జగన్ సర్కార్ పై గవర్నర్ కు ఉద్యోగుల ఫిర్యాదు
posted on Jan 19, 2023 @ 3:51PM
జీతాల కోసం, ప్రైవేటు ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చును. ఆందోళనకు దిగారంటే సరిపెట్టుకోవచ్చు. సమ్మెకు దిగారంటే ఔను మరేంచేస్తారని సమాధాన పడొచ్చు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు వీధుల్లోకి రావడం, ఆందోళనలకు దిగడం, సమ్మె చేయడం కాదు ఏకంగా గవర్నర్ ను కలిసి, ప్రతి నెలా ఫస్ట్’ కు జీతాలు ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకోవడం బహుశా మరో రాష్ట్రంలో ఎక్కడా ఉండదేమో. ఆ ప్రత్యేక ‘గౌరవం’ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ‘గౌరవ’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి, తమ సమస్యలను ఏకరవు పెట్టడమే కాదు, ఏకంగా తమ ప్రభుత్వం మీద తామే ఫిర్యాదు చేశారు. ఇది కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్కార్ కు మాత్రమే దక్కిన మరో ‘విశేష’ గౌరవం కావచ్చును. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏదైతే వుందో అది నభూతో న భవిష్యతి.. అన దగిన ‘అద్భుత’ సన్నివేశం కావచ్చును.
నిజమే, ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదాలు తలెత్తడం, జీతాల పెంపు కోసమో, పీఆర్సీ కోసమో సమ్మెలు చేయడం కొత్తకాదు కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్రంలో తమ పరిస్థితి ముందు నుయ్యి వెంక గొయ్యి అన్న చందంగా మారిందని, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పీఅర్సీ విషయంలో మోసపోయినా, నష్ట పోయినా ప్రభుత్వం ఏదో విధంగా ఉద్యోగులను ఆదుకుంటుందనే ఓ చిన్న ఆశతో ఉండేదని ఇప్పడు ఆ కాస్త ఆశ కూడా ఆవిరై పోవడంతో చేసేదిలేక గవర్నర్ ఆశ్రయించామని ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా ముందు గోడును వెళ్లబోసుకున్నారు. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధిఅక్రంలోకి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోలి సంతకం చేసింది మొదలు రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గతి తప్పిందని ఇంతవరకు విపక్షాలు, ఆర్థిక నిపుణులు మాత్రమే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాదారు .. వారేమన్నారంటే ...
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సూర్యనారాయణ, ఆస్కారరావుతో పాటు మరో ఆరుగురు నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెలా మొదటి తేదీనే ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సూర్యనారాయణ ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్‌ను విత్‌డ్రా చేశారు. 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారు. మేం ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు వివరించాం. మా సమస్యలను గవర్నర్ సానుకూలంగా విని కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు.
ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహరిస్తోంది. మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తాం. ఏప్రిల్ నుంచి రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఆందోళన చేపడతాం. ఆర్థికశాఖ అధికారులు, మంత్రివర్గ ఉప సంఘానికి సమస్యలు చెప్పాం. వారు స్పందించకపోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. బకాయిల చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని ఆయన్ను కోరాం అని సూర్యనారాయణ తెలిపారు.