అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదు.. బాబా రాందేవ్ సవాల్..
posted on May 27, 2021 @ 4:24PM
తగ్గేదే లే.. అంటూ బాబా రాందేవ్ మరింత రెచ్చిపోతున్నారు. తనను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవంటూ రెచ్చగొడుతున్నారు. తనను టార్గెట్ చేస్తున్న ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌కు నేరుగా సవాల్ విసురుతున్నారు. దీంతో.. బాబా రాందేవ్ వర్సెస్ ఐఎంఏ.. ఎపిసోడ్ రాజకీయంగానూ రచ్చ రాజేస్తోంది.
వారం రోజులుగా నడుస్తోంది వివాదం. అల్లోపతి అనేది పనికిమాలిన సైన్స్ అంటూ బాబా రాందేవ్ తొలుత అగ్గి రాజేశారు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద శాస్త్రం యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని... అటువంటి ఆయుర్వేదాన్ని కాదని, అల్లోపతి మెడిసిన్ ను ప్రమోట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా దేశంలో క్రిస్టియానిటీని పెంచి పోషించడానికే జరుగుతోందంటూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. బాబా వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాందేవ్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్షవర్థన్ సైతం బాబా రాందేవ్ విమర్శలను తప్పుబడుతూ ఘాటుగా లేఖ రాశారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమన్నారు. అందుకు అంగీకరించిన బాబా.. తన కామెంట్లను విత్‌డ్రా చేసుకున్నారు.
వివాదం అక్కడితో ముగియలేదు. అల్లోపతి వైఫల్యాలను ఎండగడుతూ ట్విటర్‌లో 25 ప్రశ్నలు సంధించారు రాందేవ్. మరోవైపు, తనపై దేశద్రోహం కేసు పెట్టాలన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యాఖ్యలపైనా మరోసారి సంచలన కామెంట్లు చేశారు.
తనను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవంటూ తొడకొట్టకుండానే సవాల్ చేశారు బాబా రాందేవ్. ఐఎంఏతో పాటు మోదీ సర్కారు టార్గెట్‌గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. వాళ్ల బాబులు కూడా తనను అరెస్ట్ చేయలేరని అన్నారు. రాందేవ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.
కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజల్లో భయాలను కలిగించేలా రాందేవ్ వ్యవహరి, స్తున్నారని మోదీకి రాసిన లేఖలో ఐఎంఏ తెలిపింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత కూడా దేశంలోని 10 వేల మంది డాక్టర్లు మరణించారంటూ రెండు వీడియోల్లో బాబా రాందేవ్ ఆరోపించారని చెప్పింది. రాందేవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. కరోనా ఫస్ట్ వేవ్ లో 753 డాక్టర్లు, సెకండ్ వేవ్ లో 513 మంది వైద్యులు చనిపోయారని.. వీరెవరూ వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బాబా రాందేవ్ ఘాటుగా స్పందించారు. తనను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదంటూ కాక రేపారు.