నటి లహరి కారు బీభత్సం.. బైకర్‌కు తీవ్ర గాయాలు.. వదిలేసిన పోలీసులు..
posted on Dec 8, 2021 @ 2:11PM
నటి లహరి. టీవీ సీరియల్స్‌తో బాగానే పాపులర్. చిన్నపాటి సెలబ్రెటీ స్టేటస్. సీరియల్ అనుకున్నారో ఏమో.. రోడ్డు మీద కారేసుకొని యమ స్పీడ్‌గా నడిపింది. అదుపు తప్పి ఓ బైకర్‌ను ఢీ కొట్టింది. ఇంకేముందు కట్ చేస్తే.. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ దగ్గర జరిగిందీ యాక్సిడెంట్.
ఇంత జరిగినా.. నటి లహరి పొగరు మాత్రం దిగలేదు. టీవీ నటి అయినంత మాత్రాన తానేమన్నా.. సూపర్ ఉమెన్ అనుకున్నారో ఏమో.. యాక్సిడెంట్ చేశాననే పశ్చాత్తాపం ఆమెలో అసలేమాత్రం కనిపించలేదు. యాక్సిడెంట్ స్పాట్‌కు చేరుకున్న పోలీసులతో లహరి వాగ్వాదానికి దిగింది. తన భర్త వచ్చి మాట్లాడతారంటూ కారులోనే ఉండిపోయింది.
లహరిని కారులోంచి దిగాలంటూ పోలీసులు కోరారు. అయినా, ఆమె కిందికి దిగలేదు. దీంతో పోలీసులు ఆమెను కారులోనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. లహరి మద్యం సేవించలేదని తేలింది.
గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. గాయపడిన వ్యక్తి తరఫున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో లహరిని ఇంటికి పంపించేయడం అనుమానాలకు తావిస్తోంది. యాక్సిడెంట్ యాక్సిడెంటే కదా? రూల్ ప్రకారం కేసు నమోదు చేయాల్సిందేగా? అంటున్నారు కొందరు.