ఏపీ అంటే అప్పు చేసి పప్పు కూడు.. జగన్ కు జైలు ఖాయమేనట?
posted on Aug 16, 2021 @ 7:13PM
ఆంధ్రప్రదేశ్ ను ఏపీ అని పిలుస్తారు. ఏ అంటే ఆంధ్ర పీ అంటే ప్రదేశ్. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే అప్పటి సీఎం చంద్రబాబు ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరమని తరుచూ చెబుతూ ఉండేవారు. ఏపీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పేవారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు తమకు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఏపీ అని అంటుండేవారు చంద్రబాబు.
ఇక జగన్ రెడ్డి పాలనలో సీన్ మారిపోయింది. ప్రస్తుతం ఏపీ అప్పులమయంగా మారిపోయింది. దేశంలో అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లో ఉంది. పరిమితికి మించి ఏపీ అప్పులు తీసుకుందని, రాష్ట్ర ఆర్ఠిక పరిస్థితి దారుణంగా ఉందని కేంద్ర సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీ ఖజానా ఖాళీగా ఉంది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న ప్రతినెలా అప్పులు తెవాల్సిన పరిస్థితిలో ఉంది. జగన్ సర్కార్ ఆర్థిక విధానాల వల్లే పరిస్థితి ఇంతగా దిగజారిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రం అధోగతిపాలవుతుందని...అప్పుచేయొద్దని చెబితే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నట్టా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేవారని, ఇప్పుడు ఏపీ అంటే అప్పుచేసి పప్పుకూడని అంటున్నారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని చక్కగా అమలు చేస్తున్నామని సీఎం అన్నారని, మరి మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలన్నారు రఘురామ రాజు. మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూనే ఉందన్నారు. జగనన్న విద్యాకానుక పథకమే కాకుండా టీచర్ల కొరతపై కూడా దృష్టి పెట్టాలని రఘురామ సూచించారు. రాష్టంలో కేవలం 30 నుండి 32 శాతం మాత్రమే వాక్సినేషన్ ప్రక్రియ జరిగిందన్నారు. ఒక్కరోజు 10 లక్షల టీకాలు పేరు మీద హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో కరోనా మళ్లీ విజృంభిస్తోందని, పాఠశాలల ప్రారంభంపై సీఎం ఆలోచన చేయాలన్నారు. పథకాలకు సీఎం తండ్రిపేరు, ఆయన సొంత పేరు తప్ప ఇతరులు లేరా? అని ప్రశ్నించారు. పథకాలకు సీఎం సొంత పేర్లు పెట్టుకుంటే ప్రజలలో ఏహ్యభావం కలుగుతుందన్న పవన్ కల్యాణ్ అభిప్రాయంపై ముఖ్యమంత్రి ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పైనా రఘురామ రాజు స్పందించారు. ఈ నెల 25న సీబీఐ కోర్టులో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. కోర్టులో తమ లాయర్లు సమర్ధవంతంగా వాదనలు వినిపించారని చెప్పారు. వైసీపీ నేతలు సంస్కారం నేర్చుకోవాలని, పదాలను జాగ్రత్తగా వాడాలని సూచించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ రాజు వేసిన పిటిషన్ పై ఇటీవలే సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈనెల 25న తీర్పు రాబోతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.