కారు గెలుపా? ఈటల గెలుపా? బండి గెలుపా?
posted on Dec 14, 2021 @ 10:59AM
ఆరుకు ఆరు కారుకే. అరడజను ఎమ్మెల్సీ స్థానాలు గంపగుత్తగా టీఆర్ఎస్‌కే. నిజానికి ఇదేమంత పెద్ద విషయం కాదు. టెక్నికల్‌గా అవన్నీ అధికార పార్టీకి దక్కాల్సినవే. ఈజీగా గెలిచే ఎమ్మెల్సీ ఎలక్షన్.. కరీంనగర్‌లో మాత్రం టెన్షన్ పెట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2 ఖాళీలు ఉండగా.. టీఆర్ఎస్ రెబెల్‌గా మాజీ మేయర్ రవీందర్‌సింగ్ బరిలో నిలవడం కారును కంగారెత్తించింది. సింగ్‌ను ఎమ్మెల్సీ కింగ్‌ను చేస్తానంటూ.. ఈటల రాజేందర్ తొడగొట్టడంతో ప్రగతిభవన్‌లో రీసౌండ్ మొదలైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక మాదిరి ఆగమాగమైంది. మంత్రి గంగుల కమలాకర్.. మరోసారి కంటి మీద కునుకు లేకుండా కష్టపడాల్సి వచ్చింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు క్యాంపులు పెట్టాయి. హస్తం గుర్తుపై ఎవరూ పోటీలో లేకున్నా.. కాంగ్రెస్ సైతం క్యాంప్ పాలిటిక్స్ చేయడం ఉత్కంఠ రేపింది. గాంధీలు ఈసారి కూడా కమలానికే జై కొడతారా? అనే టాక్ నడిచింది. కట్ చేస్తే.. కరీంనగర్ జిల్లా నుంచి రెంటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీనే దక్కించుకుంది. రవీందర్‌సింగ్ ఆటలో ఆరటిపండులా మిగిలిపోయారు. ఇంతకీ.. కరీంనగర్‌లో అసలేం జరిగింది? కారు గెలిచిందా? గెలిపించారా? ఈటల రాజేందర్ ఓడారా? ఓడించారా? కమల దళపతి హైదరాబాద్‌లో కూర్చొని కరీంనగర్‌లో చక్రం తిప్పారా? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్.
పైపైన చూస్తే.. కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ గెలుపునకు అనేక కీలక పరిణామాలు తోడయ్యాయి. టీఆర్ఎస్‌కు ఉన్న బలం కంటే.. ఎక్కువ ఓట్లు రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1324 ఓట్లు ఉండగా.. ఇందులో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు 960 వరకు ఉన్నారు. ఇక బీజేపీకి 200 వరకు ఓట్లు ఉండగా.. కాంగ్రెస్ కు 160 వరకు ఓట్లున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయనతో పాటు కొందరు టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు కమలం పార్టీలో చేరారు. ఈ రకంగా చూస్తే కరీంనగర్ లో బీజేపీ, కాంగ్రెస్ కు కలిసి దాదాపు 4 వందల వరకు ఓట్లు ఉంటాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రవీందర్ సింగ్ కు కాంగ్రెస్, బీజేపీ సపోర్ట్ చేశాయనే ప్రచారం జరిగింది. అందుకే రవీందర్ సింగ్ గెలుస్తారని అంతా భావించారు. టీఆర్ఎస్ నుంచి 30-40 ఓట్లు క్రాస్ అయినా రవీందర్ సింగ్ గెలుస్తారని భావించారు. కానీ, కౌంటింగ్ తర్వాత సీన్ మారిపోయింది. కారుకు వాళ్లకు ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. భానుప్రసాద్ రావుకు 584, రమణకు 479.. మొత్తం టీఆర్ఎస్ కు 1063 ఓట్లు వచ్చాయి. అంటే, అసలు బలం కంటే మరో 100 ఓట్లు ఎక్కువే పడ్డాయి. ఇదే ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. ఆ వంద ఓట్లు ఎవరివి అన్నదే ప్రశ్న? కాంగ్రెస్ ప్రతినిధులు కారుకు ఓటేశారా? లేక బీజేపీ ప్రతినిధులు గులాబీ పార్టీకి జై కొట్టారా? అనేది తేలాల్సి ఉంది.
