మాస్క్ లేదని మేకులు దించిన పోలీసులు.. అదిరిపోయే ట్విస్ట్..
posted on May 27, 2021 @ 3:52PM
కరోనా సమయంలో బయటకు రావాలంటే మాస్క్ తప్పనిసరి. ముఖానికి మాస్క్ వేసుకోకపోతే కొవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అందుకే, మాస్క్‌ను తప్పనిసరి చేశాయి ప్రభుత్వాలు. మాస్క్ లేకుండా ఎవరైనా బయటకు వస్తే.. ఫైన్ విధిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీలతో నాలుగు తగిలించి మరీ హెచ్చరిస్తున్నారు. ఇంత వరకూ ఓకే గానీ.. యూపీ పోలీసులే మరీ ఓవరాక్షన్ చేశారు. మాస్క్ లేదని ఓ యువకుడి చేతులు, కాళ్లకు మేకులు గుచ్చడం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
యూపీలోని బరేలీ జిల్లాలో జరిగిందీ దారుణం. మాస్కు ధరించని ఓ యువకుడిని చితకబాదారు అక్కడి పోలీసులు. అంతేకాదు, అతని చేతికి, కాలికి మేకులు కొట్టారు. పోలీసుల అరాచకానికి బలైన యువకుడి పేరు రంజిత్. అతని చేతికి, కాలికి పోలీసులు మేకులు గుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నొప్పి భరించలేక అతను తల్లడిల్లిపోతున్న వీడియో నెటిజెన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఘటనపై బాధితుడి తల్లి శైలజా దేవి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. అదే సమయంలో మరో వాదనా సర్క్యులేట్ అవుతోంది. ఓ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో రంజిత్‌ను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు వెళ్లారట. తమ నుంచి తప్పించుకోవడానికి రంజిత్ తనకు తానే మేకులు గుచ్చుకున్నాడనేది పోలీసుల వర్షన్. ఇరువైపు వాదనలు వింటుంటే.. పోలీసులు చెబుతున్నదే కాస్త నమ్మశక్యంగా ఉందంటూ నెటిజన్లు జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌తో ఏది నిజమో? ఏది అబద్దమో? ఒకపట్టాన అర్థం కాని పరిస్థితి. చివరాఖరున మాస్క్ ధరించనందుకు రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం కొసమెరుపు.