మోదీ సర్కార్ వర్సెస్ సోషల్ మీడియా.. కొత్త రూల్స్ లోగుట్టు ఏంటి?
posted on May 27, 2021 @ 2:55PM
కొత్త డిజిటల్ రూల్స్. ఇండియాలో ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. సోషల్ మీడియాను కంట్రోల్ చేయటానికి కేంద్రం కుట్ర చేస్తోందనేది ఓ ఆరోపణ. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందనేది మరో వాదన. అందుకే, అమలుకు గడువు ముగిసినా.. కోర్టు కేసులు, వరుస కౌంటర్లతో మోదీ సర్కారు వర్సెస్ సోషల్ మీడియా రచ్చ రంజుగా సాగుతోంది.
కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ వాట్సాప్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. వాట్సాప్ కోర్టుకు వెళ్లడాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ప్రభుత్వ విధానాలను ధిక్కరించడమేనంటూ హూంకరించింది. కేంద్రం చెప్పినట్టు చేస్తే వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించిన వారిమి అవుతామంటూ వాట్సాప్ తేల్చి చెప్పింది. అటు, ట్విటర్ సైతం.. ఓకే, బట్ నాట్ ఓకే అన్నట్టు ఓ ప్రకటన చేసింది.
వర్తింపచేయదగిన చట్టానికి లోబడి ఉండటానికి కృషి చేస్తామని ట్విటర్ ప్రకటించింది. అయితే స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా మాట్లాడుకోవడాన్ని అడ్డుకునే నిబంధనలను మార్చాలని కోరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం ప్రకారం, సామాజిక మాధ్యమాల కంపెనీలు భారత దేశంలో కాంప్లియెన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. ఫిర్యాదులపై స్పందించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. చట్టబద్ధమైన ఆదేశం జారీ చేసినప్పటి నుంచి 36 గంటల్లోగా సంబంధిత కంటెంట్‌ను తొలగించాలి. భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే సందేశం సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయినపుడు, దానిని మొదట ఎవరు పోస్ట్ చేశారో చెప్పాలని ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి కంపెనీలకు కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి. అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్ట్‌లు, అత్యాచారాలు వంటి నేరాలను ప్రేరేపించే పోస్ట్‌ల విషయంలో కూడా సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందజేయాలనేది కొత్త రూల్స్ సారాంశం. అయితే, కేంద్రం చెప్పినట్టు చేస్తే తాము పాటిస్తున్న వ్యక్తి గోప్యతకు భంగం వాటిల్లుతుందనేది వాట్సాప్, ట్విటర్‌ల అభ్యంతరం.
కొత్త రూల్స్‌కు వ్యతిరేకంగా వాట్సాప్ కోర్టుకు వెళ్లగా.. ట్విటర్ గురువారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ట్విటర్ సర్వీస్‌ను అందుబాటులో ఉంచడం కోసం భారతదేశంలో వర్తించే చట్టాలకు అనుగుణంగా పని చేయడానికి కృషి చేస్తామని తెలిపింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా తాము చేస్తున్నట్లుగానే, పారదర్శకతా సూత్రాల మార్గదర్శకత్వంలో కచ్చితంగా పని చేస్తామని, తమ సర్వీస్‌పైగల ప్రతి గళానికి సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉంటామని, చట్టపరమైన నిబంధనల మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని ట్విటర్ తెలిపింది.
ప్రస్తుతం, భారతదేశంలో తమ ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనల పట్ల, తాము సేవలందిస్తున్న ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు సంభవించే అవకాశంగల ముప్పు పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. ‘‘మా అంతర్జాతీయ సేవా నిబంధనల అమలుకు ప్రతిస్పందనగా పోలీసులు బెదిరింపు వ్యూహాలను ఉపయోగించడం, అదేవిధంగా కొత్త ఐటీ రూల్స్ మౌలికాంశాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలోని పౌర సమాజంలో చాలా మందితో పాటు మాకు కూడా ఆందోళన ఉంది’’ అని తెలిపింది.
స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా, బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఆటంకాలు కల్పించే ఈ నిబంధనల్లో మార్పు కోసం వాదనలు వినిపించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తామని, పరస్పర గౌరవభావం, సహకారంతో కూడిన వైఖరిని అనుసరించడం చాలా ముఖ్యమని నమ్ముతున్నట్లు తెలిపింది. ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన సమష్టి బాధ్యత ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, పరిశ్రమ, పౌర సమాజానికి ఉందని గుర్తు చేసింది.
‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు ఇటీవల వెళ్లారు. దీంతో ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియా వర్సెస్ మోదీ సర్కారు వార్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి...