోచ్చింది ‘అందుకు’ కాదని, కొవిడ్ సమస్యలు చర్చించేందుకని బొమ్మై చెప్పుకొచ్చారు. అయితే, ఎవరు ఏమి చెప్పినా,యడ్డీ ఉద్వాసన ఈ సారి నిజంగానే తప్పేలా లేదు.