కేసీఆర్ టేబుల్‌పై ఇంటెలిజెన్స్ రిపోర్ట్!.. హుజురాబాద్‌లో గెలిచేది ఎవరంటే...
posted on Jul 2, 2021 @ 6:16PM
కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికిప్పుడు హుజురాబాద్ ఉపన్నికల షెడ్యూలు ప్రకటిస్తే.. జులై నెలాఖరులోగానే ఎన్నికలు నిర్వహిస్తే.. ఏమవుతుంది? అంటే, టీఆర్ఎస్ ఖేల్ ఖతం... అవుతుందని అంటున్నారు. ఇంతకీ అలా అని అంటున్నది ఇంకెవరో కాదు, సర్కారీ వేగులే.. ఇంటెలిజెన్స్ వర్గాలే ఆ మాటంటున్నాయి.
అఫ్ కోర్స్ ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదనుకోండి.. అయినా, ఇదొక హెచ్చరికగా తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. నిజానికి, ప్రజల పల్స్ తెలుసుకుని అవసరమైన దిద్దుబాటు చర్యల తీసుకోవడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటెలిజెన్సీ వర్గాలను రంగంలోకి దింపారని అధికార వర్గాలు అంటున్నాయి.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని పాటించే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు.. ప్రతి ఎన్నికలకు ముందు వివిధ కోణాల్లో, వివిధ సంస్థల ద్వారా సర్వేలు నిర్వహించడం అందరికీ తెలిసిన రహస్యమే. అలాగే, హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్సీ అధికారుల ఇంటింటి సర్వే స్థాయిలో సర్వే నిర్వహించారు. అది కూడా ఒక సారి కాదు, రెండు సార్లు వేర్వేరు టీమ్స్‌తో సర్వే చేయించారు. అయితే టీములు మారినా, గీతలు మాత్రం మారలేదని సమాచారం. రెండు టీములు ఇచ్చిన నివేదికలు కొంచెం అటూ ఇటుగా ఒకేలా ఉండడంతో, ముఖ్యమంత్రి మెరుపు వేగంతో వ్యూహాన్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నివేదికల్లో ఏముందంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని నివేదికల్లో ఉన్నట్లు సమాచారం. అధికార టీఆర్ఎస్ ఎంచుకున్న సెంటిమెంట్ అస్త్రం కూడా ఈటలకే ఫేవర్ చేసేలా ఉందని, ఇంటెలిజెన్సీ నివేదికలు స్పష్టం చేసిందని తెలుస్తోంది.
ప్రస్తుతం హుజురాబాద్ ఓటరు, ఉప ఎన్నికను ఈటల కోణం నుంచే చూస్తున్నారు. తెరాస, బీజేపీల మధ్య పోటీగా చూడడం లేదు. ఈ నేపధ్యంలో కేసీఆర్ పట్ల గౌరవం ఉన్నా, ఈటల మీద వేటు వేయడాన్ని అంగీకరించేది లేదని సామాన్య ఓటర్లతో పాటుగా, తెరాస కార్యకర్తలు కూడా స్పష్టం చేస్తున్నారు. అందుకే, ఈటలనే తెరాస అభ్యర్ధిగా గుర్తించి కారు బదులు కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని తెరాస కార్యకర్తలు అభిమానులు కూడ భావిస్తున్నారు. ఉద్యమకారులు, కూడా ఈటలను బీజేపీ అభ్యర్ధిగా కంటే ఉద్యమ కార్యకర్తగా చూస్తున్నారు. అందుకే ఆయన బీజేపీలో చేరడం ఇష్టం లేక పోయినా ఈటలను సమర్దించాలని, ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు.ఈ నేపధ్యంలో ఎన్నికలు ఇప్పట్లో జరగకుండా, గడువు చివరి వరకు మరో ఐదు మాసాలు ఆపగలిగితే, ప్రస్తుతం ఆవేశకావేశాలు చల్లబడి వాతావరణం తెరాసకు అనుకూలంగా మారుతుందని ఇంటెలిజెన్సీ అధికారులు సూచించినట్లు సమాచారం. అలాగే, ఇంతవరకు ద్విముఖ పోటీ అనుకున్నా, ఇప్పడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి తెరాస, బీజేపీలకు ధీటుగా పక్కా వ్యూహంతో బరిలో దిగేందుకు సిద్దమువుతున్నారు, దీంతో ఇప్పుడు త్రిముఖ పోటీ ఖరారై పోయింది.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది, నిర్ణయించేది కేంద్ర ఎన్నికల సంఘం. అంతే కాకుండా, బెంగాల్ సహా అనేక ఇతర రాష్ట్రాలలోనూ వేర్వేరు కారణాలతో ఖాళీ అయిన, అసెంబ్లీ లోక్ సభ స్థానాలకు సెప్టెంబర్ 10 లోపు ఎన్నికలు నిర్వహించాలని, అదే సమయంలో స్థానిక కరోనా పరిస్థితుల ఆధారంగా ఎక్కడికక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, తెరాస విజయం అనుమానంగా మారుతుంది. అందుకే ఎన్నికలను సాధ్యమైన మేరకు వాయిదా వేసేందుకు, అవసరమైన పరిస్థితులను సృష్టించేందుకు తెరాస సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరితే.. ఉప ఎన్నిక డిసెంబర్‌లో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈటల మాత్రం ఎంత వీలైతే అంత త్వరగా.. ఎన్నికలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. చివరకు ఏమవుతుంది అనేది ఇప్పుడే తేలేలా లేదు.