పేరుకే శ్రీరంగం... కేసీఆర్ రాజకీయ చదరంగం
posted on Dec 13, 2021 @ 7:24PM
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్.. తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే టాక్ గులాబీ పార్టీలో మొదలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్.. తన క్యాంప్ ఆఫీస్, ప్రగతి భవన్‌లకే పరిమితమయ్యే వారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత.. సీఎం కేసీఆర్... ప్రజల్లోకి రావడానికి.. ఆందోళన చేయడానికి... ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి రాజకీయ నేతలతో చర్చలు జరపడానికి హుషారు చూపిస్తున్నారనే చర్చ కారు పార్టీలో షికారు చేస్తోంది.
అయితే తాజాగా సీఎం కేసీఆర్... తమిళనాడులోని శ్రీరంగం వెళ్తున్నారు. అదీకూడా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకు వెళ్తున్నారు. కానీ శ్రీరంగంలో కొలువు తీరిన శ్రీరంగనాధ స్వామిని దర్శించుకుని మళ్లీ నేరుగా సీఎం కేసీఆర్.. ఆయన ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చేస్తే ఓకే. కానీ రాత్రికి సీఎం కేసీఆర్.. చెన్నైలో బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో సీఎం కేసీఆర్.. తన మార్క్ రాజకీయానికి తెర తీయనున్నారని గులాబీ దళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో సీఎం కేసీఆర్.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌తో సమావేశం కానున్నారని.. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పని చేశారు. ఆ తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ బృందంతో మంతనాలు జరిపినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
మరోవైపు.. సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ.. తాము త్వరలో తమిళనాడులో పర్యటించి.. డీఎంకే పార్టీ నిర్మాణాన్ని పరిశీలించనున్నట్లు ప్రకటించారు. దీంతో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై పలువురు పలు సందేహాలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితుల మధ్య పుట్టింది... ఎలా ఎదిగింది... ఎలా అధికారాన్ని అందుకుంది... అన్న విషయాలు ప్రజలందరికీ తెలిసిందే. మరి అలాంటి పార్టీకి మళ్లీ పార్టీ నిర్మాణం ఏమిటంటూ రాజకీయ విశ్లేషకులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్.. తమిళనాడు పర్యటన వెనక .. తెర చాటు రాజకీయం ఏదో ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక.. సీఎం కేసీఆర్‌లోని ఇగోని హర్ట్ చేసిందని గులాబీ దళంలోని కీలక నేతలే బహిరంగంగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో బీజేపీని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే వ్యూహాంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారని సమాచారం. అందులోభాగంగానే యాసంగి వడ్ల కొనుగోలు అంశాన్ని కేసీఆర్ తెరపైకీ తీసుకు వచ్చారనే టాక్ తెలంగాణలో బలంగా నడుస్తుంది.
అదీకాక.. తెలంగాణలో ఒక వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు దూకుడుగా దూసుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని ఎక్కాలని గులాబీ బాస్ కలలు కంటున్నారు. ఆ క్రమంలో తమిళనాడులో డీఎంకే విజయానికి దోహదం చేసిన అంశాలు ఏమిటి?.. అందులో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంత? ప్రతిపక్షాల బలమైన ఓటింగ్ శాతాన్ని మనవైపు తిప్పుకునేందుక దోహదం చేసిన అంశాలు ఏమిటి అనే వాటితోపాటు.. పార్టీ పగ్గాలు తనయుడికి ఇవ్వడం వల్ల.. అటు పార్టీలో కానీ ఇటు కుటుంబంలో కానీ సమస్యలు తలెత్తితే.... ఆ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలు.. అందుకు కరుణానిధి ఫ్యామిలీలో అనుసరించిన వ్యూహాలు.. తదితర అంశాలు ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఏదీ ఏమైనా పేరుకే శ్రీరంగం టూర్.. కానీ ఈ టూర్ వెనుక రాజకీయంగా పావులు కదిపేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.