ఆర్వీఎంలకు ఓకే కానీ... తెలుగుదేశం
posted on Jan 16, 2023 @ 4:33PM
ఈవీఎంల గురించి ప్రతిపక్షాలు పలుమార్లు ఆరోపణలు, అనుమానాలను వ్యక్తంచేశాయి. ఆ ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకుండానే, ఆ అనుమానాలను నివృత్తి చేయకుండానే ఎన్నికల సంఘం ఇప్పుడు మరో లెవెల్ కు ఓటింగ్ ప్రక్రియను తీసుకువెళ్లేందుకు ప్రతిపాదించింది. అదే రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఆర్వీఎం) విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ముందుగా ఈవీఎంలపై తమ అనుమానాలు నివృత్తి చేయాలనీ, తాము ఈవీఎంలనే వ్యతిరేకిస్తుంటే..ఆర్వీఎం అంటూ కొత్త విధానాన్ని ప్రతిపాదించడమేమిటని నిలదీస్తున్నాయి.
ఆర్వీఎంవిధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశాయి. రిమోట్ ఓటింగ్ యంత్రంపై ఎన్నికల సంఘం ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నికల సంఘం ప్రతిపాదనలో స్పష్టత లేదన్న ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాలని నిర్ణయించాయని స్పష్టం చేశారు. అయితే ఆ ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకు వెళ్లిన సీఈసీఆర్వీఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సోమవారంజరిగినఈ కార్యక్రమంలో ఆర్వీఎం పనితీరు గురించి వివరించింది.
అలాగే రాజకీయ పార్టీల అభిప్రాయాన్నీ కోరింది. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన ప్రజలకు ఓటు సదుపాయం కల్పించే అంశంపై కూడా చర్చించింది. ఈ కార్యక్రమానికి 8 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు హాజరు కావాలని ఈసీ కోరిన విషయం విదితమే. అలాగే ఆర్వీఎంల పనితీరుకు సంబంధించి, ఎన్నికల పద్ధతిలో మార్పులు, దేశంలోని వలస కూలీల ఓట్ల గురించి తమ అభిప్రాయాలను రాత పూర్వకంగా ఈనెల 31లోపు తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది. కాగా తెలుగుదేశం పార్టీ ఆర్వీఎంలను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు చెబుతూనే..ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు జరపకుండానే ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడాన్నితప్పుపట్టింది.
విస్తృత చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాత మాత్రమేఆర్వీఎం విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ముందుగా డెమో చేసి ఆ తరువాత ఏకాభిప్రాయం సాధించిన మీదటే దీనిని అమలు చేయాలని పేర్కొంది. ఈ విధానంపై పార్టీలు తమ అభిప్రాయం రాతపూర్వకంగా తెలియజేయడానికి విధించిన డెడ్ లైన్ ను పొడిగించాలన్నారు. ఏ ఒక్క ఓటరు కూడా ఓటువేసే అవకాశం కోల్పోకూడదని చెబుతున్న ఈసీ కొత్త విధానాన్ని తీసుకురావడానికి ముందు ఆ విధానంపై ఉన్నఅనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలని తెలుగుదేశం పేర్కొంది.
ఓటింగ్‌కు దూరంగా ఉంటున్న రమారమి30శాతంమందిలో వలస వెళ్లిన వారే అత్యధికులని చెబుతున్న ఈసీ దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేసిందా అని ప్రవ్నించింది. తమ పరిశీలన మేరకు వలస కూలీలు తమ గ్రామాల్లో ఓటు వేస్తున్నారని.. కానీ యువత, పట్టణ, నగర ధనిక వర్గాలే ఓటింగుకు దూరంగా ఉంటున్నాయనీ తెలుగుదేశం వివరించింది. ఈసీ నిర్వహించిన అఖిలపక్షసమావేశానికి తెలుగుదేశం తరఫున సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ హాజరయ్యారు.