బీజేపీ నేతలకు ఢిల్లీ పిలుపు.. కేసీఆర్ కు కౌంట్ డౌనేనా?
posted on Dec 8, 2021 @ 6:24PM
తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రేపు గురువారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఇతర కీలక నేతలతో సమావేసమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోయినప్పటి నుంచి రాష్ట్రంలో అధికార తెరాస, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే యుద్దవాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షడు కేసీఆర్ కారాణాలు ఏవైనా వరి వివాదాన్ని అస్త్రంగా చేసుకుని కేంద్రంపై యుద్ధాని ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి తెరాస ఎంపీలు పలాయనం చిత్తగించారు. మరో వంక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బియ్యం కుంభకోణం,భూకుంభకోణం ఆరోపణలు దట్టించిన అస్త్రాలను సంధించారు. ఒక విధంగా తెరాస నాయకత్వం పరిస్థితి తేలుకుట్టిన దొంగాల ఉందని, అందుకే, తండ్రీకొడుకులు ఇద్దరూ సైలెంట్ అయిపోయారని అంటున్నారు.
ఈ నేపధ్యంలో అది కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేసం కావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా నలుగురు ఎంపీలు, ఇప్పటికీ ఢిల్లీ లో ఉన్నారు. ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్, ఈటల రాజేందర్’తో పాటుగా మరో ముగ్గురు సీనియర్ నాయకులు ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుతున్నట్లు సమాచారం.అదే విధంగా ఇటీవల పార్టీలో చేరిన తెలంగాణ జేఏసీ మాజీ నేత విఠల్, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కూడా ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కూడా సమావేశంలో పాల్గొంటారు.
అయితే ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీజేపీ పాదయాత్ర, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై అమిత్ షాతో నేతలు చర్చించే అవకాశముందని అంటున్నారు. కేంద్రంపై కయ్యానికి కాలు దువ్వి, కత్తులు దూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి కేటీఆర్,అదే విధంగా ఇతర తెరాస కీలక నేతలు కూడా ఢిల్లీలో ఏమి జరుగుతోంది ? ఎందుకు అమిత్ షా .. రాష్ట్ర నాయకులతో సమావేసమవుతున్నారు .. అంటూ ...ఆరా తీస్తున్నట్లు సమాచారం.