అన్నా .. అందుకో వందనం!
posted on Jan 18, 2023 8:53AM
నందమూరి తారక రామా రావు... ఎన్టీఆర్... ఈ పేరుకు ఇక వేరే పరిచయ వాక్యాలు అక్కరలేదు. నందమూరి అనగానే, అన్న ఎన్టీఆర్ అపురూప రూపం కళ్ళ ముందు కదులుతుంది. ఒక సినిమా హీరోగా ఆయన జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్. రాముడు. కృష్ణుడు, వెంకన్న దేవుడు ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్. దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్. రాముడు ఎలా ఉంటాడంటే, ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ఏ తరం వారిని అడిగినా ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్ లా ఉంటారు, అంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా... అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయంగా జీవించారు. మచ్చలేని మహారాజులా నిష్క్రమించారు. అందుకే ఆయన కన్నుమూసి 27 ఏళ్ళు అయినా ఈ నాటికీ ఆయన్ని తెలుగు గుండె గుర్తుచేసుకుంటోంది.
అవును ఈరోజు ... జనవరి 18, ఎన్టీఆర్ 27 వ వర్ధంతి. ఎన్టీఆర్ సినిమా రంగానికే కాదు, సమాజానికీ సేవలందించారు. ఆరు పదులకు పైగా వెండి తెరను ఏలిన ఎన్టీఆర్, తనను అంతవాడిని చేసిన తెలుగు ప్రజలకు సేవచేసే పవిత్ర సంకల్పంతో రాజీకీయ అరంగేట్రం చేశారు. చరిత్రను సృష్టించారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత ఎత్తుకు ఎదుగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ చిక్కని, సాధ్యం కాని విధంగా చరిత్రను సృష్టించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీన తెలుగు దేశం జెండాను ఎగరేశారు. “నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం” అని ప్రకటించారు. ఆంధ్రుల అన్నగా అవతారం ఎత్తారు. తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంత వరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా 1993 జనవరి 9, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నిజానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం చాలా చిన్నది. నిండా పుష్కర కాలం కూడా లేదు. ఆ స్వల్ప కాలంలోనూ ఆయన అనేక ఆటు పోట్లను ఎదుర్కున్నారు. అయినా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనూ ప్రభావితం చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి ఆత్మ గౌరవ బావుటాను ఎగరేసిన ఎన్టీఆర్, కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు చెక్ పెట్టి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేసి కాంగ్రెస్ తిరోగమానానికి ఆనాడే ఆయన శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారథ్యంలో విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిర స్థాయిగా ఒక మెయిలు రాయిలా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.
అందుకే ఈనాటికీ జాతీయ స్థాయి నేతలంతా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. గౌరవంగా స్మరించుకుంటున్నారు. మంగళవారం(జనవరి 17) ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. ప్రజా క్షేత్రంలో ఎన్టీఆర్ కింది స్థాయిలో పోరాడి అధికారంలోకి వచ్చారని కొనియాడారు. నిత్యం ప్రజలతో మమేకమై ఎన్టీఆర్ ముందడుగు వేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీని స్థాపించి ఎన్టీఆర్ పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. నిజానికి ఒక మోడీ అని కాదు, రాజకీయాలకు అతీతంగా జాతీయ నేతలందరూ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
అలాగే ఎన్టీర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు అడుగుజాడల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పథకాల పేర్లు మారవచ్చును కానీ, స్పూర్తి మాత్రం అదే. ఎన్టీఅర్ ప్రవేశ పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన మహా నేత ఎన్టీఆర్. అలాగే, పారదర్శక పాలన, ప్రజల వద్ధకే పాలన వంటి పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అంతే కాదు, తెలుగుంటి ఆడపడుచులకు పెద్దన్నగా మహిళలకు సమాన ఆస్తి హక్కు వంటి చట్టాలు తెచ్చారు.
నిజానికి ఆధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్ ఒక మేలి మలుపుగా నిలుస్తారు. ఎన్టీఅర్ కు ముందు ఒకటి రెండు కులాలకే పరిమితం అయిన రాజకీయ అధికారాన్ని,అందరికీ చేరువ చేసిన సామాజిక చైతన్య స్పూర్తి ఎన్టీఆర్. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన, బడుగుల అత్మబందువు ఎన్టీఆర్.
అందుకే నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి ప్రధాన ఆయుధాలుగా సాగిన ఎన్టీఆర్ అనే మూడక్షరాల రాజకీయ ప్రస్థానం తెలుగుజాతి ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచి పోతుంది. ఒక మహా నటుడిగా, ఒక మహోన్నత వ్యక్తిగా, ప్రస్వామ్య స్పూర్తి ప్రదాతగా, ఒక పరిపాలన దక్షునిగా, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చరిత్ర పురుషునిగా, పేద ప్రజల ఆరాధ్య దైవంగా...ఇలవేల్పుగా తెలుగు వారి గుండెల్లో కొలువైన విధాతగా ఎన్టీఆర్ శాశ్వతంగా ఉండి పోతారు ఎన్టీఆర్.. అన్నా ..అందుకో వందనం..