జగన్ కు నోటీస్.. జైభీమ్ పై సీరియస్.. బుగ్గనకు షాక్.. టాప్ న్యూస్@7PM
posted on Dec 13, 2021 @ 6:12PM
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎంపీ రఘురామ రాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 చార్జ్‌షీట్లను విచారించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
---
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. 377 నిబంధన కింద లోకసభలో లిఖితపూర్వకంగా నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందన్నారు. రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
--------
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఉద్దేశించి జైభీమ్ సినిమా ఫేమ్ జస్టిస్ చంద్రు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ చంద్రు కామెంట్లను జస్టిస్ దేవానంద్ ఖండించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు.
-----
కర్నూలు జిల్లాలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. డోన్‌లో పర్యటిస్తున్న బుగ్గనను దొరపల్లె గ్రామ రైతులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు తమ పొలాలను కాజేయాలని చూస్తున్నారంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని మంత్రి బుగ్గనకు రైతులు ఫిర్యాదు చేశారు.
-------
ఓటీఎస్‌పై కావాలనే టీడీపీ రాద్దాంతం చేస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రజల్లో ఓటీఎస్‌పై కావాలనే టీడీపీ లేని పోనీ అపోహలు సృష్టిస్తోందన్నారు. పేదవాడికి ఉపయోగ పడే పథకం ఒక్కటి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకు రాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సీఎం జగన్ టార్గెట్ అవుతున్నారని రోజా విమర్శించారు.
-------
టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై కేసు నమోదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారంటూ పీఎస్‌లో ఈపూరు విద్యుత్ శాఖ ఏఈ ఫిర్యాదు చేశారు. ఏఈ ఫిర్యాదుతో టీడీపీ నేతలు జీవీ, జగ్గారావులపై కేసు నమోదు చేశారు. పలువురు ఎస్సీకాలనీ వాసులపై కూడా కేసులు నమోదయ్యాయి. అంగులూరు ఎస్సీ కాలనీకి గత మూడ్రోజులు కరెంట్ నిలిపివేశారు. కాలనీ వాసులతో కలిసి జీవీ ఆంజనేయులు నిరసన దీక్ష చేశారు.
----
తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. రేపు తిరుత్తణిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమవుతారు. ఈ భేటీ స్టాలిన్ నివాసంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య జరగనుంది. సోమవారం రాత్రికి తమిళనాడులోని ఐటీసీ హోటల్‌లో కేసీఆర్ బస చేయనున్నారు.
------
బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జంతర్ మంతర్‌లో తెలుగురాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా నిర్వహించింది. బీసీ సంఘాల ధర్నాకు రేవంత్‌రెడ్డి మద్దతు తెలిపారు. జంతర్ మంతర్‌లో బీసీలు ధర్నా చేస్తుంటే.. వారికి సంబంధించిన 9 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే కేసీఆర్ సీఎం అయ్యారని అన్నారు.
--------
హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసిన దేశ తొలి సీడీఎస్ జనరల్ రావత్, ఇతర సైనికుల పేరిట ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నీలగిరి జిల్లాలోని కూనూరు వెల్లింగ్టన్ కంటోన్మెంట్ వాసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. తమ విజ్ఞప్తితో కూడిన లేఖలను ప్రధాని మోదీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు పంపారు.
--------
తనకు వెళ్లాలని అనిపించినప్పుడు పార్లమెంట్‌కు వెళ్తానని వ్యాఖ్యానించిన మాజీ సీజేఐ, రాజ్యసభ సభ ఎంపీ జస్టిస్ రంజన్ గోగోయ్‌కి పార్లమెంట్‌లో నోటీసులు పంపించింది తృణమూల్ కాంగ్రెస్. గోగోయ్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ ధిక్కారంగా ఉన్నాయని, సభా గౌరవానికి ఆయన మాటలు భంగం కలిగిస్తున్నాయని, ప్రత్యేక అధికారాలపై కూడా ఇవి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని నోటీసులో టీఎంసీ పేర్కొంది
---------