ఆ హెలికాప్టర్ అత్యంత సురక్షితం.. అయినా, ప్రమాదం?
posted on Dec 8, 2021 @ 5:05PM
రష్యన్ మేడ్ MI-17v5. అత్యంత సురక్షితమైన హెలికాప్టర్. ప్రధాని మోదీ సైతం పర్యటనలకు ఎంఐ హెలికాప్టరే వాడుతారు. సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించి.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ కూడా ఇదే. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ సప్రెసర్లు, జామర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంధన ట్యాంక్ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సెల్ఫ్‌సీల్డ్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్ అనే సింథటిక్ ఫోమ్ రక్షణగా ఉంటుంది. అయినా, కునూరు ఘటనలో హెలికాప్టర్ నుంచి మంటలు చెలరేగాయని అంటున్నారు.
MI-17v5 హెలికాప్టర్‌లో అత్యాధునిక ఏవియానిక్స్ ఉండటంతో ఏ వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించేలా దీనిని రూపొందించారు. 36 మంది సైనికులను లేదా 4.5 టన్నుల పేలోడ్‌ను తరలించగలదు. తాజా ఘటనలో బిపిన్ రావత్‌తో సహా 14 మంది ప్రయాణిస్తున్నారు. అంటే, ఇది ఓవర్ లోడ్ ఏమీ కాదు.
ఈ హెలికాప్టర్ అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఆర్మీ ఆపరేషన్స్‌తో పాటు ప్రకృతి విపత్తులు, సహాయక చర్యల్లో కూడా దీనిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్.. సూలూరు ఎయిర్ బేస్‌లో వాడుతున్నారు. MI-17v5 సిరీస్ హెలికాప్టర్‌తో ఇప్పటి వరకు ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు. ఇప్పుడు ఏకంగా సీడీఎస్ ప్రయాణిస్తు హెలికాప్టరే కుప్పకూలడంతో.. ప్రమాదానికి గల కారణాలపై వాయుసేన దర్యాప్తు మొదలుపెట్టింది.
సీడీఎస్ రావత్ బృందం ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ను సైనిక రవాణాకు వినియోగించే ఎంఐ-8 హెలికాప్టర్ల నుంచి అభివృద్ధి చేశారు. భారత్ మొత్తం 80 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రోసోబోర్న్ ఎక్స్‌పోర్టుతో 2008లో ఒప్పందం చేసుకొంది. 2013 నాటికి డెలివరీలను పూర్తి చేసింది. మరో 71 హెలికాప్టర్లను వాయుసేన కోసం కొనుగోలు చేసేందుకు సంతకాలు జరిగాయి. చివరిసారిగా 2018లో కొన్ని హెలికాప్టర్లు భారత్‌కు చేరాయి. ఎంఐ-8 ఎయిర్ ఫ్రేమ్ పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ఇది మధ్య శ్రేణి కిందకు వస్తుంది.
బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్..
బిపిన్ రావత్ చివరి వార్నింగ్ ఇదే..