సిట్టింగులకు టిక్కెట్లు.. బీఆర్ఎస్ లోప్రకంపనలు
posted on Jan 17, 2023 @ 12:53PM
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పక్క పార్టీల నుంచి గోడ దూకిన ఏమ్మేల్యీలు సహా, సిట్టింగు ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ టిక్కెట్లు ఇస్తామని ఎప్పుడో చెప్పేశారు. అది కూడా పార్టీ వేదిక నుంచి సభా ముఖంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి అంత ముందుగా ఆ ప్రకటన ఎందుకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన చేసిన ప్రకటన పార్టీలో పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ ప్రకటన నేపధ్యంగానే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంలేటి సుధాకర రెడ్డి అలర్టయ్యారు. ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సందడి చేశారు. భారాస ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు దౌత్యంతో తుమ్మల వెనక్కి తగ్గారు కానీ, పొంగులేటి అయితే తగ్గేదేలే’అంటూ ముందుకు దూసుకు పోతున్నారు. ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ జరిగే రోజు (జనవరి 18)నే ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ముహూర్తం విషయంలో ఇంకా కొంత సందిగ్దత కొనసాగుతున్నా, పొంగులేటి కారు దిగడం మాత్రం ఖాయమని తేలిపోయింది.
ఖమ్మం కథ అలా ఉంటే, వరంగల్’ జిల్లాకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహారి ఏకంగా ఆత్మగౌరవ నినాదాన్నే ఎత్తుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికలలో స్టేషన్ ఘనపూర్’ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్టిగులకే టికెట్ ప్రకటన చేసినప్పటి నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్ల్యే కడియం చిరకాల ప్రత్యర్ధి తాటికొండ రాజయ్యల మధ్య ఎప్పటినుంచో సాగుతున్న ప్రత్యన్న యుద్ధం పీక్ కు చేరింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కడియమ నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. అందుకే ఆయన ఎవరికీ తలవంచను, ఎవరికీ పాదాభివందనాలు చేయనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మహబూబాబాద్ పర్యటన సందర్భంగా, రాజయ్య సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీలు పడిమరీ ముఖ్యమంత్రికి పాదాభి వందనాలు చేశారు. ఆ సమావేశంలో ఉన్న కడియం మాత్రం తలవంచలేదు. కేసీఆర్ పాదాలకు మొక్కలేదు. ఈ నేపధ్యంలో కడియం చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.
ఇదలా ఉంటే, కడియం సంచలన వ్యాఖ్యల నేపధ్యంలో వరంగల్ జిల్లా మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో, ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో మాట్లాడిన మంత్రి దయాకర్ రావు తాను సొంతంగా చేయించిన సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని.. అయితే 20 మంది సిట్టింగ్ లను మారిస్తే 100 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. అయితే సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా, కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని దయాకర్ రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
నిజంగా ఎర్రబెల్లి సర్వే చేయించారా? గతంలో ఎప్పుడు లేనిది ఇప్పడు ఆయన స్వయంగా సర్వే ఎందుకు చేయించారు. కడియం ‘ఆత్మ గౌరవం’ నినాదం హాట్ టాపిక్ గా మారిన నేపధ్యంలో అందుకు కౌంటర్’గా ఎర్రబెల్లి సంచలన సర్వే బయట పెట్టారా?, ముఖ్యమంత్రి కేసీఆర్ కడియం ఇష్యూని డైవెర్ట్ చేసేందుకు, నమ్మిన బంటు ఎర్రబెల్లి సర్వేని తెరమీదకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసేఆర్ స్వయంగా, కదిల్చిన తేనెతుట్టె భారసలో ప్రకంపనలు సృష్టిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.