కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. మోడీనే టార్గెట్..
posted on Sep 28, 2021 @ 11:51AM
కాంగ్రెస్ పార్టీ కొత్తగా అడుగులు వేస్తోంది. ఇంతవరకు సాగిన వరస పరాజయాలకు, పరాభవాలకు ఇక చుక్క పెట్టాలని నిర్ణయానికొచ్చింది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త బాటలో ముందుకు వెళ్లేందుకు నూతన విధానాలతో సిద్దమైంది. ఒకవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కొత్త కాంగ్రెస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అనవచ్చును.
యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు చక చకా అడుగులు వేస్తోంది. ఈ ప్రయోగం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలో సక్సెస్ అయిన నేపధ్యంలో ఇప్పుడు అదే ఫార్ములాను ఇతర రాష్ట్రాలకు చివరకు జాతీయ స్థాయిలోకి విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన, ఇద్దరు యువనాయకులు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సిపిఐ నాయకుడు కన్హయ్య కుమార్, రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ గూటికి చేరడం ఆసక్తికరం.
కన్హయ్య కుమార్, గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా, పార్లమెంట్ పై దాడి కేసులో ఉరి తీయబడిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు, అనుకూలంగా విశ్వవిద్యాలయంలో విద్యార్ధులను కూడగట్టి, నినాదాలు చేయడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించారు. అంతే కాదు కన్హయ్య కుమార్ పై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత కన్హయ్య కుమార్ 2019 లోక్ సభ ఎన్నికల్లో బీహార్’లోని బెగుసరాయ్ లోక్ సభ స్థానం నుంచి సిపిఐ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడి పోయారు. ఎన్నికలలో ఓడిపోయినా, సీఏఏ వ్యతీరేక ఆందోళనలో, రైతుల ఆందోళనలో కీలక పాత్రను పోషించారు. మంచి వక్త. కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని, సంఘ్ పరివార్ సంస్థలను ఏకి పారేయడంలో కన్హయ్య కు కన్హయ్యే సాటి. ఆయనకు ఆయనే పోటీ. అందుకే, కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరి బీహార్ పార్టీని బలపరుస్తారని భావిస్తున్నారు. అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉండటంతో యువతను బాగా ఆకర్షించే కన్హయ్య కుమార్‌ను ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం.
ఇక, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకుడు, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలున్నాయి. కాగా, సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, యువ నాయకుడు రాజీవ్ సతావ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్ మేవాని పార్టీలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, రాహుల్ గాంధీ టీమ్’ గా ఎమర్జ్ అవుతున్న యువ నేతలపై సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయన్న ఆరోపణలు అప్పుడే మొదలయ్యాయి. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడవలసి ఉందని అంటున్నారు.