యాంటీబాడీ కాక్‌టైల్ సూపర్.. రెండు రోజుల్లో కొవిడ్ రోగి డిశ్చార్జ్
posted on May 27, 2021 @ 3:23PM
కరోనా చికిత్స కోసం అందుబాటులోకి వచ్చిన యాంటీబాడీ కాక్‌టైల్ ను భారత్ లో తొలిసారి ఉపయోగించారు. హరియాణాకు చెందిన 82ఏళ్ల కోవిడ్ బాధితుడికి రెండు రోజుల క్రితం తొలి డోస్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గురుగ్రామ్‌లో పేరొందిన మేధాంత హస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నరేష్ థెహాన్ యాంటీబాడీ కాక్‌టైల్ చికిత్స వివరాలను వెల్లడించారు. డిశ్చార్జ్ అయినప్పటికీ.. ఆ రోగిని ప్రతి రోజూ పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు.
‘‘కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే రెండు రకాల యాంటీబాడీలను కలిపి తొలి దశలోనే కరోనా బాధితులకు ఇచ్చినట్లయితే.. ఇవి వైరస్ కణాలను శరీరమంతా వ్యాపించకుండా అడ్డుకుంటాయి. కొవిడ్ 19, బి.1.617 రకం వేరియంట్‌పై ఇది సమర్థంగా పనిచేస్తోంది. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్ ద్వారా రోగులు ఆసుపత్రికి వెళ్లే అవసరం 70శాతం తగ్గిపోతుంది. మన దగ్గర తొలి డోసును హరియాణాకు చెందిన వ్యక్తికి ఇచ్చాం. డోసు తీసుకున్న మరుసటి రోజు ఆయనను డిశ్చార్జ్ చేశాం. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. మహమ్మారిపై ఇది మన కొత్త ఆయుధం లాంటిది’’అని డాక్టర్ నరేశ్ త్రెహాన్ వివరించారు.
కొవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే రెండు యాంటీబాడీలను కలిసి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను ఇటీవల రోచ్‌ఇండియా, సిప్లా సంయుక్తంగా భారత మార్కెట్లో విడుదల చేశాయి. దీనిక ధర డోసుకు రూ. 59,750గా పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది కరోనా బారిన పడినట్లు ఈ ఔషధాన్ని తీసుకుని వైరస్ నుంచి కోలుకున్నారు.
తాము తయారు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని కోరుతూ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా కోరింది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు జైడస్ క్యాడిలా దరఖాస్తు చేసింది. దీంతోపాటు అభివృద్ధి చేసిన మోనోక్లోనల్ కాక్‌టెయిల్‌కు జైడస్ క్యాడిలా ZRC-3308 అనే పేరును కూడా పెట్టింది. తేలికపాటి లక్షణాలున్న కేసుల్లో కాక్‌టెయిల్ ప్రధాన చికిత్సల్లో ఒకటిగా మారుతుందని కంపెనీ వెల్లడించింది. తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడేవారికి దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయంటూ వివరించింది. యూఎస్, యూరప్‌లో నిర్వహించిన పరిశోధనల్లో తేలికపాటి లక్షణాలున్న రోగుల్లో వైరల్ లోడ్ తగ్గిందని.. ఆసుపత్రికి వెళ్లే కేసులను ఈ ఔషధం గణనీయంగా తగ్గించేలా చేస్తుందని పేర్కొంది.
SARSCoV-2 స్పైక్ ప్రోటీన్‌ను మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ నిర్వీర్యం చేస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా జైడస్ క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ మాట్లాడారు. ఈ సమయంలో వైరస్‌పై పోరాడేందుకు సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్సలను అన్వేషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొవిడ్ రోగుల బాధను తగ్గించే సామర్థ్యం ZRC-3308కు ఉందని నమ్మతున్నట్లు పటేల్ పేర్కొన్నారు.