సర్కారుపై ఎంఐఎం ఫిర్యాదు.. తప్పు సరిచేయాలని డిమాండు..
posted on Sep 27, 2021 @ 6:04PM
తెలంగాణలో మిత్రపక్షం హర్టయ్యింది. ఎంతగా హర్టయిందంటే తెలంగాణ సర్కారు తమ సెంటిమెంట్లతోనే ఆడుకుందని, ఆ తప్పు సరిదిద్దుకోవాలని ఎంఐఎం ఏకంగా శాసనసభలోనే ఫిర్యాదు చేసింది. ఒకవర్గం మీద మరో వర్గానికి భేదభావం ఏర్పడుతుందని, ఇది ఉపేక్షించరాదని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా ఫిర్యాదు చేశారు. ఆ తరువాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు.
8వ తరగతి సాంఘిక శాస్త్రంలో స్వాతంత్య్ర ఉద్యమం-ఆఖరు దశ అనే అధ్యాయంలో ముస్లింల గౌరవానికి భంగం కలిగించేలా ప్రైవేట్ పబ్లిషర్ సిలబస్ ప్రిపేర్ చేశారని బలాలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇస్లాం ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని దేశంలో ప్రవేశించిందని, అలా ప్రజల్ని భయపెట్టడం ద్వారా మత మార్పిడులకు పాల్పడినట్లు సిలబస్ లో పెట్టారని, ఇది ముస్లింలను కించపరిచేదే గాక సాటి ప్రజల్లో వివక్షకు దారి తీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఆలోచన లేకుండా సిలబస్ ప్రిపేర్ చేసిన ప్రైవేట్ పబ్లిషర్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక సిలబస్ లోని ఆ భాగాన్ని ఆన్ లైన్ లోంచి తొలగించారని, కానీ ఆఫ్ లైన్ లో ఇంకా ఉందని, దాన్ని కూడా తక్షణమే తొలగించాలని కోరారు. ఆన్ లైన్ లో తొలగించడం క్షణాల్లో జరిగే పని. కానీ ఆఫ్ లైన్ లో ఒకసారి ప్రింటయ్యాక దాన్ని తొలగించడం ఎలా సాధ్యమవుతుందన్న ఆందోళన, ఆగ్రహం ఎంఐఎం వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బలాలా ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకురాగా సభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి దీనిపై స్పందించారు. ఎంఐఎం ఫిర్యాదును తక్షణమే పరిగణనలోకి తీసుకొని అభ్యంతరకరంగా ఉన్న భాగాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత దీనిపైనే రాతపూర్వక ఫిర్యాదును బలాలా సబితా ఇంద్రారెడ్డికి అందజేశారు.
ఇక ఈ విషయంపై బలాలా అసెంబ్లీలో చేసిన ప్రసంగ భాగం, దానికి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన రిప్లయిని కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎంఐఎం వ్యతిరేకులు, సమర్థకులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.