ప్రభుత్వ ఉద్యోగమున్నా దళితబంధు.. బెంజ్ కారున్నా రైతుబంధు.. కేసీఆర్ మారరా?
posted on Aug 16, 2021 @ 5:17PM
కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరు. తనను తానే ఓడించుకుంటుంది.. అనేది హస్తం పార్టీపై తరుచూ వినిపించే సామెత. అలాంటిదే.. కేసీఆర్‌ను ఉద్దేశించి మరో కామెంట్ ప్రచారంలో ఉంది. కేసీఆర్‌ను ఎవరూ ప్రత్యేకంగా విమర్శించనవసరం లేదు. ఆయనకు ఆయనే విమర్శలు వచ్చేలా చేసుకుంటారు.. అని అంటున్నారు. అందుకు రైతు బంధు, దళిత బంధునే ఉదాహరణగా చూపిస్తున్నారు.
రైతు బంధు అద్బుత పథకం. ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. ఎకరానికి 5వేలు చొప్పునా.. ఏటా రెండుసార్లు.. అంటే ఏటేటా 10వేలు రైతులకు ఆర్థిక సాయం చేయడమే రైతు బంధు. ఇక రైతు భీమా అదనం. ఎకరాకు 5వేలు అంటే మంచి అమౌంటే. అందుకే, గత ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్నారు. అంతా బాగానే ఉందిగానీ, వంద ఎకరాలు ఉన్న ఆసామికి కూడా ఏటా ఎకరానికి 10వేలు చొప్పున ఇవ్వడంపైనే చాలామందికి అభ్యంతరాలు. పంట పండించినా, పండించకపోయినా.. వ్యవసాయ భూమి ఉంటే చాలు 10వేలు ఇచ్చేస్తున్నారు. అందుకే, కొందరు బడాబాబులు పోగేసుకున్న భూములకు ఏటేటా లక్షల్లో రైతు బంధు అందుతోంది. కొందరు లగ్జరీ కార్లలో వచ్చి లక్షల్లో రైతు బంధు తీసుకెళ్లుతుండటం సన్నకారు రైతులకు కళ్లమంటగా ఉంది. ఇక, కష్టపడి పని చేసే కౌలురైతుకు పైసా కూడా రాకపోవడం రైతుబంధులో మరో లోపం. అందుకే, సంపన్న రైతులకు రైతు బంధు ఇవ్వొద్దనే సూచనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నా.. కేసీఆర్ వింటేగా. ఇచ్చేది తన జేబులోనుంచి కాదనేమో.. భూమునర్న రైతులందరికీ అమలు చేస్తూ రైతుబంధును కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మార్చేశారు.
రైతుబంధును ముందస్తు కసరత్తు లేకుండా మొదలెట్టేశారు.. మరో పథకంలో ఇలాంటి పొరబాట్లు లేకుండా చూసుకుంటారేమో అనుకున్నారంతా. కానీ, తానేమీ మారలేదని.. తనతీరే ఇంతనేలా.. దళిత బంధునూ మళ్లీ రైతు బంధు తరహాలోనే అమలు చేస్తామంటూ ఘనంగా ప్రకటించేశారు. ఎస్సీలయితే చాలు.. పేద-ధనిక అనే తేడా లేకుండా దళిత బంధు ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. చివరాఖరికి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా సరే.. దళిత బంధు వర్తింస్తుందని హుజురాబాద్ వేదికగా ప్రకటించేశారు సీఎం కేసీఆర్. కాకపోతే, చిన్న కండిషన్. ముందుగా పేదలకు దళిత బంధు ఇచ్చి, ఆ తర్వాత లాస్ట్‌ను ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాలకు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా దళిత బంధు ఇవ్వడంపై అప్పుడే విమర్శలు మొదలైపోయాయి. వెనకబడిన కుటుంబాలను పైకి తీసుకురావాలనే సదుద్దేశ్యం ఇలాంటి చర్యలతో తప్పుదారి పడుతుందని అంటున్నారు. అసలే దళిత బంధుకు అవసరమయ్యే లక్షా 70వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలీని పరిస్థితి. అలాంటి ఆర్థిక సంక్లిష్టతల మధ్య.. ఇలా అందరికీ 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడం కరెక్ట్ కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సొమ్ము.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి కాకుండా.. వెనుకబడిన వేరే వర్గాలకు సాయం చేస్తే బాగుంటుందిగా అంటున్నారు. ఆ.. కేసీఆర్ ఇచ్చేదీ లేదు.. మరో నాలుగేళ్లు దళిత బంధు అమలయ్యేది లేదు.. లాస్ట్ వరకూ చూసుకోవచ్చులే అనుకొని ఉంటారు.. అందుకే, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా అందరికీ దళిత బంధు ఇస్తానంటున్నారనే వారూ లేకపోలేదు. కారణం ఏదైనా.. సంపన్నులకు రైతు బంధు ఇవ్వడం ఎలాగో.. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్‌కు సైతం దళిత బంధు ఇస్తామనే నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినా, కేసీఆర్ తాను ఒక్కసారి కమిటైతే తనమాట తానే విననంటున్నారు. రైతులందరికీ రైతు బంధులానే, దళిత కుటుంబాలన్నిటికీ 10 లక్షల చొప్పున దళిత బంధు ఇచ్చి తీరుతానంటున్నారు. ఖజానా ఖాళీ అయితేనేం.. ఓట్లు భారీగా పడతాయిగా అన్నట్టు ఉంది కేసీఆర్ నైజం అంటున్నారు. ఏం చేద్దాం.. మనం కట్టే పన్నులను.. తనకు ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేసే అధికారం ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేతిలో ఉందిగా.. విమర్శించడం మినహా.. ఇంతకుమించి ఇంకేం చేయలేమంటూ విసుక్కుంటున్నారు ప్రజలు.