బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్..
posted on Dec 8, 2021 @ 3:35PM
జనరల్ బిపిన్ రావత్. భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ప్రస్తుతం భారత్‌లో అత్యశక్తివంతమైన సైనికాధికారి. భారత్ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు జనరల్ బిపిన్ రావత్ మార్గదర్శి. భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర భాధ్యత ఆయనదే. ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్ కుటుంబంలో రావత్ జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.
జనరల్ బిపిన్ రావత్ 27వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నుండి డిసెంబర్ 17, 2016న భారత ఆర్మీ పగ్గాలను స్వీకరించారు. ఆర్మీ చీఫ్ గా పదవి విరమణ చేసిన తర్వాత బిపిన్ రావత్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించింది భారత ప్రభుత్వం. భారత్‌కు తొలి సీడీఎస్ ఆయనే. ప్రస్తుతం భారత్‌లో అత్యశక్తివంతమైన సైనికాధికారి రావతే
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) యొక్క పూర్వ విద్యార్థి రావత్. డిసెంబర్ 1978లో భారత సైన్యంలో చేరాడు. తన నాలుగు దశాబ్దాల సర్వీసులో, రావత్ బ్రిగేడ్ కమాండర్‌గా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-C) సదరన్ కమాండ్‌గా, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్‌లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2, కల్నల్ మిలిటరీ సెక్రటరీ మరియు డిప్యూటీ మిలిటరీ సెక్రటరీగా పనిచేశారు. మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్ మరియు జూనియర్ కమాండ్ వింగ్‌లో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ గా పని చేశారు. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో కూడా కొంత కాలం పని చేశారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బహుళజాతి బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు బిపిన్ రావత్.
2016లో భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించిన 2016 సర్జికల్ స్ట్రైక్స్ రూపకర్త కూడా రావతే. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుండి సర్జికల్ స్ట్రైక్ ను పర్యవేక్షించారు బిపిన్ రావత్. ఈశాన్య ప్రాంతంలో మిలిటెన్సీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు బిపిన్ రావత్. మయన్మార్‌లోకి 2015 క్రాస్-బోర్డర్ ఆపరేషన్ రావత్ కెరీర్ లో ముఖ్యమైనది. NSCN-K మిలిటెంట్ల ఆకస్మిక దాడికి భారత సైన్యం కౌంటరిచ్చింది.
ఆ హెలికాప్టర్ అత్యంత సురక్షితం.. అయినా, ప్రమాదం?
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా..
రావత్ నేతృత్వంలో భారత సైన్యం పాకిస్థాన్‌పై అత్యంత కఠిన చర్యలు తీసుకుంది. 2019 ఫిబ్రవరిలో భారత వైమానిక దళం బాలాకోట్ దాడులను నిర్వహించింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు, కాల్పుల విరమణ ఉల్లంఘనలకు బలమైన ప్రతీకారం తీర్చుకున్నారు రావత్. రావత్ హయాంలోనే పాకిస్తాన్ సరిహద్దులో సైన్యం పటిష్టమైన రక్షణను అందించింది.
చైనాకు వ్యతిరేకంగా:
డోక్లామ్ ప్రతిష్టంభన నేపథ్యంలో పాకిస్థాన్‌తో పాటు చైనా సరిహద్దు వెంబడి సైనిక వ్యవహారాలను కూడా బిపిన్ రావత్ నిర్వహించారు. క్రమం తప్పకుండా సరిహద్దు సమావేశాలు, పరస్పర చర్యలు మరియు ఉమ్మడి వ్యాయామాల ద్వారా భారతదేశం మరియు చైనా సైన్యాల మధ్య మెరుగైన సంబంధాలను సులభతరం చేశాడు. ఆర్మీ చీఫ్‌గా, జనరల్ రావత్ 2017లో 73 రోజుల పాటు భారత్-భూటాన్-చైనా ట్రై జంక్షన్‌లోని డోక్లామ్ పీఠభూమి వద్ద ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
మయన్మార్ సమ్మె:
ఈశాన్య ప్రాంతంలో మిలిటెన్సీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు రావత్. అతని కెరీర్‌లోని కీలక అంశాల్లో మయన్మార్‌లోకి 2015 క్రాస్-బోర్డర్ ఆపరేషన్ ఒకటి. NSCN-K మిలిటెంట్ల ఆకస్మిక దాడికి భారత సైన్యం విజయవంతంగా ప్రతిస్పందించింది. ఈ మిషన్ రావత్ పర్యవేక్షణలో దిమాపూర్‌కు చెందిన III కార్ప్స్ యొక్క ఆపరేషన్ కమాండ్ నిర్వహించింది. మయన్మార్ లోపల సర్జికల్ స్ట్రైక్‌ను భారత సైన్యానికి చెందిన సుమారు 70 మంది కమాండోలతో కూడిన క్రాక్ టీమ్ నిర్వహించింది, వారు 40 నిమిషాల్లో ఆపరేషన్‌ను ముగించారు, 38 మంది నాగా తిరుగుబాటుదారులను హతమార్చారు.
జూన్ 4న మణిపూర్‌లోని చందేల్ ప్రాంతంలో జరిగిన ఆకస్మిక దాడిలో నాగా తీవ్రవాదులు 18 మంది సైనికులను హతమార్చిన కొన్ని గంటల్లో రావత్ టీమ్ ఆ ఆపరేషన్ ను చేపట్టి విజయవంతంగా ముగించింది.
నాలుగు దశాబ్దాలకు పైగా ఆర్మీకి సేవలు అందించిన జనరల్ బిపిన్ రావత్ కు ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ 'మిలిటరీ మీడియా స్ట్రాటజిక్ స్టడీస్'పై చేసిన పరిశోధనలకు జనరల్ బిపిన్ రావత్‌కు 'డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ' (పిహెచ్‌డి) ప్రదానం చేసింది. బిపిన్ రావత్‌కు PVSM, UYSM, AVSM, YSM, SM మరియు VSM వంటి అనేక రాష్ట్రపతి అవార్డులు లభించాయి. రెండు సార్లు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్‌తో పాటు ఆర్మీ కమాండర్ ప్రశంసలను కూడా పొందారు. కాంగోలో UNలో పనిచేస్తున్నప్పుడు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ యొక్క ప్రశంసలు అందుకున్నారు బిపిన్ రావత్.