భారాస కోసం భూ కుంభకోణం
posted on Jan 17, 2023 @ 2:11PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ చేయని ఆరోపణ లేదు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు, బీజేపీ రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం అవినీతిలో కురుకు పోయిందని ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కుమార్తె కవిత సహా అధికార బీఆర్ఎస్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక మందిపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ, ఈడీ దాడులు, విచారణలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని పలు సందర్భాలలో ప్రకటించారు. చంచలగూడ జైల్లో ఆయన కోసం గది సిద్డంవుతోందని కూడా బండి సంజయ్ అనేక సందర్భాలలో పేర్కొన్నారు.
మరో వంక ముఖ్యమంత్రి కేసీఆర్, దమ్ముందా? టచ్ చేసి చూస్తావా? అంటూ సవాళ్ళు విసిరారు. అయితే పరస్పర ఆరోపణలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు హోరెత్తడమే కానీ, చివరకు ఏమి జరిగింది అంటే, ఏమీ లేదు, సున్నకు సున్నా- హళ్లికి హళ్లి. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి ఆరోపణలు చేస్తోంది, ఒక్క బీజేపీ మాత్రమే కాదు, కేసీఆర్ తో విభేదించిన కల్వకుట్ల కుటుంబ సభ్యులు సహా కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకుఅలు అందరూ, కేసీఆర్ ప్రభుత్వం పైన, కేసీఆర్ కుటుబం అవినీతి పైనా పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
గడచిన ఎనిమిదేళ్ళలో వందలు కాదు, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, వందల వేల ఎకరాల భూమి అధికార పార్టీ నేతల కబ్జాకు గురైందని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. చివరకు, నిన్నగాక మొన్నపుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ప్రజాపార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ సహా అనేక మంది నాయకులు సామాజిక కార్యకర్తలు నేరుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసి కేసీఆర్ కుటుంబ అవినీతికి సంబధించి విచారణ జరిపించాలని కోరుతూ, వినతి పత్రాలు అందజేశారు. ఆరోపణలకు ఆధారాలను కూడా కేంద్రానికి అందజేశామని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సందర్భాలలో పేర్కొనారు. అయినా కేంద్ర ప్రభుత్వం కదిలింది లేదు చర్యలు తీసుకున్నదీ లేదు.
అయినా కొత్త కొత్త ఆరోపణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారని ఆరోపించారు. దాదాపు 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్ తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు. మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. తోట చంద్రశేఖర్ భూములపై ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు.
తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. మియాపూర్ భూములతో లాభ పడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు.అయితే గతంలో చేసిన ఆరోపణలకే దిక్కు లేదు, ఇప్పడు వచ్చిన ఆరోపణలకు విలువ ఉంటుందా? అనుమానమే ..