బంద్‌లో కాకుండా మోదీతో విందులో.. కేసీఆర్‌ను కార్నర్ చేసిన రేవంత్..
posted on Sep 27, 2021 @ 1:51PM
రేవంత్‌రెడ్డి విమర్శలు పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. ఆయన మాటల్లో లాజిక్, మేజిక్ ఉంటుంది. ప్రతీ మాటకో లెక్క. పక్కా ఆధారాలతో విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తుంటారు. సందర్బానుసారం గతాన్ని ప్రస్తావిస్తుంటారు. అందుకే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసే ప్రతీ కామెంట్ ఇటు కేసీఆర్‌కు, అటు కేటీఆర్‌కు స్ట్రాంగ్‌గా తగులుతుంటుంది. రేవంత్ విమర్శలతో తండ్రీకొడుకులు తెగ ఇరకాటంలో పడుతుంటారని అంటారు. తాజాగా, భారత్ బంద్ విషయంలోనూ కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రిని ఇబ్బందుల్లో పడేశారు. ఇంతకీ రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే...
మోదీ ఏం మాయ చేశారో గాని కేసీఆర్‌లో మార్పు వచ్చింది. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ భారత్ బంద్‌లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారు. కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అదానీ, అంబానీలకు సాగును మోదీ తాకట్టు పెట్టారు. అలాంటి మోదీకి కేసీఆర్ మద్దతు ఇస్తారా? అంటూ రేవంత్‌రెడ్డి నిలదీశారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతు ఉద్యమానికి కేసీఆర్ తొలుత మద్దతిచ్చారని గుర్తు చేశారు. గతంలో రైతు బంద్‌లో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ వైఖరి మారిపోయింది. రైతు శ్రేయస్సును గతంలో కాంగ్రెస్ కాపాడింది. మోదీ సర్కారు రైతులను బానిసగా మార్చింది. సాగు చట్టాలతో రైతు భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. సాగు చట్టాలు రైతులు, వినియోగదారులకు మరణశాసనాలే.. అంటూ ఉప్పల్ డిపో ముందు ధర్నాలో రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
నిజమే. గతంలో కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్ చేపట్టారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ బంద్‌కు అధికారికంగా మద్దతు తెలిపింది. బంద్‌లో టీఆర్ఎస్ పార్టిసిపేట్ చేసింది. మంత్రి కేటీఆర్ సైతం రైతులకు మద్దతుగా రోడ్డు మీదకొచ్చారు. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేశారు రేవంత్‌రెడ్డి. ఇటీవల ప్రధాని మోదీతో కేసీఆర్ మీటింగ్ తర్వాత సర్కారు తీరు మారిపోయిందని.. మోదీ ఏం మాయ చేశారో కానీ కేసీఆర్ భారత్ బంద్‌లో పాల్గొనడం లేదంటూ విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.