హెలికాఫ్టర్ నిండా నోట్ల కట్టలతో పారిపోయిన ఆప్ఘన్ అధ్యక్షుడు!
posted on Aug 16, 2021 @ 7:13PM
అఫ్ఘనిస్థాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశమంతా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆప్ఘన్లు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. కొందరు దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.అక్కడి మహిళలు తమకు బానిసత్వం తప్పదని భయపడిపోతున్నారు. తాలిబన్లు దేశసరిహద్దులను మూసివేయడంతో..వారు కాబూల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకుని, విమానాలు పట్టుకుని వేళాడుతూ అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషాదకర దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు.అప్గానిస్తాన్ కాస్తా తాలిబన్ స్తాన్ గా మారిపోయినట్లే. దేశాధ్యక్షుడు గుట్టుచప్పుడు కాకుండా దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. తాపీగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి.. మారణహోమం ఇష్టం లేకనే తాలిబన్లతో పోరాడలేదని సెలవిచ్చారు. తాలిబన్ల దయాదాక్షిణ్యాలకు తమను వదిలేసి దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఓ రష్యా వార్తా సంస్థ తాజాగా సంచలన విషయాన్ని ప్రచురించింది. అఫ్ఘాన్ అధ్యక్షుడు..తన వెంట నాలుగు కార్లు, పెద్ద హెలికాఫ్టర్ నిండా నోట్ల కట్టలు తీసుకుని దేశం నుంచి పారిపోయారని ప్రచురించింది. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాల్ని వెల్లడించినట్టు పేర్కొంది. హెలికాఫ్టర్‌లో జాగా సరిపోకపోవడంతో కొంత డబ్బును అఫ్ఘానిస్థాన్‌లోనే విడిచిపెట్టాల్సి వచ్చిందని కూడా తెలిపింది. అఫ్ఘానిస్థాన్‌లో ప్రజస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం లేకపోయినప్పటికీ అక్కడ మరికొంత కాలం పాటు పరిమిత స్థాయిలో దౌత్యసిబ్బందిని కొనసాగించేందుకు రష్యా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అఫ్గానిస్తాన్ మొత్తంలో ఒక్క కాబూల్ ఎయిర్ పోర్టు తప్పించి మిగిలిన ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోఉంది. దీంతో.. ఎయిర్ పోర్టుకు రావటంతో తమ ప్రాణాల్ని దక్కించుకోవాలన్న అత్రుతతో పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకుప్రజలు పోటెత్తుతున్నారు. వీరిని కంట్రోల్ చేయటం సాధ్యం కాని అమెరికన్ సైనికులు గాల్లో కాల్పులు జరుపుతున్నారు. ఏదోలా విమానంలో ప్రయాణించి విదేశాలకు పారిపోవాలని భావిస్తున్న వారి కారణంగా ఇప్పటివరకు ఏ ఎయిర్ పోర్టులో చూడని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒక విమానంలో గుంపులు గుంపులుగా ఎక్కేసి.. నిలుచోవటానికి జాగా దొరికితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్న వారి తీరు చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి.