కరీంనగర్ సహా ఆరు స్థానాలు కైవసం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు
posted on Dec 14, 2021 @ 9:31AM
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగగా... కౌంటింగ్ లో ఆరు సీట్లను కారు పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా ఎన్నిక సాగిందని ప్రచారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు భాను ప్రసాద్ కు 584 ఓట్లు రాగా.. ఎల్. రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు 231 ఓట్లు పోలయ్యాయి. 17 ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతొ తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గులాబీ పార్టీ అభ్యర్థులు భానుప్రసాద్, రమణలు విజయం సాధించారు.
నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి. నల్గొండలో మొత్తం 1233 ఓట్లు ఉండగా... టిఆర్ఎస్ కు 917, స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. 50 ఓట్లు చెల్లకుండా పోయాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి.. ఇండిపెండెంట్ అభ్యర్థి నగేష్ పై 691 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం ఎమ్మెల్సీ సీటును టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు
238 ఓట్స్ మెజారిటీ తో గెలిచారు. మెదక్ లో టీఆర్ఎస్ కు 480 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 242 ఓట్లు వచ్చాయి.ఆదిలాబాద్ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు. ఆదిలాబాద్ లో కారు గుర్తుకు 741 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి పుష్ణరాణికి కేవలం 75 ఓట్లే వచ్చాయి.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి పోటీ చేసిన మెదక్ శాసనమండలి సీటును టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మెదక్ స్థానంలో 1018 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డికి 762 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. దీంతో కారు పార్టీ అభ్యర్థి యాదవరెడ్డి 524 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన ఆరు స్థానాలకు గెలుచుకోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.