బండి సంజయ్‌కి కేటీఆర్ ఖతర్నాక్ పంచ్..
posted on Aug 17, 2021 @ 1:26PM
ట్విట్టర్‌లో కేటీఆర్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తెలంగాణ రాజకీయ నేతల్లో కేటీఆర్ వాడినంతగా ట్విట్టర్‌ను మరే నేతా వాడరు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తుంటారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో లైవ్ చాట్ కూడా చేస్తుంటారు. ఇటీవల క్రికెట్ మ్యాచ్‌లపైనా ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, నెట్ సర్ఫింగ్ చేస్తుండగా.. కేటీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిక్కారు. బండి చేసిన ఓ ట్వీట్ ఆయన కంట పడింది. ఇక అంతే. క్షణం ఆలస్యం చేయకుండా తనదైన స్టైల్‌లో బండి ట్వీట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు కేటీఆర్. మంత్రి చేసిన ఆ సెటైరికల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘దరఖాస్తుల ఉద్యమం’ స్టార్ట్ చేశారు. సోమవారం కరీంనగర్‌లో దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విషయాన్ని, ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు బండి సంజయ్. ఆ ట్వీట్‌కు తాజాగా కేటీఆర్ స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం ప్రకారం ప్రతి పౌరుడికి రూ.15లక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ బీజేపీ శాఖ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాను. అర్హులైన రాష్ట్ర ప్రజలంతా తమ జన్‌ధన్ ఖాతాల్లో ధనాధన్ డబ్బులు పడేందుకు బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలి’’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు కేటీఆర్.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే విదేశాల్లోని బ్లాక్‌మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామంటూ అప్పట్లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ అంశంపై ప్రతిపక్షాలు పదే పదే మోదీని, బీజేపీని గుచ్చి గుచ్చి అడుగుతుంటాయి. బ్లాక్‌మనీ ఏమైంది? మా అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్నారుగా ఎప్పుడు వేస్తారంటూ సెటైర్లు వేస్తుంటాయి. ఇదే టాపిక్‌ను బేస్ చేసుకొని మంత్రి కేటీఆర్ సైతం.. బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమంపై ఇలా ఆసక్తికరంగా కౌంటర్ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి బండి సంజయ్ రీకౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి మరి...