రేవంత్‌రెడ్డి రెడీ.. కాంగ్రెస్ హస్తవాసి మారుతోంది..
posted on Jul 3, 2021 8:49AM
ఏడేళ్లుగా కాంగ్రెస్‌ది కష్టాల నావ. గులాబీ దెబ్బకు హస్తం పార్టీ అతలాకుతలం అవుతోంది. గెలిచేదే గుప్పెడు మంది. గెలిచాక వారిలో సగం మంది చేజారిపోతున్నారు. కారెక్కి తుర్రుమంటున్నారు. కాంగ్రెస్ తలరాత మారేదెప్పుడా అని కేడర్ ఆశగా ఎదురుచూస్తోంది. మళ్లీ గాంధీభవన్ నేతలతో కళకళలాడే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం రానే వచ్చేసింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంపికవడంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్. మొనగాడు వచ్చాడు.. కేసీఆర్‌ను దింపేస్తాడంటూ.. అప్పుడే గెలిచినంత సంబరపడుతున్నారు. రేవంత్‌రెడ్డి రాక కోసం గాంధీ భవన్ ముస్తాబవుతోంది. ఆయన పాదస్పర్శ కోసం సరికొత్త హంగులు అద్దుకుంటోంది.
జులై 7న పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు రేవంత్‌రెడ్డి. ఆయన రాక సందర్భంగా గాంధీభవన్ దోషాలు సరి చేస్తున్నారు. రేవంత్‌తో కాంగ్రెస్‌కు ఎలాగూ మంచి జరుగుతుంది. గాంధీభవన్ కూడా ఆయనకు కలిసిరావాలని పార్టీ భావిస్తోంది. అందుకోసమే.. ఏళ్లుగా గాంధీభవన్‌ను పట్టిపీడిస్తున్న వాస్తు దోషాలను ఇప్పుడు సరి చేస్తున్నారు. రేవంత్ వచ్చేలోగా వాస్తును సరిదిద్ది.. గ్రహాలన్నీ ఆయనకు, పార్టీకి అనుకూలించాలని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. గాంధీభవన్ వాస్తుమార్పుతో గడ్డుకాలం పోయి.. మంచికాలం రావాలని తపిస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.
కొత్త అధ్యక్షుని రాకతో గాంధీభవన్‌కు సరికొత్త మార్పులు రాబోతున్నాయి. పండితుల సూచన మేరకు వాస్తుమార్పులకు శ్రీకారం చుట్టారు. వాస్తు పండితుల బృందంతో ఇప్పటికే చర్చించి మార్పు-చేర్పులపై ప్లాన్ రూపొందించారు. ఆ మేరకు ప్రధాన మార్గాలు, ఛాంబర్లలో పనులు చేపట్టారు.
గాంధీభవన్కు దక్షిణం వైపు ఒకే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక మీదట తూర్పు నుంచి నేతలు లోపలికి వచ్చి దక్షిణం వైపు నుంచి బయటకు వెళ్లేలా రెండు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు వైపున ఉన్న పార్టీ సామగ్రి అమ్మే గది, సెక్యూరిటీ రూమ్‌ను తొలగిస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుని ఛాంబర్‌ను సైతం మార్చనున్నారు. పడమరలో ఉండే ఛాంబర్‌ను.. తూర్పు వైపునకు షిఫ్ట్ చేయనున్నారు. ఇక, పడమర వైపున.. ఒక వరుసన వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు గదులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ గది స్థానంలో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేస్తారు.
గాంధీభవన్, ప్రకాశం హాల్‌కు రంగులు వేసి.. విద్యుత్ దీపాలతో అలంకరించి.. నిత్యం వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీభవన్ ఆవరణలో అందంగా ల్యాండ్ స్కెపింగ్ ఏర్పాటు చేయనున్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే నాటికి గాంధీభవన్ కొత్త కళ సంతరించుకునేలా శర వేగంగా పనులు జరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాకతో.. గాంధీభవన్ వాస్తుతో పాటు కాంగ్రెస్ హస్తరేఖలు కూడా మారడం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేడర్‌లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహం నెలకొంది.