అసమర్ధత బయటపడకుండా రహస్యమా? జనం నుంచి జగన్ రెడ్డి పారిపోతున్నారా?
posted on Aug 17, 2021 @ 1:17PM
మాట తప్పం.. మడమ తిప్పం... చేసేదే చెబుతాం.. చెప్పింది చేసి తీరుతాం.. ఇదీ గత ఎన్నికల సమయంలో జగన్ నినాదం.. వైసీపీ నినాదం. మేము చంద్రబాబులా కాదు.. ప్రభుత్వం చేసే ప్రతిపని ప్రజలకు చెబుతాం.. చంద్రబాబు కొన్ని జీవోలు దాచిపెట్టారు.. ఇది ప్రతిపక్షంలో జగన్ చేసిన ప్రతిజ్ఝ.. కట్ చేస్తేస్వాతంత్ర దినోత్సవం ముగిసిన మరుసటి రోజునే జగన్ రెడ్డి మడమ తిప్పారు. తన పాలన నిర్ణయాలు చూసి ప్రజలు జడుచుకుంటారేమో భయపడ్డాడోమో.. కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జీవోలు ఏపీ పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని ఆదేశించారు. చంద్రబాబు ఒకటో రెండో జీవోలు దాచాడేమో.. కానీ నేను మీకు ఒక్క జీవో కూడా చూపించనంటూ నిర్ణయం తీసేసుకున్నారు. జీవోలు ఆన్ లైన్లో పెడితే గోల చేస్తున్నారు.. అసలు ఆన్ లైన్లో పెట్టకపోతే ఏం చేస్తారు అంటూ ముందుకు వెళ్లారు. జగన్ సర్కార్ నిర్ణయంతో ఇక ఏపీలో జీవోలన్నీ ఆఫ్ లైన్ లో అధికారుల మధ్యే ఉండనున్నాయి.
జీవోఐఆర్... అంటే, ప్రభుత్వ ఉత్తర్వుల ఇష్యూ రిజిస్టర్. ఇందులో అప్‌లోడ్ చేస్తేనే... జీవో నంబర్ వస్తుంది. ఒక ఉద్యోగి సర్వీసుకు సంబంధించిన ఉత్తర్వు నుంచి, ఐఏఎస్ ల బదిలీ వరకు ఏ జీవో జారీ చేసినా ఈ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. ప్రజలకు ఆ సమాచారం అందుబాటులో ఉంటుంది. కొన్ని జీవోలను మాత్రం ‘కాన్ఫిడెన్షియల్’గా పేర్కొంటూ, అందులోని సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పెట్టరు. ఇది... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన పారదర్శక విధానం. ‘సమాచార హక్కు చట్టం’ అమలులోకి వచ్చిన నేపథ్యంలో... ప్రభుత్వ ఆదేశాల జారీలో రహస్యం ఉండకూడదని తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా ఇదే విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు... ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పారదర్శక విధానానికి పాతరేశారు. ఇకపై కీలకమైన జీవోలేవీ వెబ్‌సైట్‌లో పెట్టకూడదంటూ సర్క్యులర్ జారీ చేశా రు. అంటే... అంతా రహస్యం. ప్రభుత్వం చెప్పాలనుకున్నదే ప్రజలకు తెలుస్తుంది.
ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియడంతో పెద్ద దుమారమే చెలరేగుతోంది. జీవోలన్నీ బయటకు తెలియడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఏ విషయం కూడా అందరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొస్తూ ఎవరికి దొరకకుండా చూసుకుంటోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రహస్య జీవోల పాలన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. బ్లాంక్ జీవోలతో రహస్య పాలన చేస్తోందని టీడీపీ గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసింది. అయినా వెనక్కి తగ్గని జగన్ రెడ్డి సర్కార్.. తాజాగా పూర్తి రహస్య పద్ధతి పాటించేందుకు నిర్ణయించింది. జీవోలను ఇక పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చూడాలని సంకల్పించింది.
పలురకాల ఇక్కట్ల నుంచి తప్పించుకుని... కొన్ని విషయాల్లో పరువు దక్కించుకునేందుకే ప్రభుత్వం ‘రహస్య పాలన’కు తెరలేపిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాలన, జీవోల జారీ, వాటి తయారీకి ఒక పద్ధతి ఉంటుంది. జగన్ సర్కారు వచ్చాక అదంతా గాడి తప్పింది. కొన్ని ఉత్తర్వులు సర్కారును అభాసుపాలు చేస్తున్నాయి. ఒక అధికారి బదిలీ, పోస్టింగ్‌పై ఉత్తర్వు ఇచ్చిన గంటల వ్యవధిలోనే మరో ఉత్తర్వు ఇవ్వడం, దాన్ని మళ్లీ సవరించడం పరిపాటిగా సాగిపోయింది. జీవోలో వాడిన భాషలోనూ తప్పులు దొర్లిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంబంధం లేకుండానే జూనియర్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కనీసం సీఎ్‌సకు సమాచారం ఇవ్వకుండా, ఫైలు పంపించకుండానే అనేక అంశాల్లో జీవోలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పారనే పేరుతో ఎవరుపడితే వారు విధానపరమైన అంశాల్లో జీవోలు ఇచ్చారు. ఇలాంటి ఉత్తర్వులతో ప్రభుత్వ అసమర్థత ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. దీంతో అబాసుపాలైన ప్రభుత్వం.. ఇలాంటి నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసలు రాష్ర్టంలో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో సీక్రెట్ లు పాటిస్తూ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండా చేస్తూ మోసాలకు పాల్పడుతుందని మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ జీవోలను ఇకపై ఆన్‌లైన్‌లో పెట్టకూడదనే ఆదేశాలు జారీ చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టాలని కోరారు. జగన్ సర్కార్ నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జీవోలు ఆన్ లైన్లో పెట్టకపోతే బయటకు తీయడానికి ఆర్టీఐ చట్టం ఉందన్న విషయం మరిచిపోయారు జగన్ అంటూ కొందరు పోస్టులు చేశారు. మొన్న ఇంటిపన్ను, చెత్తపన్ను, బాత్రూంపన్నులపై జీవోను పత్రికలలో సరిగా ప్రచురించకున్నా కూడా సామాన్య జనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని అధికారులను, నాయకులను నిలదీసిన సంఘటన చూసి,జీవోలు అన్లైన్ లో ఉంచకూడదని మహత్తరమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న జగనన్న అంటూ తిట్టిపోస్తున్నారు.