మోడీ.. యుద్దానికి సిద్దం కండి! సుభ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
posted on Aug 17, 2021 @ 6:41PM
రెండు దశాబ్దాల తర్వాత అఫ్గానిస్థాన్.లో తాలిబన్’ ప్రభుత్వం ఏర్పడింది. రక్తం చుక్క చిందకుండా తాలిబన్లు కాబూల్ ను వసపరచుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచిపారిపోయారు. మరో వంక ఆఫ్ఘన్ ప్రజలు దేశం వదలి పారి పోతున్నారు. భయం లేదు రండి మీ ఉద్యోగాలు మీరు, మీ వ్యాపారాలు మీరు చేస్కొండి అని తాలిబాన్ నాయకులు అభయమిచ్చినా బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని, దేశ, విదేశీ ప్రజలు చిక్కిన విమానం పట్టుకుని పరుగులు తీస్తున్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు భారత వాయుసేన రంగంలోకి దిగింది, ఈ రోజు (ఆగష్టు 17) 200 మందికి పైగా ప్రయాణీకులతో తొలి విమానం కాబూల్ నుంచి ఆహ్మదాబాద్ చేరుకుంది.
సంచలనాలకు చిరునామాగా నిలిచే బీజేపీ ఎంపీ, సుభ్రమణ్య స్వామి ఆఫ్ఘన్’ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్’లో తాలిబన్’ రాజ్యం ఏర్పాటు మన దేశానికి పెను ముప్పుగా పరిణమిస్తుందని స్వామి హెచ్చరిస్తున్నారు. రక్తపాత రహితంగా అధికారం హస్తగతం చేసుకున్న తమ పాలనను ప్రపంచ దేశాలు గుర్తించాలని తాలిబన్ నాయకుల విజ్ఞప్తిని మన దేశం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మరోవంక పాకిస్థాన్ , చైనా తాలిబన్ ప్రభుత్వాని గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపధ్యంలో మన దేశానికి, తాలిబన్ల నుంచి ఈరోజు కాక పొతే రేపైనా ముప్పు తప్పదని, అంతవరకు ఆగకుండా ముందుగా మన దేశమే ఆఫ్ఘానిస్థాన్/ తాలిబన్ల పై యుద్దానికి సిద్దం కావాలని స్వామి ప్రధాని మోడీకి సూచించారు. అలాగే, తాలిబన్ వ్యతిరేక శక్తులకు మన దేశం ఆశ్రయం కల్పించి, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, ఇటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ‘ను స్వాదీన పరచుకోవడం అటు ఆఫ్ఘన్’లో తాలిబన్లను అణచివేయాలని సుభ్రమణ్య స్వామి సూచించారు. మన దేశం
ఒక్క సుభ్రమణ్య స్వామి మాత్రమే కాదు, బీజేపీ మాజీజాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ కూడా యుద్ధం ప్రస్తావన లేకుండా అఫ్గానిస్థాన్-తాలిబన్ల విషయంలో భారత ప్రభుత్వం తన వ్యూహాలను వేగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే, విశ్రాంత సైనిక అధికారి, ఏఆర్కే రెడ్డి, కూడా ఒక టీవీలతో మాట్లాడుతూ, కాబూల్ తాలిబన్’ వశం కావడంతో మన దేశానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. తాలిబన్ల సహాయంతో పాకిస్థాన్ మన దేశంలో అంతర్గత తీవ్ర వాదాన్ని పొంచి పోషించే ప్రమాదం ఉందని అయన అభిప్రాయ పడ్డారు.
అయితే ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవడంతో పాటుగా ఆదేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఉదారంగావ్యవహరిస్తూ వచ్చిన మన దేశం తాజా పరిణామాలను, వేగంగా మారుతున్నా పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తోందని, ముందు అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్తి పెట్టిందని ప్రభుత్వ వర్గాల సమాచారం.