బాలికపై గ్యాంగ్ రే*ప్!.. ఆటో డ్రైవర్ల ఘాతుకం..
posted on Dec 8, 2021 @ 2:53PM
ఆమె మైనర్. కాలేజీకి వెళ్తుంది. ఆమెతో ఓ ఆటో డ్రైవర్ ఫ్రెండ్‌షిప్ చేశాడు. మంచిగా మాట్లాడాడు. మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత తన అసలు నైజం బయటపెట్టాడు. ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వాడొక్కడే కాదు. వాడి ఫ్రెండ్స్ సైతం ఆ మైనర్‌ను చెరిచారు. నాలుగు రోజుల పాటు ఆ బాలికపై అకృత్యానికి తెగించారు. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం లేదు.
సుల్తాన్‌బజార్ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ బాలిక (17) ఇంటర్ చదువుతోంది. కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. మధ్యలో ఓ సారి తండ్రితో ఫోన్లో మాట్లాడింది. సాయంత్రం మాత్రం ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెదికారు. అయినా, ఆమె ఆచూకీ తెలియలేదు. అదే రోజు అర్ధరాత్రి బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
నాలుగు రోజుల తర్వాత ఆమె చాదర్‌ఘాట్‌లో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ బాలికను సుల్తాన్‌బజార్ పీఎస్‌కు తీసుకువచ్చారు. ఇన్ని రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలపై ఆరా తీశారు. తనకు తెలిసిన ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పగా, అతడి వెంట వెళ్లానని చెప్పినట్టు తెలిసింది. నగర శివారు ప్రాంతం మేడిపల్లి దగ్గరకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్.. తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం. మరో నలుగురు ఆటోడ్రైవర్లు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు లైంగికదాడికి పాల్పడినట్టు ఆమె పోలీసులకు తెలిపిందని తెలుస్తోంది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికను తీసుకెళ్లిన ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒకడు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఆ ఐదుగురు ఆటోడ్రైవర్లపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించి అక్కడ విచారిస్తున్నారు.