గో బ్యాక్ ఆంధ్రా.. జగన్ సర్కారుకు మరో షాక్..
posted on Aug 17, 2021 @ 11:56AM
జగన్ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులే. ఏ పని చేసినా ఏదో ఒక కొర్రీనే. ఇప్పటికే అప్పులతో ఖజానా ఖాళీ చేసేశారు. కొత్త అప్పులు ముట్టక తెగ ఇబ్బందులు పడుతున్నారు. అడ్డగోలు అప్పులపై కేంద్రంతో మొట్టికాయలు వేయించుకుంటున్నారు. కేంద్రంతో ఏపీకి ఏమాత్రం సఖ్యత లేకుండాపోయింది. అటు, పాత మిత్రుడు కేసీఆర్‌తో కొత్తగా వైరం పెట్టుకున్నారు. జలజగడాన్ని తెగేదాక లాగుతూ పొరుగురాష్ట్రంతో ఫైటింగ్ చేస్తున్నారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ.. ఈ రెండూ చాలవన్నట్టు.. తాజాగా ఒడిశాతో సరిహద్దు వివాదాన్ని మరింత కెలుకుతున్నారు. చిన్న స్టేట్ అయిన ఒడిశా.. జగన్ సర్కారుకు గట్టి ఝలక్ ఇస్తోంది. సీఎం జగన్ విధానాలతో ఏపీ పరువంతా పోతోందని అంటున్నారు.
ఏపీ, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో మరోసారి వివాదం తలెత్తింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా గ్రామాలైన పట్టుచెన్నూరు, పగులుచెన్నూరుల్లో జగనన్న పచ్చతోరణం, ప్రభుత్వ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ వెళ్లాలని భావించారు. విషయం తెలుసుకున్న ఒడిశా ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మనవారిని అడ్డుకున్నారు. ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు, పోలీసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సరిహద్దులోని హర్మాడగి దగ్గర రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి.. గో బ్యాక్ ఆంధ్రా.. అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఏపీ అధికారులను ఒడిశా నాయకులు, ఆఫీసర్లు అడ్డుకున్నారు. రెండు గ్రామాల కార్యదర్శులు, వీర్వో, ఇద్దరు ఐటీడీఏ వర్క్ ఇన్‌స్పెక్టర్లను పట్టుచెన్నూరు, పగులుచెన్నూరు విలేజ్‌లోకి రాకుండా వ్యతిరేకించారు. చేసేది లేక అధికారులంతా తిరిగి సాలూరు చేరుకున్నారు.
ఘటనపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర స్పందించారు. సరిహద్దులో ఒడిశా నాయకులు, పోలీసులు మోహరించి తమను అడ్డుకోవడం దారుణమన్నారు. అయితే, జిల్లా కలెక్టర్, ఎస్పీల సూచనతో తమ కొఠియా గ్రామాల పర్యటనను రద్దు చేసుకున్నామని తెలిపారు.