కేసీఆర్ పోతే పీసీఆర్.. ఓటమిపై క్లారిటీ ఇచ్చేశారా?
posted on Aug 17, 2021 @ 12:53PM
"ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. నాలుగు సార్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. 20 ఏళ్లు పరిపాలిస్తా. ఇప్పటికి రెండుసార్లు గెలిచా. మరో రెండు పర్యాయాలు నాదే విజయం. నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది. కేటీఆర్ కాదు వచ్చేసారి కూడా నేనే సీఎం. ఇందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు." ఇదీ పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన డైలాగ్స్. తన గెలుపుపై అంత ధీమాగా ఉండేవారు కేసీఆర్. తెలంగాణ తన సొత్తు అన్నట్టు మాట్లాడేవారు. ఎక్కడా, ఏ కోశానా కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యేవారు కాదు. తెలంగాణను 20ఏళ్లు పాలించడమే ఆయన టార్గెట్. కానీ......
ఇదంతా ఓ ఏడాది ముందరి మాట. కొంతకాలంగా తెలంగాణ రాజకీయం వేగంగా మారిపోతోంది. కీలక నేతల కారణంగా అనూహ్య మలుపులు తిరుగుతోంది. కేసీఆర్ పాలనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మాటల గారెడీ మినహా.. చేసిందేమీ లేదనే అసహనం వ్యక్తమవుతోంది. డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు, రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రజాగ్రహంతో ఇన్నాళ్లూ తనదే హవా అనుకున్న గులాబీ బాస్‌కు దుబ్బాక, జీహెచ్ఎమ్‌సీ ఎన్నికలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. బీజేపీ బండి యమ జోరు మీదుంది. అంతలోనే తేరుకున్న కేసీఆర్.. రెండు ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జున సాగర్ గెలుపుతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇక బిందాస్ అనుకుంటుండగా.. ఈటల రాజేందర్ కిరికిరి స్టార్గ్ అయింది. అదే సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రూపంలో మరో ఉప్పెన ముంచెత్తింది.
అసలే బీజేపీ దూకుడు మీదుంది. కమలనాథులకు ఈటల రాజేందర్ రూపంలో మరో ఆయుధం చేతికొచ్చింది. అప్పటి నుంచి ఈటలతో కేసీఆర్‌పై ఈటెలు ప్రయోగిస్తోంది బీజేపీ. ఈటల మాటల దాడి తట్టుకోలేక.. కేసీఆర్ ఏళ్లుగా చేయని పనులన్నీ వరుసబెట్టి చేసుకొస్తున్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, గొర్రెలు పంచుతున్నారు. ప్రగతి భవన్ వీడి ప్రజల్లోకి వస్తున్నారు. తనను తాను కొత్తగా మలుచుకుంటున్నారు.
ఈటలను కాచుకోవడమే కష్టమవుతుంటే.. ఇక ఈ రేవంత్‌రెడ్డి ఒకడు.. ఓ పట్టాన ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. విమర్శలతో కుళ్లబొడుస్తూనే.. దళిత-గిరిజన దండోరాతో దండయాత్ర చేస్తున్నాడు. తెలంగాణలో బలమైన కేడర్ ఉన్నా.. ఇన్నాళ్లూ బలమైన నాయకుడు లేక స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. పీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వంలో కదనోత్సాహంతో ప్రగతి భవన్ వైపు కదులుతున్నారు. ఇటు కాంగ్రెస్ దండోరాలు.. అటు బీజేపీ పాదయాత్రలతో కేసీఆర్‌కు కష్టకాలం దాపురించిందని అంటున్నారు.
ఎవరో అనడం కాదు.. కేసీఆర్‌కు సైతం కాస్త క్లారిటీ వచ్చేసినట్టుంది. ఈసారి తన గెలుపు అంత ఈజీ కాదని అనిపిస్తున్నట్టుంది. అందుకే కాబోలు.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా.. తాను పోయి ఏ పీసీఆరో సీఎం అయినా.. తాను తీసుకొచ్చిన పథకాలు మాత్రం ఆగబోవంటూ.. భవిష్యత్‌పై ఓ రకమైన నిర్వేదం వ్యక్తం చేశారని అంటున్నారు. లేదంటే.. 20 ఏళ్ల పాటు తెలంగాణను పాలిస్తానంటూ గతంలో ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్.. తాజాగా హుజురాబాద్ సభలో కేసీఆర్ పోయి పీసీఆర్ వస్తే.. అంటూ తన అధికారం శాశ్వతం కాదనేలా మాట్లాడటం ఆయనలో ఉన్న ఓటమి భయానికి పరోక్ష సంకేతమంటున్నారు. మరి, ఆ పీసీఆర్ ఎవరనేది కాలమే డిసైడ్ చేస్తుంది... ఆ పీసీఆర్ కూడా కేసీఆరే అవుతారా? లేక, ఏ రేవంత్‌రెడ్డో, బండి సంజయో అవుతారా అనేది ముందుముందు తెలుస్తుంది...