శిరీష ప్రొఫైల్ అదుర్స్.. అంతరిక్షంలో తెలుగు సంతకం..
posted on Jul 3, 2021 @ 11:04AM
మన అమ్మాయి. మన తెలుగు అమ్మాయి. ఆంధ్ర నుంచి అమెరికా వెళ్లింది. ఇప్పుడు అక్కడి నుంచి ఏకంగా అంతరిక్షంలోకే వెళ్లనుంది. శూన్యంలో తెలుగు సంతకం చేసేందుకు సిద్ధమవుతోంది. ఒక తెలుగుతేజం అంతరిక్షం దాకా ఎదగడం సాటి తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. అమెరికా వరకు వెళ్లడం కామనే అయినా.. అంతరిక్ష ప్రయాణం మాత్రం అసాధారణం. అతికొద్దిమందికే అది సాధ్యం. ఆ గుప్పెడు మనుషుల్లో మన తెలుగు యువతి కూడా ఉండటం విశేషం. శభాష్ శిరీష బండ్ల. మీ ఖ్యాతీ అజరామరం.
జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల ఒకరు. వాహక నౌకలో ఇద్దరు పైలట్లతో పాటు వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సస్, మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. శిరీష బండ్లతో పాటు.. చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కాలిన్ బెన్నెట్ అంతరిక్ష యానం చేయబోతున్నారు.
శిరీష బండ్ల పుట్టింది.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు. తండ్రి బండ్ల మురళీధర్, తల్లి అనురాధ. ఇద్దరూ యూఎస్ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నారు. అక్క ప్రత్యూష వర్జీనియా యూనివర్సిటీలో సైంటిస్ట్. శిరీష చిన్నప్పుడు హోస్టన్‌లో ఉండగా.. వాళ్ల ఇంటికి దగ్గర్లో ఓ స్పేస్ సెంటర్ ఉండేది. తరచూ వెళ్లేది. ఆస్ట్రోనాట్ కావాలనేది ఆమె చిన్ననాటి డ్రీమ్. ఇంటర్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌పైకి దృష్టిమళ్లింది.
ఇంజినీరింగ్ చదువుతూనే ఓ సంస్థలో ఇంటర్న్‌గా పనిచేసింది. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది.. ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి స్పేస్ ఇండస్ట్రీలో ఎంబీఏ చేసింది. మాథ్యూ ఇసాకోయిజ్ ఫెలోషిప్ అవకాశమూ వచ్చింది. స్పేస్ పాలసీల గురించి నేర్చుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్స్ డిజైనింగ్‌తోపాటు కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీ పాలసీలపైనా పని చేసింది. 2015లో స్పేస్ టూరిజం సంస్థ అయిన వర్జిన్ గాలక్టిక్కి మారిపోయింది. బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ మేనేజర్‌గా చేరి, వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగింది. 747 విమాన వాహకనౌక ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహం రూపకల్పనలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. అడ్వాన్స్‌డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘ఎల్-3’ కమ్యూనికేషన్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. తాజాగా ఈ సంస్థ ఈ నెల 11న ఒక టెస్ట్ స్పేస్ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనుంది. దీనిలో సంస్థ వ్యవస్థాపకుడు బ్రాన్‌సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించ నున్నారు. వాళ్లలో 30 ఏళ్ల శిరీష ఒకరు.
అంతరిక్షయానం చేయాలన్న తన చిన్ననాటి కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు శిరీష. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా-తానా శిరీషకు శుభాకాంక్షలు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిరీషను అభినందించారు. ‘‘శిరీష అంతరిక్షయానానికి ఎంపిక కావడం భారతీయులందరికీ గర్వ కారణం. ఈ బృందం నూతన అంతరిక్ష యుగానికి తెరతీస్తోంది. వారికి నా అభినందనలు’’ అని ట్వీట్ చేశారు.
అంతరిక్షయానం చేయనున్న బండ్ల శిరీషది గుంటూరు జిల్లా. అమ్మమ్మ ఊరు తెనాలి. నాయనమ్మ ఊరు పల్నాడులోని పిడుగురాళ్ల. శిరీష తల్లి డాక్టర్ అనూరాధ. శిరీష తండ్రి మురళీధర్. తెనాలికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ బండ్ల పుల్లయ్యకు శిరీష మునిమనుమరాలు. అదేవిధంగా, పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన బండ్ల రాగయ్యకు మనవరాలు. ఈయన ఎన్జీరంగా అగ్రి వర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్టుగా పనిచేసి రిటైరయ్యారు. పుల్లయ్య మనవరాలు డాక్టర్ అనూరాధ డాక్టర్ బండ్ల మురళీధర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ప్రత్యూష, శిరీష ఇద్దరు పిల్లలు. శిరీష తన బాల్యం నుంచే అంతరిక్షయానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాత రాగయ్య తెలిపారు.
--శిరీష సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటారు. మేథ్స్‌పై ఆసక్తి లేని వారికీ ఎన్ని మార్గాలున్నాయో తెలియచెప్పడం కోసం స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు.
--అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ, ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్లకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా. పర్‌డ్యూ యూనివర్సిటీ యంగ్ ప్రొఫెషనల్ అడ్వయిజరీ కౌన్సెల్‌కు మెంబర్.
--డాక్యుమెంటరీలు తీయడం శిరీష హాబీ. ఖాళీ సమయాల్లో మారథాన్‌ల్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది. నాన్‌వెజ్ అంటే ఇష్టం. పెరిగింది అమెరికాలోనేనైనా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వీలున్నప్పుడల్లా మన దేశానికి వస్తుంటుంది. గత ఏడాది తనకు కాబోయే భర్తనూ తీసుకొచ్చింది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతోంది.
--అంతరిక్ష యానం చేయబోతున్న తెలుగు తేజం శిరీష్ బండ్లకు తెలుగువన్ తరఫున ఆల్ ది వెరీ బెస్ట్.