అయోధ్య రామమందిరం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు ఉగ్ర కుట్ర
posted on Jan 17, 2023 @ 10:09AM
దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడం, కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా ఉగ్ర కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు ఉగ్ర సంస్థ రామమందిర విధ్వంసాన్ని లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు భారతదేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కృతం చేసింది. దేశ రాజకీయ, సామాజిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపిన శతాబ్ద కాలం నాటి అయోధ్య వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తార్కిక ముగింపు పలికింది
హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి బాటలు వేస్తూ.. ఇటు ముస్లింల కోసం అయోధ్యలోనే ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును అన్ని వర్గాల వారూ ఔదాల్చారు. అయోధ్యలోనూ మందిరం, మసీదులకు అవకాశం కల్పిస్తూ సుప్రీం తీర్పు దేశ భిన్నత్వంలో ఎకత్వానికి నిజమైన అర్ధం చెప్పినట్లైంది. మత సామరస్యం వెల్లివిరిసేలా చేసింది. సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘకాలం విచారణ సాగిన రెండో కేసుగా ఆయోధ్య కేసు గుర్తింపు పొందింది. అలాగే ఈ తీర్పు సమయంలో న్యాయస్థానం సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఏదైనా కేసు తీర్పు వెలువరించేటప్పుడు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఒక్కొక్కరూ అభిప్రాయాలను వెల్లడిస్తారు.
కానీ, దీనికి భిన్నంగా అయోధ్య తీర్పు విషయంలో సుప్రీం వ్యవహరించింది. తీర్పును చదువుతున్నప్పుడు ధర్మాసనంలోని సభ్యులు పేర్లను ప్రస్తావించలేదు. ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో చెప్పకుండా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరిస్తున్నట్టు తెలిపారు. ఇక అయోధ్య వివాదం సమసిపోయిందనుకుంటున్న తరుణంలో రామమందిరం లక్ష్యంగా ఉగ్ర కుట్ర ను నిఘావర్గాలు పసికట్టాయి. అయోధ్య రామమందిరంపై దాడికి పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడికి కుట్ర పన్నినట్లు పేర్కొన్నాయి. రామమందిరం లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. రామమందిరాన్ని ధ్వసం చేయడమే లక్ష్యంగా జైషే ఉగ్ర మూకలు నేపాల్ మీదుగా భారత్ లో ప్రవేశించే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో అయోధ్యలో, నేపాల్ భారత్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలోని కీలక నగరాలు, ప్రదేశాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అలాగే జీ20 సదస్సు లక్ష్యంగా కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.