వరుణ్ వస్తానన్నా రాహుల్ వద్దంటారా!
posted on Jan 18, 2023 @ 9:59AM
తమ్ముడు తమ్ముడే పేకాట,పేకాటే..ఇది అందరికీ తెలిసిన నానుడి. అంటే, అన్నదమ్ముల అనుబంధాలు, రక్త సంబంధాలు వ్యాపార వ్యవహారాలో పని చేయవని చెప్పే సందర్భంలో ఈ నానుడిని వాడుతుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీలలో ఉండి ఒకరిపై ఒకరు పోటీ చేయవలసి వచ్చినప్పడు లేదా అన్నదమ్ములు, మంచి మిత్రులు ఒకరిపై ఒకరు పోటీ చేసినప్పుడు, కూడా ఇలాంటి వాఖ్యలే వినిపిస్తుంటాయి.
ఇప్పడు అది యాధృచ్ఛికమే కావచ్చును కానీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరుడు ( కజిన్) బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (సంజయ్ గాంధీ, మేనకా గాంధీ కుమారుడు) గురించి ఇంచు మించుగా అలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలే చేశారు. నిజానికి, వరుణ్ గాంధీ తండ్రి సంజయ్ గాంధీ ఆకస్మిక అనుమానస్పద మృతి తర్వాత, మేనకా గాంధీ, అత్తింటిని వదిలి వచ్చారు. ఆ తర్వాత, ఆ రెండు కుటుంబాల మధ్య పెద్దగా సంబంధాలులేవు. గాంధీ నెహ్రూల కుటుంబం నుంచి బయటకు వచ్చిన మేనకా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు. బీజేపీలో చేరారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి బాటలో వరుణ్ గాంధీ కూడా బీజేపీలో చేరారు. ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ నుంచి వరసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే చాల కాలంగా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే, అదెలా ఉన్నా, ఇప్పడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రవచించే హిందూ జాతీయ వాదానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ సోదరుడు వరుణ్ గాంధీతో తమ సంబంధాలు అంతవరకే పరిమితమని, రాజకీయంగా ఎవరి దారి వారిదే’ అని స్పష్తం చేశారు. పంజాబ్ గుండా సాగుతున్నా భారత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం (జనవరి 17) నిర్వహించిన ప్రెస్ మీట్లో సోదరుడు వరుణ్ గాంధీతో సంబంధాలపై స్పందించారు. తమకు రెండు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయని, తమ్ముడు స్వీకరించిన సిద్ధాంతాన్ని తాను అంగీకరించలేనని అన్నారు. నేను కావాలంటే వరుణ్ ను కలవగలను, కౌగలించుకోగలను, కానీ నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేను అని రాహుల్ తేల్చి చెప్పేశారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని, ఆయన భారత్ జోడో యాత్రలో నడిస్తే అది అతనికి సమస్య కావచ్చని రాహుల్ గాంధీ పరోక్షంగానే అయినా వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని చెప్పకనే చెప్పారు.
అయితే, అందుకు ఆయన భావజాల సంఘర్షణను కారణంగా చూపినా అసలు కారణం వేరే ఉందని అంటారు. సోనియా, మేనక గాంధీల మధ్య మొదటి నుంచి కూడా సత్సంబంధాలు లేవని, అంటారు. అయితే ఆ విషయాన్ని కప్పి పెట్టి రాహుల్ గాంధీ, తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ ) కార్యాలయానికి ఎప్పటికీ వెళ్ళలేనని రాహల్ తెలిపారు. అలా వెళ్లవలసి వస్తే తన తల నరుక్కోవాల్సి వస్తుందన్నారు. తన కుటుంబానికి ఓ సిద్దాంతం ఉందని ఏదో ఒక సమయంలో, ఇప్పుడు కూడా వరుణ్ దానికి భిన్నమైన దానికి స్వీకరించాడని, తాను ఆ భావజాలాన్ని అంగీకరించలేనని, తమ్ముడు తమ్ముడే పేకాటే అని చెప్పు కొచ్చారు.