మరో y2k మాదిరిగా LOG4J.. టెక్ కంపెనీలకు జీరోడే టెన్షన్...
posted on Dec 14, 2021 @ 11:59AM
y2k. గుర్తుండే ఉంటుంది. 1999 డిసెంబర్ 31 వరకూ టెక్ కంపెనీలను తెగ టెన్షన్ పెట్టిన టెక్నికల్ ప్రాబ్లమ్. 2000 ఏడాది ఎంటర్ కాగానే అప్పటి వరకూ ఉన్న కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లన్నీ పని చేయకుండా పోతాయని ప్రపంచమంతా ఆందోళన చెందింది. ఆ సమయం రానే వచ్చింది. కేలండర్‌లో 2000 వచ్చినా.. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ ఏవీ ఆగిపోలేదు. ఎందుకంటే.. గడువులోగా ఆ ఎర్రర్‌ను కరెక్ట్ చేశారు కాబట్టి. తాజాగా, y2k స్థాయిలో కాకపోయినా.. అలాంటిదే LOG4J పేరుతో మరో సమస్య ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రపంచాన్ని వేధిస్తోంది. యాపిల్ సంస్థ ప్రధాన బాధితురాలిగా మారే ప్రమాదం పొంచిఉంది. అనేక యాప్స్, సాఫ్ట్‌వేర్స్‌కు 'లాగ్4జే' ఎఫెక్ట్ భారీగానే పడనుంది. హ్యాకర్లకు ఈ లోపం వరంగా మారి.. యూజర్ల పర్సనల్ డేటా మొత్తం చోరీకి గురయ్యే అవకాశం ఉంది. అందుకే, టెక్ లోకమంతా ఇప్పుడు 'లాగ్4జే' టెన్షన్‌తో సతమతమవుతోంది. ఇంతకీ ఏంటీ 'లాగ్4జే'..? మనకెంత డేంజర్?
అప్లికేషన్లలోకి లాగిన్ అయ్యేందుకు ఉపయోగించే లైబ్రరీ వంటి సాఫ్ట్‌వేర్‌ను ‘లాగ్4జే’ అంటారు. దీనిని ‘అపాచీ లాగింగ్ సర్వీస్’ సంస్థ అభివృద్ధి చేసింది. ఆ అప్లికేషన్‌లో మన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి ఉంచుతుంది. పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్, యాప్ సంస్థలు దీనిని విస్తృతంగా వాడుతున్నాయి. 'లాగ్4జే' తయారీలో Log4Shell అనే ఒక లోపాన్ని ఇటీవల ఇంటర్నెట్‌లో బహిర్గతం చేశారు. ఇందులో లోపం (జీరోడే) హ్యాకర్లకు అనుకూలంగా మారింది. ప్రముఖ కంపెనీలైన యాపిల్ క్లౌడ్, గేమింగ్ కంపెనీ మైన్‌క్రాఫ్ట్ వంటి సంస్థలు దీనిని ఉపయోగిస్తున్నాయి.
తొలుత మైక్రోసాఫ్ట్ ‘మైన్‌క్రాఫ్ట్’ ఆడే వ్యక్తులు దీనిని కనుగొన్నారు. లాగిన్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసే చోట ఒక కోడ్‌ను నమోదు చేయడం ద్వారా దాని వినియోగదారులను దారి మళ్లించి హ్యాక్ చేయవచ్చని గుర్తించారు. ఇది గత పదేళ్లలో ఎన్నడూ చూడని పెద్ద లోపంగా సైబర్ సెక్యూరిటీ సంస్థలు అంటున్నాయి. ‘లాగ్4జే’ను వినియోగించే ప్రతి ఒక్కరూ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ లోపం ఉన్న సిస్టమ్స్‌ను గుర్తించి హ్యాక్ చేయడానికి వీలుగా టూల్స్ కూడా అభివృద్ధి చేశారని వైర్డ్.కామ్ తెలిపింది.
'లాగ్4జే'పై మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ ప్రకటన చేసింది. క్రెడెన్షియల్స్, డేటా దొంగతనాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంటర్నెట్‌లో ఈ లోపాన్ని వాడుకోవాలని చూసే వారిపై తమ ఇంటెలిజెన్స్ బృందం కన్నేసి ఉంచినట్టు తెలిపింది. ఇప్పటికే చాలా వరకు స్కానింగ్ చేయగా.. కొన్ని చోట్ల ఈ లోపాన్ని గుర్తించామని తెలిపింది.
గూగుల్ క్లౌడ్ సైతం 'లాగ్4జే'లోని లోపంపై ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం గూగుల్ క్లౌడ్‌పై దీని ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం. వినియోగదారులకు అవసరమైన అప్‌డేట్లను అందిస్తున్నాం’’ అని చెప్పింది.
అమెజాన్ స్పందిస్తూ.. ‘‘పరిస్థితిని అంచనావేస్తున్నాం. ఏదైనా అమెజాన్ వెబ్ సర్వీస్ వినియోగదారుల్లో ఎవరైనా లాగ్4జే2 వాడుతున్నా.. లేదా వారి వినియోగదారులకు ఆ సేవలు అందిస్తున్న వాటిని గమనిస్తున్నాం. ‘లాగ్4జే2’ వెర్షన్ వాడేవారు అప్‌గ్రేడ్ చేసుకోవడం ఉత్తమం. అంతకంటే పాత వెర్షన్లు వాడేవారు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది’’ అని సూచించింది.