జై తెలంగాణ అనేందుకు కేసీఆర్ కు భయమా?
posted on Jan 19, 2023 @ 10:16PM
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ రేపిన దుమారం కొంత సర్డుమణిగింది. ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు వచ్చిన దారిన వెనక్కి వెళ్ళారు. ఆ వచ్చిన నలుగురూ ఏ సందేశం తీసుకు వెళ్ళారో ఏమో కానీ, భారాస నాయకులు, కార్యకర్తలే కాదు తెలంగాణ మేథావులు,సామాన్య ప్రజానీకంలోనూ అంతర్మథనం మొదలైన సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
మరో వంక ఖమ్మం సభ మంచి చెడులు, లాభ నష్టాలపై అన్ని పార్టీలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార భారాసలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడదు కదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయ విశ్లేషకులు విభిన కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా ఖమ్మం సభ ఇస్తుందనుకున్న క్లారిటీ అయితే ఇవ్వలేదని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి( తెరాస) పేరును భారతీయ రాష్ట్ర సమితిగా (భారాస) గా మార్చడంతోనే తెలంగాణ అస్థిత్వ రాజకీయాలకు, రాజకీయ విలువలకు పార్టీ దూరమైందని.. ఇప్పడు ఖమ్మం సభలో ఎక్కడా జై తెలంగాణ నినాదమే వినిపించక పోవడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతోందని విశ్లేషకులు అంటున్నారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎక్కడ తెరాస సభ జరిగినా, జై తెలంగాణ నినాదమే ప్రధానంగా వినిపించేది. చివరకు ఆ నినాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసేది, కానీ, ఇప్పడు జై భారత్ కేసీఆర్ తమ ప్రసంగం ముగించారు. కానీ, ఏ నినాదం నినదిస్తూ 1200 మంది ప్రాణత్యాగం చేశారో .. అమరులయ్యారో ఆ ‘జై తెలంగాణ’ అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఇది ప్రజలకు పార్టీకి మధ్య దురాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.
ఇదే విషయంగా రాజకీయ ప్రత్యర్దులే కాదు, మేథావులు, ఉద్యమ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏవరి దాకానో ఎందుకు, తెలంగాణ మలి దశ ఉద్యమంలో,కేసీఆర్ కు కుడి భుజంగా నిలిచిన కోదండరాం, బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగా అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పంపిణీ జాప్యానికి వ్యతిరేకంగా ఈనెల 30న ఢిల్లీలో జరప తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, కాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు పూర్తి కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని చెప్పడం అబద్దమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారన్నారు.
ప్రైవేటుకు వ్యతిరేకమని చెబుతున్న కేసీఅర్ సింగరేణిలో సగం ప్రైవేటు పరం చేసింది నిజం కాదా? అని కోదండరాం ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, విద్యా, వైద్యం, సింగరేణి ప్రైవేటు అయ్యాయనీ, ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై డిల్లీలో పోరాడుతామని, 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. ఒక్క కోదండ రామ్ మాత్రమే కాదు, భారాస నాయకులు కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంద్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ పేరును బ్యాన్ చేశారని ఆరోపించిన కేసేఆర్, ఇప్పడు స్వరాష్ట్రంలో తెలంగాణ పేరును నిషేదించారని ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.