ధరణి సమస్యలపై కాంగ్రెస్ పోరాటం.. దామోదర చైర్మెన్ గా ప్రత్యేక కమిటీ
posted on Nov 20, 2021 @ 2:31PM
తెలంగాణ ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు పెంచింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. వరి ధాన్యాన్ని కొనుగోళ్లు చేయాలంటూ కల్లాల్లోకి కాంగ్రెస్ పేరుతో కార్యాచరణ ప్రకటించారు రేవంత్ రెడ్డి. పీసీసీ పిలుపుతో కాంగ్రెస్ నేతలు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కొనుగోళ్లు వెంటనే చేపట్టాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజుకో జిల్లాలో పర్యటిస్తూ నిరసనలో పాల్గొంటున్నారు. కేసీఆర్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు.
పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని కూడా కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. ఇప్పుడు వీటితో పాటు లక్షలాది మందికి పెద్ద సమస్యగా మారిన ధరిణి వెబ్ సైట్ పై ఫోకస్ చేసింది హస్తం పార్టీ. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ధరణి, భూ సమస్యల అంశాలపై పరిశీలనకు టీపీసీసీ కమిటీని నియమించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ ఈ కమిటీగా ఛైర్మన్ గా ఉండనుండగా.. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి కన్వీనర్ గా ఉన్నారు.
భూసమస్యలపై వేసిన కాంగ్రెస్ కమిటీలో సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్, బెల్లయ్య నాయక్, కొండపల్లి దయాసాగర్, ప్రత్యేక ఆహ్వానితులుగా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ లను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ధరణి, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, భూ సేకరణ అంశాలపై అధ్యయనం చేసి 45 రోజులలో టీపీసీసీ కి నివేదిక ఇస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.