రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో జోష్.. పాతిక పార్టీలతో ముగింపు సభకు భారీ సన్నాహాలు
posted on Jan 17, 2023 @ 1:46PM
రాహుల్ పాదయాత్రకు ముందు వరకూ.. కాదు కాదు రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తరువాత కూడా ఇటీవలి వరకూ దేశంలో కాంగ్రెస్ పునర్వైభవం తరించుకుంటుందన్న ఆశ ఎవరిలోనూ లేశ మాత్రంగానైనా లేదు. ఆఖరికి కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఆయన యాత్ర ఏదో అద్భుతం చేస్తుందనీ, పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందనీ చిన్ప పాటి ఆశ కూడా కనిపించలేదు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా మాత్రమే కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుంటోందన్న భావనే సర్వత్రా కనిపించింది.
అయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా.. దేశంలో ద్వేష భావాన్ని రూపుమాపడానికే ఈ నడక అని ప్రకటించి యాత్ర ప్రారంభించారో అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా ఆయన యాత్రకు సానుకూలత వ్యక్తం అవ్వడమే కాదు.. కాంగ్రెస్ లోనూ జోష్ పెరుగుతూ వస్తోంది. ఇక రాహుల్ యాత్ర ముగింపు దశకు వచ్చే సరికి బీజేపీయేతర పార్టీలన్నిటికీ.. ఒకటి రెండు మినమా.. అలా మినహా పార్టీలలో సమాజ్ వాదీ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయను కోండి అది వేరే సంగతి. సమాజంలోని అన్ని వర్గాలలో కూడా రాహుల్ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభించింది. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న తొలి అడుగు పడింది మొదలు, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా,ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుడా, సాఫీగా సాగిపోతోంది. చివరకు, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పాదయాత్ర చేయలన్నా,అవరోధాలు, అరెస్టులు తప్పని, తెలంగాణ రాష్ట్రంలోనూ, ఏపీలోనూ రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే, రాష్ట్రం దాటేసింది. అలాగని రాహుల్ యాత్ర ఎవరికీ పట్టకుండా, ఎవరినీ పట్టించుకోకుండా సాగుతోందని చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు. యువత, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పేదలు, నిరుద్యోగులు, మహిళలు, మాజీ బ్యూరోక్రాట్లు ఇలా ఈ వర్గం.. ఆ వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు రాహుల్ గాంధీతో అడుగు కదుపుతున్నారు. జోడో యాత్రలో పాల్గొంటున్నారు.
ఆయన యాత్ర కొనసాగుతుండగా జరిగిన ఎన్నికలలో పార్టీ పరాజయాన్నే ఎదుర్కొని ఉండొచ్చు. అయితే వాటిని వేటినీ ఇసుమంతైనా పట్టించుకోకుండా రాహుల్ ప్రదర్శించిన స్థితప్రజ్ణత జనతను ఆకట్టుకుంటోంది. నిజానికి, రాజకీయ నాయకుల పాదయాత్ర అంటే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకచో కొద్దిమంది ఇతర రంగాల సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారు. కానీ, రాహుల్ యాత్రలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే, సెలబ్రిటీలే ఎక్కువగా పాల్గొంటున్నారా అన్నట్లుగా, యాత్ర చాలా కలర్ ఫుల్’గా సాగుతోంది. సినిమా స్టార్లే కాదు, కాలేజీ అమ్మాయిలు, విద్యార్ధులు, యువకులు, చివరకు చిన్న పిల్లలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు.
సహజంగా రాజకీయ నాయకుల పాదయాత్రలలో గంభీర ఉపన్యాసాలు, సీరియస్ చర్చలు ఉంటాయి. జెండాలు, స్లొగన్స్ ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ యాత్రలో రాజకీయ వాసనలు అంతగా కనిపించడం లేదు. రాహుల్ యాత్ర ఒక పిక్నిక్ లాగా సాగిపోతోందని, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఆట పాటలు, సెల్ఫీలు, కరచాలనాలు, హగ్గులు, ఆలింగానాలు ఒకటని కాదు, ఒక ప్రత్యేక పంధాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ఈ యాత్ర ఇప్పటికే ముగింపు దశకు వచ్చేసింది. ఈ నెల 30న ముగియనుంది. పార్టీలో ఉత్సాహాన్ని నింపిన ఈ యాత్ర ముగింపును భారీగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది, ముగింపు సభ కోసం దేశంలో భావసారూప్యత కలిగిన 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. మాయావతి (బహుజన్ సమాజ్ పార్టీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ), నితీశ్ కుమార్ (జనతాదళ్ యూనియన్), చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం పార్టీ), లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ్ జనతా దళ్), అఖిలేష్ యాదవ్ (సమాజ్వాదీ పార్టీ), కమ్యూనిస్ట్ పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. వీరిలో ఎవరు హాజరౌతారు, ఎవరు గైర్హాజరు అవుతారన్నది పక్కన పెడితే.. (ఇప్పటికే మాయావతి కాంగ్రెస్ వైపు చూసేది లేదని ఖరాఖండిగా ప్రకటించేశారు.) ఈ నెల 30న జరిగే రాహుల్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతారన్న విషయంలో ఉత్కంఠ కలిగిస్తోంది.
అయితే.. ఎవరు హాజరౌతారు, ఎవరు గైర్హాజరౌతారు అన్నది పక్కన పెడితే.. రాహుల్ పాదయాత్ర.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇటీవల పదేళ్లలో కాగడాపెట్టి వెతికినా కనిపించని మద్దతును తీసుకు వచ్చింది. ఈ సానుకూలత 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నది తెలియాలంటే వేచి చూడక తప్పదు.