ఓవర్ టూ మోదీ.. ఢిల్లీలో దబిడి దిడిడే...
posted on Jul 3, 2021 @ 11:55AM
తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ముదురుతోంది. తెలంగాణ దూకుడుతో నీళ్లలో మంట రాజుకుంటోంది. ఏపీ ఇంకా డిఫెన్స్ గేమే ఆడుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో అడుగంటిన నీటి నుంచి కూడా తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా అడ్డుకోలేని దుస్థితి జగన్‌రెడ్డి ప్రభుత్వానిది. ప్రాజెక్టుల దగ్గర ఇరు రాష్ట్ర పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. తెలంగాణ మంత్రులు సీఎం జగన్‌ను నోటికొచ్చినట్టు తిడుతున్నా.. ఏపీ ప్రజల ప్రయోజనార్థం నోరుమెదపడం లేదంటూ మౌనరుషిగా మారిపోయారు ఏపీ సీఎం. ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండటంతో.. జల వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. ఈ లోపు పుణ్యకాలం కాస్తా ముంచిపోతుండటంతో.. సాగునీటికి ఏపీ రైతులు తీవ్ర ఇబ్బంది పడాల్సి రావొచ్చు. అందుకే, మేటర్‌ను వెంటనే పీఎం మోదీకి చెప్పాలని డిసైడ్ అయ్యారు జగన్. ఐదు పేజీల లేఖ కూడా రాశారు. జలవివాదాన్ని మీరే తేల్చండంటూ కేంద్రం కోర్టులోకి బంతిని తన్ని.. ఇక చేసేదేమీ లేదన్నట్టు చేతులెత్తేశారు సీఎం జగన్.
ఉమ్మడి ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాయడంతో.. తెలంగాణ సర్కారు సైతం అలర్ట్ అయింది. మీరు లెటర్ పోస్ట్ చేస్తే... మేము డైరెక్ట్‌గా వెళ్లి కలుస్తామన్నట్టు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. తాడోపేడో ఢిల్లీలోనే తేల్చుకోవాలని ఇరు రాష్ట్రాలు డిసైడ్ అయినట్టున్నాయి. నీటి వివాదాన్ని తెగేదాకా లాగేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు రెడీ అయిపోయారు. వారు వారు బానే ఉంటారు.. వారి రాజకీయ ప్రయోజనాలూ బానే ఉంటాయి. మధ్యలో రైతులే బలయ్యేది.
సీఎం కేసీఆర్ దూకుడు మరింత పెంచుతున్నారు. కృష్ణా జలాల్లో కేటాయింపులు లేకపోయినా.. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడాన్ని ఇటీవలి కేబినెట్ సమావేశంలో తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ అవసరమైతే ఢిల్లీలో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ధర్నా చేస్తామని కూడా వ్యాఖ్యానించారు. అందులో భాగంగా ముందుగా తాను ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు, మూడు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసమూ ట్రై చేస్తోంది తెలంగాణ సర్కారు.
ప్రధాని మోదీతో పాటు జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేస్తారని నీటిపారుదల శాఖ అధికార వర్గాల మాట. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956లోని నిబంధనల ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్ వేయాలని సీఎం కేసీఆర్ కోరనున్నారని అంటున్నారు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది. ట్రైబ్యునల్ కోసం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయగా.. కేంద్రం సూచనతో దానిని వెనక్కి కూడా తీసుకుంది. అయినా.. ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవడంతో మరోసారి పీఎం మోదీని కలిసి ట్రైబ్యునల్ ఏర్పాటుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారు సీఎం కేసీఆర్.
ఇలా, తెలంగాణ సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుండగా.. ఏపీ సీఎం జగన్ మాత్రం చర్చలకు సిద్ధం, లేఖలు రాస్తాం.. అంటూ కాలయాపన చేస్తున్నారనే విమర్శ వినబడుతోంది. తనను, తన తండ్రి వైఎస్సార్‌నున అంతేసి మాటలంటున్నా.. మౌనంగా పడుతున్నారే గానీ.. తిరిగి గట్టిగా సమాధానం చెప్పలేకపోవడం వెనుక.. మర్మమేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోని ఆస్తుల రక్షణ కోసమే.. గిచ్చితే గిల్లించుకుంటున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రుల స్వప్రయోజనాల కోసం ప్రజల్లో భావోద్రేకాలు రెచ్చగొడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇద్దరు సీఎంలు పరస్పర ఫిర్యాదులతో ఇక రెండు రాష్ట్రాల వాటర్ వార్.. ఢిల్లీకి షిఫ్ట్ అవుతుండటంతో.. ముందుముందు ఏం జరగబోతుందోననే ఉత్కంఠ నెలకొంది.