మా ప్రభుత్వంలో అవినీతి కంపు.. బీహార్ మంత్రి సంచలన ప్రకటన
posted on Jul 2, 2021 @ 6:46PM
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’కు మంచి నిజాయతీ పరుడనే పేరుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినాయకుడు లాలుప్రసాద్ యాదవ్’ కు అవినీతి పరుడనే ముద్ర ఎలాగైతే చెరగని మరకలా మిగిలిపోయిందో, నితీష్ కుమార్’కు నిజాయతీ పరుడనే పేరు అలా నిలిచిపోయింది. అయితే, ఇప్పడు ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని, ఇంకెవరో అనడం, ఆరోపించడం కాకుండా, అదే ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్నీ ఆరోపిస్తున్నారు. సహజంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు, ముఖ్యమంత్రుల రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తాయి, కానీ, ఇక్కడ సాహ్నీ, అధికారుల అవినీతి కంపు భరించలేక, తానే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్’కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు పొందిన సాహ్నీ, ‘‘నేను ఇక ఈ పదవిలో ఉండను.. రాజీనామా చేసేస్తా. నేను నిర్వహించే శాఖ ముఖ్య కార్యదర్శే నా మాట వినడం లేదు. ఇక నేను పదవిలో ఉండి ఎందుకు? ప్రభుత్వం మొత్తం అవినీతి మయమైపోయింది.. చేతులు తడపనిదే అధికారులు పనిచేయడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. సాంఘిక సంక్షేం శాఖలో తాను ఆమోదం తెలిపిన బదిలీలనూ అధికారులు నిలిపివేయడమేంటని ప్రశ్నించారు. శనివారం రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సమర్పిస్తానని మంత్రి మదన్ సాహ్ని ప్రకటించారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాహ్నీ, ప్రజలకు సేవ చేసేందుకు తను రాజకీయాల్లోకి వచ్చానే కానీ, కార్లు,బంగాళా కోసం మంత్రిని కాలేదని కుండ బద్దలు కొట్టారు.అంతే కాదు, అధికారులు తమ మాట వినడం లేదనే బాధతో పాటుగా, తన కళ్ళెదుటే అధికారులు అవినీతికి పాల్పడుతున్నా తానేమీ చేయలేక పోతున్నాననే ఆవేదన కూడా ఆయన మాటల్లో వ్యక్తమైంది. అలాగే, బహుశా చరిత్రలో ఎప్పుడు, ఎక్కడా లేనివిధంగా సాహ్నీ, తమ శాఖ అధికారుల ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇది తన ఒక్కడి బాధ కాదని, బీహార్’లో అధికారాల రాజ్యం నడుస్తోందని, తమకు విలువ ఇవ్వడం లేదన్న బాధ మంత్రులు అందరిలోనూ ఉందని ఆయన చెప్పారు.
సాహ్నీ చెప్పిందే సత్యమైతే, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయనకు మత్రమే కాదు రాష్ట్ర పజలకు కూడా సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతే కాదు, సాహ్నీ ప్రస్తావించిన విషయం, చేసిన ఆరోపణలు సాధారణ ఆరోపణలు కాదు. బహుశా ఆయన ఈవిషయాలను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళడం, లేదా మంత్రివర్గంలో చర్చించడం జరిగుందాలి. అయినా ముఖ్యమంత్రి పట్టిచుకోక పోలేదంటే. నితీష్ నిజాయతీని కూడా సంకించ వలసి ఉంటుంది, అంటున్నారు.