మరో తెలంగాణ పోరాటం.. ఉద్యమకారుల ఐక్య కార్యచరణ..
posted on Jul 2, 2021 @ 5:55PM
తెలంగాణ స్వప్నం ఏ ఒక్కరితోనో సాకారం కాలేదు. వందలాది బలిదానాలు.. వేలాది ఉద్యమకారులు.. లక్షలాది ప్రజలు.. కొట్లాడి సాధించుకున్నదీ ప్రత్యేక రాష్ట్రం. చీమల పుట్టలో పాము చేరినట్టు.. తెలంగాణ రాష్ట్రాన్ని అనకొండలాంటి కేసీఆర్ తన కబంద హస్తాల్లోకి లాగేసుకున్నారనే విమర్శ ఉంది. గులాబీ బాస్ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి.. తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అంటారు. తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ కబ్జా నుంచి విముక్తి చేయడానికి మరో ఉద్యమ పోరాటం తప్పదని భావిస్తున్నారు. అందుకే, ఆనాడు జనంతో కలిసి.. జనంలో పోరాడిన.. ఉద్యమకారులు మళ్లీ ఒక్కతాటి మీదకు వస్తున్నారు. మేధావులూ వారికి జత కలుస్తున్నారు. సమిష్టిగా ఉద్యమ కార్యచరణకు కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే హామీని తుంగలో తొక్కి.. ఏడేళ్లుగా తానే అధికారం చెలాయిస్తూ.. హక్కులను, ఉద్యమ గళాలను, కలాలను, కలలను.. అణిచివేస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు అసలైన ఉద్యమకారులు. అందలం ఎక్కగానే.. ఏ ఉద్యమకారులనైతే కేసీఆర్ తొక్కేసారో.. ఇప్పుడు అదే ఉద్యమ నాయకులు.. గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తున్నారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికి మళ్లీ ఏకం అవుతున్నారు. ఓకే గొడుగు కింద కలిసికట్టుగా.. బడుగుల బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
గాదె ఇన్నయ్య, ఎ.చంద్రశేఖర్, విజయరామారావు, కపిలవాయి దిలీప్ కుమార్, యన్నం శ్రీనివాసరెడ్డి, స్వామిగౌడ్, బెల్లయ్య నాయక్, బండి సదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ తదితరులతో కూడిన ఉద్యమకారుల.. ఉద్యమ ఆకాంక్షల పోరాట సమితి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. ప్రజాక్షేత్రంలో ముందుండి కొట్లాడిన.. ఉద్యమకారులంతా వరుస భేటీలతో భవిష్యత్ కార్యచరణకు కసరత్తు చేస్తున్నారు. అప్పటి ప్రముఖ ఉద్యమకారులంతా ఒకే ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చి.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా సామాజిక, సాంఘీక పునరేకీకరణకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై భవిష్యత్ కార్యచరణపై ఓ క్లారిటీకి వచ్చారు. భావసారుప్య వర్గాలను కలుపుకొని.. రానున్న కాలంలో పటిష్ట ఉద్యమ రూపకల్పనకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ఉద్యమకారులంతా కలిసి పోరాడాలని నిర్ణయించారు. తమ భావజాలం, కార్యచరణపై ప్రజలకు వివరించేందుకు.. ఈ నెల 9న హైదరాబాద్‌లో, 12న వరంగల్‌లో, 15న కరీంనగర్‌లో మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో, ఉద్యమకారుల ఉమ్మడి పోరాటంపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. హుజురాబాద్ కేంద్రంగా భారీ సభతో ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి నాంది పలకాలని భావిస్తున్నారు.