మరో ఏడేళ్లలో కేసీఆర్ ప్రరాస?!
posted on Jan 17, 2023 @ 4:15PM
తేదీ..17 జనవరి 2029.. ఈ రోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది. ఈ రోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది. భారత ప్రధాని, భారాస అధినేత, సిధ్ధాంత కర్త, కల్వకుంట్ల చంద్రశేఖర రావు మనోభీష్టం మేరకు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా మారుస్తూ భారాస సర్వ సభ్య సమావేశం తీర్మానించింది.
హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో సభాధ్యక్షుడు కేసీఆర్ ప్రపంచంలో పరిస్థితులను వివరిస్తూ ప్రసంగించారు. దేశాలు మధ్య తరచూ గిల్లి కజ్జాలతో ప్రపంచశాంతికి భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే సమీప భవిష్యత్ లో ప్రపంచం నాశనం అవుతుందనీ, ఆ విషయాన్ని పట్టించుకోకుండా అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శిచారు.
యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో విఫలం అయ్యిందని పేర్కొన్న కేసీఆర్.. ఇక ఐరాస కాలం చెల్లిన సంస్థ అని ప్రకటించారు. ఇప్పుడు వినాశనానికి చేరువలో ఉన్న ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత తాను తీసుకుంటున్నారనీ, అందుకే భారత్ రాష్ట్ర సమితి( భారాస)ను ప్రపంచ రాష్ట్ర సమితి (ప్రరాస)గా మారుస్తున్నాననీ కేసీఆర్ ప్రకటించారు. భారత దేశాన్ని కాపాడేందుకు నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను భారత రాష్ట్ర సమితి (భారస)గా మార్చినప్పుడు కూడా తనను ఎందరో ఎన్నో రకాలుగా విమర్శించారనీ, ఎద్దేవా చేశారనీ.. కానీ భారాస వల్లనే ఏపీ, తెలంగాణ సహా దేశంలోని రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రరాస దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేస్తుందన్నారు. ఆ హామీ, పూచీ తనదని వక్కాణించారు.
క్రమంగా అన్ని ముఖ్య దేశాలలోనూ ప్రారాసాను అధికారంలోకి తీసుకురావడం ద్వారా యుధ్ధాలను నివారించి ప్రపంచ శాంతిని తీసుకువస్తామన్నారు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభ తీర్మానించాలని ఆర్డర్ లాంటి విజ్ణప్తి చేశారు. సరే ఆ తీర్మానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత బలపరిచారు. మహారాష్ట్ర గవర్నర్ సంతోష్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు కూడా బలపరచారు. ఆ వెంటనే సభ తీర్మానం ఆమోదించింది. అంతే ఆఘమేఘాల మీద తీర్మానం ఆమోదం పొందిందని ఇక నుంచీ భారాస ప్రరాసా అయిపోయిందని కేసీఆర్ ప్రకటించారు.
త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యా బలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్య ప్రకటించారు.
ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయులలో సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానాలు వెల్లువెత్తాయి. ప్రరాస అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీని అమెరికా అధ్యక్షుడు స్వాగతించారు. మాది ఫ్రీ కంట్రీ అనీ ఎవరైనా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నారు. రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా స్పందన తెలియరాలేదు. ఐరాస సెక్రటరీ జనరల్ మాత్రం ఐరాస కాలం చేసిందని భారత ప్రధాని కేసీఆర్ అనడాన్ని తప్పుపట్టారు. ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని ఐరాసలో భారత ప్రతినిధి ఉద్ఘాటించారు. ప్రపంచాన్ని ఏలబోయేది మనమే అంటూ హైదరాబాద్ నగరంలో వేలాది పెద్ద పెద్ద కటౌట్లు వెలిసాయి. ప్రధాన రహదారులూ గల్లీలు అన్న తేడా లేకుండా ర్యాలీలతో హోరెత్తుతున్నాయి. దునియాకీ నేతా కేసీఆర్ అన్న నినాదంతో దేశం అంతా మార్మోగింది.
(కేవలం సరదాగా..)