అటు బియ్యం స్మగ్లింగ్... ఇటు భూ కుంభకోణం! కేటీఆర్ కు జైలు ఖాయమేనా?
posted on Dec 8, 2021 @ 1:28PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టార్గెట్ గా విపక్షాలు దూకుడు పెంచాయి. వరి ధాన్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని, వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. బియ్యం స్మగ్లింగ్ లో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు ఎంపీ అర్వింద్. బియ్యం స్మగ్లింగ్ ఆరోపణలు కలకలం రేపుతుండగానే.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. కేటీఆర్ బడా భూస్కాములో చిక్కుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్ కు సంబంధించి ఈడీ విచారణ జరగకుండా కేంద్రం పెద్దలతో కేసీఆర్ డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. కేటీఆర్ స్కామ్ కు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే బియ్యం స్మగ్లింగ్ లో కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తుండగా.. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన భూస్కామ్ ఆరోపణలతో గులాబీ పార్టీ షేకవుతోంది.
టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటును బహిష్కరించడంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీ డీల్ లో భాగంగానే ఇది జరిగిందన్నారు. ఒక భూ కుంభకోణంలో మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఈడీ తాత్కాలికంగా వాయిదా వేసిందని, ఇందుకు బదులుగా.. పార్లమెంటు సజావుగా సాగేలా కేంద్రానికి సహకరించడానికి టీఆర్‌ఎస్ ఎంపీలు సమావేశాలను బహిష్కరించారని చెప్పారు. హైదరాబాద్ శివారులో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూ లావాదేవీల్లో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల రియల్ ఎస్టేట్ సంస్థను, ఇరిగేషన్ కాంట్రాక్టులు చేస్తున్న మరో సంస్థను విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఈ భూములను గతంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో వేలం వేసినప్పుడు విదేశాలకు చెందిన ఓ సంస్థ రూ.450 కోట్లకు కొనుగోలు చేసిందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ సంస్థను బెదిరించి ఆ భూములను దాదాపు రూ.300 కోట్లకు రాయించుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ భూముల విలువ ప్రస్తుతం రూ.3 వేల కోట్ల మేర ఉంటుందన్నారు. టెండర్ల నియమ నిబంధనల ప్రకారం భూములను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి వీల్లేదని, అయినా బదిలీకి మంత్రి కేటీఆర్ అనుమతించారని తెలిపారు. ఈ మొత్తం కుంభకోణానికి కేటీఆరే కారణమని ఈడీ తేల్చిందని చెప్పారు.
కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చే క్రమంలో బీజేపీకి, టీఆర్‌ఎస్ కు కొంత గ్యాప్ ఏర్పడిందని, దాంతో ధాన్యం కొనుగోలును అడ్డం పెట్టుకొని ఈడీ నోటీసులు, విచారణ నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటు వేదికగా రెండు పార్టీలు నాటకమాడాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాటి మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే కేటీఆర్‌కు నోటీసులివ్వడాన్ని ఈడీ తాత్కాలికంగా ఆపేసిందని చెప్పారు. దాంతో పార్లమెంటులో ఆందోళనలు విరమించి హైదరాబాద్‌కు రావాలని టీఆర్‌ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కేటీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నందునే పార్లమెంటు నుంచి ఆ పార్టీ ఎంపీలు వెనక్కి వెళ్లారని అన్నారు. అంతేకాకుండా ఈడీ కేసులను పీఎల్‌ఎంఏ చట్టం కింద కాకుండా ఫెమా చట్టం కిందికి మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఈడీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో బియ్యం స్మగ్లింగ్ లో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఓ వైపు బీజేపీ ఆరోపిస్తుండగా.. 3 వేల కోట్ల రూపాయల భూస్కామ్ వెనుక కేటీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు స్కాముల్లోనూ కేటీఆరే కీలక సూత్రదారి అన్న ఆరోపణలు వస్తుండటం రాజకీయంగా కాక రాజేస్తున్నాయి. వీటిపై విచారణ జరిగితే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ నేతలు మాత్రం విపక్షాల ఆరోపణలను కొట్టివేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని కౌంటరిస్తున్నారు. గతంలోనూ కేసీఆర్, కేటీఆర్ పై ఎన్నో ఆరోపణలు చేశారని, కాని దేనికి ఆధారాలు చూపలేకపోయారని చెబుతున్నారు. మీడియాలో సంచలనం కోసమే కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని గులాబీ లీడర్లు మండిపడుతున్నారు.