కాంగ్రెస్ వాళ్లు క్యాంపులు పెట్టి మరీ.. తాము రవీందర్‌సింగ్‌కు ఓటేస్తామని చెప్పారు. చెప్పినట్టే చేశారని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మరి, చీలిన వంద ఓట్లు ఎవరివి? అంటే అందరి చూపు బీజేపీ వైపే మళ్లుతోంది. బీజేపీ అభ్యర్థులు అంతా మూకుమ్మడిగా రవీందర్‌సింగ్‌కు ఓటేయలేదని.. కమలం ఓట్లే చీలిపోయాయని అంటున్నారు. బీజేపీ వాళ్లు కారుకు ఎందుకు ఓటేశారనేది మరింత ఆసక్తికరం. అందుకు, కాషాయదళంలో కోల్డ్‌వారే కారణమని.. ఈటల వర్సెస్ బండి సంజయ్ ఎపిసోడ్ వల్లే టీఆర్ఎస్‌కు మరో 100 ఓట్లు అదనంగా వచ్చాయని చెబుతున్నారు.
అవును, బండి సంజయ్‌కు ఈటల రాజేందర్‌కు అంతగా సఖ్యత లేదని మొదటి నుంచీ వార్తలు వస్తున్నాయి. ఈటలను పార్టీలో చేర్చుకునే విషయంలోనూ కిషన్‌రెడ్డి, వివేక్‌లే ఎక్కువ చొరవ చూపించారని.. బండి కాస్త వెనకాలే ఉండిపోయారని అన్నారు. ఇక హుజురాబాద్ ప్రచారంలోనూ సంజయ్ అంత దూకుడుగా లేరు. ఈటలను ఒంటరిగా వదిలేసి.. ఆయన పాదయాత్రతో పక్క దారిలో వెళ్లిపోయారు. తాజాగా, ఎమ్మెల్సీ ఎపిసోడ్‌లోనూ ఈటల రాజేందరే.. పార్టీ అనుమతి లేకుండానే.. తనంతట తాను రవీందర్‌సింగ్‌ను బరిలో నిలిపారని అంటున్నారు. బీజేపీ మద్దతు సింగ్‌కేననే నిర్ణయమూ ఈటలదే. ఆయన తరఫున క్యాంపులు పెట్టిందీ రాజేందరే. ఈ పరిణామం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మింగుడుపడలేదు. తనను కాదని స్వతహాగా పాలిటిక్స్ చేస్తుండటం ఆయనకు నచ్చలేదని చెబుతున్నారు. అందుకే, హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ పోలింగ్‌లో ఓటేయకుండా బండి సంజయ్ డుమ్మా కొట్టారు. అప్పటికే జిల్లాలోని తన వర్గానికి.. రవీందర్‌సింగ్‌కు ఓటేయ వద్దని బండి నుంచి ఆదేశాలు వెళ్లాయని కూడా అంటున్నారు. తన ప్రమేయం లేకుండా రవీందర్‌ను గెలిపించుకుంటే.. పార్టీలో ఈటల లెవెల్ మరింత పెరుగుతుందనో.. లేక, తనకు చెప్పకుండా ఎమ్మెల్సీ విషయంలో ఈటల ఒంటెద్దు పోకడ పోయారని ఆగ్రహమో.. కారణం ఏదైనా బండి వర్గం ఓట్లు రవీందర్‌సింగ్‌కు పడలేదని లెక్కలేస్తున్నారు. టీఆర్ఎస్‌కు అదనంగా పడిన ఆ 100 ఓట్లు.. బీజేపీవే అని అనుమానిస్తున్నారు. బహుషా అందుకే కాబోలు.. పోలింగ్ ముగిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ముందు మీ బీజేపీ ఓట్లన్నీ మీకే పడ్డాయో లేదో చూసుకోండంటూ ఎద్దేవా చేశారు. ఫలితాలను బట్టి చూస్తుంటే.. బీజేపీ ఓట్లే చీలి.. కారుకు పడ్డాయని అంటున్నారు. గెలిచింది టీఆర్ఎస్సే అయినా.. ఓడింది ఈటల.. ఓడించింది బండి.. అని విశ్లేషిస్తున్నారు.