రావత్ కన్నుమూత.. సర్జికల్ స్ట్రైక్స్ మొనగాడు.. ఏపీకి ఫసక్.. టాప్‌న్యూస్ @ 7pm
posted on Dec 8, 2021 @ 5:52PM
1. తొలి సీడీఎస్ బిపిన్ రావత్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందినట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. రావత్ మరణంపై ప్రధాని మోదీతో సహా ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాఫ్టర్ ప్రమాదంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది.
2. తమిళనాడు కూనూరు సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13 మంది కన్నుమూశారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలకు డీఎన్‌ఏ టెస్టులు చేస్తున్నారు. సూలూరు నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు బిపిన్ రావత్ వెళ్తుండగా మధ్యాహ్నం 12:20 నిమిషాలకు హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు కనుగొనేందుకు భారత వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది.
3. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆరేళ్ల క్రితం ఓ హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపట్టారు. 2015 ఫిబ్రవరి 3న బిపిన్ రావత్ చీతా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఆ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో ఆయన లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నారు.
4. బిపిన్ రావత్ భారత్ సైన్యం నిర్వహించిన కీలక ఆపరేషన్లకు సూత్రదారిగా ఉన్నారు. పాకిస్టాన్ బాలాకోట్ లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు కర్త, కర్మ,క్రియ బిపిన్ రావతే. చైనా సరిహద్దులోనూ ఆయన ఎన్నో సాహస ఆపరేషన్లు చేశారు. లద్ధాఖ్ సంక్షోభ సమయంలో బిపిన్ రావత్ త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేశారు.
5. ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. దేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్‌లను ప్రకటించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌పై కేంద్రం దగ్గర ఇప్పటివరకూ జగన్ ప్రభుత్వం ప్రస్తావించలేదు. జగన్ ప్రభుత్వం స్పందించని కారణంగానే ఏపీ రైల్వేజోన్‌ను కేంద్రం పక్కన పెట్టిందని రైల్వేశాఖ అధికారులు విమర్శిస్తున్నారు.
6. విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవలసిన ప్రాధమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల నష్టంపై కేంద్ర బృందం నివేదిక సమర్పించిన అనంతరం అదనపు ఆర్థిక సహాయం అందించే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన రాజ్యసభలో తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 25 మంది మరణించినట్లు, రోడ్లు, విద్యుత్ వ్యవస్థతోపాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.
7. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై ఈసీ మండిపడింది. ఈసీ ఆగ్రహంతో వెంటనే జీవోను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా.. జిల్లా, మండల పరిషత్‌లకు 250 కోట్ల నిధులను మంజురు చేయడంపై ఎన్నికల సంఘం మందలించింది. వెంటనే నివేదిక పంపాలని పంచాయితీ రాజ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
8. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చారా? విభజన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఏనాడైనా కేంద్రమంత్రులతో గాని ప్రధానితో గాని మాట్లాడారా అని నిలదీశారు. ‘‘మీ అంత చేతకాని దద్దమ్మ ఇంకొకరు ఉండరు.. అంటూ మండిపడ్డారు. తలతిక్క మాటలు మాట్లాడితే తోలు తీస్తామని హెచ్చరించారు.
9. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమం 300 రోజులకు చేరింది. గాజువాక సెంటర్‌లో కార్మికులు మహాధర్నా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులను అమ్మే నైతిక హక్కు ప్రభుత్వాలకు లేదంటూ నినాదాలు చేశారు. కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ఎవరి ప్రయోజనం కోసమంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ ఉక్కు పరిరక్షణపై ఎంపీలు గళం వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
10. జీజీహెచ్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సకాలంలో వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూడాల సమ్మెపై అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సీఎం బంధువులమని వైద్యులపై కొందరు యువకులు దాడికి పాల్పడటంతో తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.